
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష
మహారాణిపేట(విశాఖ): జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. జూన్ 21న ఉదయం 6 నుంచి 8 మధ్య 45 నిమిషాలు పాటు కార్యక్రమం జరగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నిర్దేశించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా ఏయూ కన్వెన్షన్ హాలు, మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్ లేదా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రధాన వేదికల వద్ద భాగస్వామ్యం అయ్యే వారికి ముందస్తు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ప్రత్యేకాధికారులు సత్తిబాబు, సుధాసాగర్, శేషశైలజ, మధుసూదన్ రావు, డీఈవో ప్రేమకుమార్, ఆర్‌ఐవో, ఇతర విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.