
నిబంధనలకు తిలోదకాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని సీడీపీవోల బదిలీల్లో అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తవారు విధుల్లోకి చేరకుండానే పాతవారిని రిలీవ్ చేయడం ఇందుకు కారణమవుతోంది.
● స్థానిక ఐటీడీఏ పరిధిలో రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీవోల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి సీడీపీవోలకు 15 రోజుల క్రితం మైదాన ప్రాంతాలకు బదిలీ అయింది. వీరిని నిబంధనల ప్రకారం కొత్తవారు వచ్చిన తరువాత రిలీవ్ చేయాలి. అలాకాకుండా వారు విధుల్లోకి చేరకుండానే సూపర్‌వైజర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిలీవ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. దీని ప్రభావం అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణపై చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● రంపచోడవరం సీడీపీవో పరిధిలో రంపచోడవరం, దేవీపట్నం మండలాలకు చెందిన 150 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. రాజవొమ్మంగి సీడీపీవో పరిధిలో ఇదే మండలంలో 150, మారేడుమిల్లి సీడీపీవో పరిధిలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పగర్ పార్ట్ ప్రాంతాలకు చెందిన 100 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గంగవరం సీడీపీవో పరిధిలో ఇదే మండలంలో 55 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అనేది సీడీపీవోలు పర్యవేక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులు 15 రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి.
● సూపర్‌వైజర్లకు సీడీపీవోల అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ వీరికి కూడా పనిఒత్తిడి కారణంగా పర్యవేక్షించే అవకాశాలు తక్కువే. ఏజెన్సీ ప్రాంతంలో ఒక అధికారి బదిలీ అయితే నిబంధనల ప్రకారం ఆ స్థానంలో కొత్త అధికారి వచ్చిన తరువాత రిలీవ్ చేయాలి. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక అధికారి బదిలీ అయితే కొత్త వారు ఇక్కడకు వచ్చేందుకు సుముఖంగా ఉండరన్న కారణంగా ఈ నిబంధన అమలవుతోంది. ఆయా పోస్టులు ఖాళీగా ఉంటాయన్న కారణంతో కొత్త వారు వచ్చే వరకు వారిని ఐటీడీఏ అధికారులు రిలీవ్ చేయకుండా ఉంచేవారు.
సీడీపీవోల బదిలీల్లో అధికారుల తీరుపై విమర్శలు
కొత్తవారు రాకుండానే
రిలీవ్ చేయడంపై ఆరోపణలు
15 రోజులుగా ఖాళీగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పోస్టులు
ఇన్‌చార్జి సూపర్‌వైజర్లే దిక్కు!