
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన ఈ అదాలత్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నిరాధరణకు గురైన చెక్కులు కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశాఖలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్‌లో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో, మండల న్యాయ సేవా సంఘాల్లో సంప్రదించాలన్నారు.
రాష్ట్ర, జాతీయ క్రెడాయ్ కమిటీల్లో విశాఖకు పెద్దపీట
విశాఖ సిటీ: విశాఖకు చెందిన పలువురు ప్రముఖులు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్)లో రాష్ట్ర, జాతీయ స్థాయి కీలక పదవులకు ఎంపికయ్యారు. ఈ నియామకాలతో విశాఖ ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత పెరిగిందని క్రెడాయ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బయన శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా కె.ఎస్.ఆర్.కె.రాజు బాధ్యతలు స్వీకరించారు. మరో కార్యక్రమంలో.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సమక్షంలో క్రెడాయ్ జాతీయ స్థాయి పదవుల్లోనూ విశాఖ ప్రతినిధులు స్థానం సంపాదించారు. నేషనల్ ఎమర్జింగ్ సిటీస్ కన్వీనర్‌గా బొప్పన రాజా శ్రీనివాస్, సివిల్ ఏవియేషన్ కో–కన్వీనర్‌గా అశోక్‌కుమార్ ఎరడాల, క్రెడాయ్ యూత్ వింగ్ (సౌత్) జాయింట్ సెక్రటరీగా గొంప కార్తీక్ నియమితులయ్యారు.