కేకే లైన్ పనులను పరిశీలించిన ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ
తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ మంగళవారం వాల్తేర్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ముందుగా కేకే లైన్లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆయన వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులుతో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంతంలో సుమారు 20కంటే ఎక్కువ అధిక సామర్థ్యం గల ఎర్త్‌మూవర్స్, ప్రొక్లెయినర్స్, ఇతర మెషినరీని వినియోగిస్తూ 400మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాక్‌లపై సుమారు 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి వచ్చి చేరిందని, ఇప్పటికే సుమారు 8వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించినట్లు అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా పనులు కొనసాగిస్తున్నట్లు డీఆర్‌ఎం వివరించారు. సంఘటన స్థలంలోనే ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్‌లకు చెందిన వివిధ విబాగాధిపతులతో, సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం విశాఖలోని ఆశీర్వాథ్ కల్యాణమండపంలో జరుగుతున్న ఈస్ట్‌కోస్ట్‌రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. వడ్లపూడిలో గల వ్యాగన్ వర్క్‌షాప్‌ను సందర్శించారు.