
హైస్కూల్ విద్య.. హైరానా
కశింకోట: నూతన విద్యా విధానంలో భాగంగా మండలంలోని మూడు ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి, ప్రాథమిక పాఠశాలలకు పరిమితం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు కిలో మీటర్ల దూరంలోఉన్న హైస్కూళ్లకు అధిక వ్యయప్రయాసలకోర్చి అష్ట కష్టాలు పడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని ఉగ్గినపాలెం, అచ్చెర్ల, జి.భీమవరం ప్రాథమికోన్నత పాఠశాలలను నూతన విద్యా విధానంలో ఈ ఏడాది ఎత్తి వేశారు. ఆ పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో చదివే 6,7,8 తరగతుల విద్యార్థులు దూరంగా తాళ్లపాలెంలో ఉన్న హైస్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
● జి.భీమవరం పాఠశాలలో ఈ ఏడాది 5 నుంచి 6వ తరగతికి వచ్చిన వారు 19 మంది, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన వారు 11 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి తగ్గించడంతో విద్యార్థులు సుమారు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న తాళ్లపాలెం హైస్కూళ్లకు ఆటోల్లో చేరుకోవలసి వస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ విద్యార్థుల్లో కొందరు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపగా, మిగిలిన వారు ప్రభుత్వ హైస్కూల్‌లో చేరారు.
● అచ్చెర్ల ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిని కుదించడంతో 5 నుంచి 6వ తరగతికి వచ్చిన నలుగురు, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన ఆరుగురు విద్యార్థులు ఐదు కిలో మీటర్ల పైగా ఉన్న తాళ్లపాలెం హైస్కూల్‌కు ఆటోల్లో రావలసి వస్తోంది.
● ఉగ్గినపాలెం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలకు పరిమితం చేయడంతో అక్కడ చదివే 5 నుంచి 6వ తరగతి వచ్చిన ఎనిమిది మంది, 6 నుంచి 7వ తరగతికి వచ్చిన ఏడుగురు సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న తాళ్లపాలెం హైస్కూలుకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలల స్థాయి తగ్గించి, విద్యార్థులకు విద్యను దూరం చేయడం, ఇబ్బందులకు గురి చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు విద్యార్థులు మధ్యలో బడి మానేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలలను యథావిధిగా నిర్వహించాలని కోరుతున్నారు.
ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి తగ్గింపుతో విద్యార్థులకు అవస్థలు
దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి
మధ్యలో బడి మానేస్తున్న పేద విద్యార్థులు