
ప్రాజెక్టుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలందిస్తామని సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. ఇటీవలే డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. డిస్కమ్ పరిధిలోని పలు సర్కిళ్లలో పర్యటించి, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లోని అన్ని విభాగాల్లో 37 ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం తనకుందన్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్‌లో జరుగుతున్న పనులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానని, చేపట్టిన పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగర పరిధిలో రెండో దశలో భాగంగా రూ.909 కోట్ల వ్యయంతో 1,876 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 120 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్‌ఎంఈఎస్, డీటీఆర్స్ మొదలైన వాటిపై కసరత్తు జరుగుతోందని, ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే తవ్వకాల కోసం జీవీఎంసీ నుంచి అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్‌ల కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విభజన పనులపై సమీక్ష నిర్వహించామని, ఫీడర్ బైఫరకేషన్ పనుల్లో ప్యాకేజీ–1 గత నెలాఖరు చివరి నాటికి 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇండోర్, అవుట్‌డోర్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. ముందుగానే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం జుగా’(ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద ఎస్టీ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ వనజ వివరించారు.
ఆగస్ట్ 15 నాటికి రెండో దశ భూగర్భ విద్యుత్ పూర్తి చేస్తాం
ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వనజ