
మాట్లాడుతున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంతనాయక్
సాక్షి, పాడేరు: గిరిజనుల జీవనోపాధిని పటిష్టమైన చర్యలు చేపట్టి మెరుగుపరచాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంతనాయక్ ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం ఆయన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ముందుగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన భాషలు, గిరిజన సంప్రదాయ కళలు, నృత్యాలను పరిరక్షించి భావితరాలకు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
గిరిజన యువత వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తుంటారని, ఈ దిశగా వృత్తివిద్యను అందించి,ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గిరిశిఖర గ్రామాలను గుర్తించి,అన్ని గ్రామాలకు విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు.గిరిజన ప్రాంతాలలో సమస్యలు, తన దృష్టికి వచ్చిన అన్ని ఆంశాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి ఆచార, సంప్రదాయ వ్యవహారాలపై అవగాహన పెంచుకుంటున్నామన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఆయన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్, జాతీయ ఎస్టీ కమిషన్ అధికారులు పి.కె.పరీడా, జయంత్ జే.సరోడే, రాధాకాంత త్రిపాఠే, ఆర్.ఎస్.మిశ్రా, గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు,ప్రభాకరరావు,టీసీఆర్‌ఎండ్‌టీఐ అధికారి చినబాబు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో సత్కారం
సాక్షి,పాడేరు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంతనాయక్ శనివారం కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కమిషన్ అధికారులను సత్కరించారు. అంతకముందు కలెక్టరేట్‌లోని అల్లూరి విగ్రహనికి అనంత్‌నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంతనాయక్ ఆదేశం
గిరిజనాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

అనంతనాయక్‌ను సత్కరిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్,ఐటీడీఏ పీవో అభిషేక్