
పీఎం జన్‌మన్ అమలు సంతృప్తికరం
పాడేరు : జిల్లా ఏజెన్సీలో ఆదివాసీల కోసం ప్రవేశపెట్టిన పీఎం జన్‌మన్ పథకాల అమలు సంతృప్తికరంగా ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని మోదాపల్లి, వనుగుపల్లి, వంతాడపల్లి పంచాయతీల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. మోదాపల్లిలో ఆదివాసీలు సాగు చేస్తున్న కాఫీ, మిరియాల తోటలను పరిశీలించారు. కాఫీ, మిరియాల సాగు ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయ వివరాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. కాఫీ, మిరియాల సాగు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.లక్ష ఆదాయం సమకూరుతుందని గిరిజన రైతులు వివరించారు. వనుగుపల్లి పంచాయతీ మారుమూల ముంతమామిడిలో రూ.60లక్షలతో నిర్మిస్తున్న బహుళ ప్రయోజక భవన నిర్మాణాలను పరిశీలించారు. వంతాడపల్లి సప్పిపుట్టు గ్రామంలో పీవీటీజీలు నిర్మిస్తున్న పీఎం జన్‌మన్ గృహాలను పశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని వారికి సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి బిల్లులు అందాయా లేదా అని తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఆయూష్మాన్ భారత్ కార్డుల జారీ, పీఎం జన్‌మన్ గృహాల మంజూరు తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, ట్రైకార్ అసిస్టెంట్ సీతారామయ్య, పీఎంయూ అధికారి రాజేష్ పాల్గొన్నారు.
కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్
మోదాపల్లి, వనుగుపల్లి, వంతాడపల్లి పంచాయతీల్లో పర్యటన

పీఎం జన్‌మన్ అమలు సంతృప్తికరం