
వినతుల వెల్లువ
● 144 స్వీకరణ
పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం డీఆర్వో పద్మలత, టీడబ్ల్యూ ఇంచార్జీ డీడీ రజనీ ప్రజల నుంచి 144 వినతులు స్వీకరించారు. వీటిలో ప్రధానంగా భూ సమస్యలు, ఇళ్ల మంజూరు, పాఠశాలల్లో ప్రవేశాలు, రహదారుల నిర్మాణాలు తదితర వాటిపై అధికంగా ఉన్నాయి. వీటిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారమయ్యేలా చూడాలని డీఆర్వో ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో హేమలత, ఎస్‌ఎంఐ ఈఈ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
జేసీకి సర్వేయర్ల వినతి
సాక్షి,పాడేరు: సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు బదిలీల్లో తగిన న్యాయం చేయాలని సర్వేయర్లు శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడకు వినతిపత్రం అందజేశారు.ఏజెన్సీలోని అనేక ప్రాంతాలకు చెందిన గ్రామ సర్వేయర్లంతా కలెక్టరేట్‌కు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు. రేషనలైజేషన్, బదిలీల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, విధి నిర్వహణలోను అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారంతా జేసీకి వివరించారు.
ఆర్టీసీ బస్సు మొరాయింపు
ప్రయాణికుల అవస్థలు
పెదబయలు: ముంచంగిపుట్టు నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల కేంద్రం పెదబయలులో శుక్రవారం సాయంత్రం మొరాయించి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్స్‌లేటర్ వైర్ తెగిపోవడంతో తెగిపోవడంతో నిలిచిపోయింది. దీంతో ఈ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంట తరువాత వచ్చిన వేరే బస్సులో గమ్యస్థానాలకు వెళ్లారు. కండీషన్‌లో లేని బస్సులను తిప్పడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.