
మాట్లాడుతున్న పీవో సూరజ్ గనోరే
● రంపచోడవరం ఐటీడీఏ పీవో
సూరజ్ గనోరే
రంపచోడవరం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సర్వే చేసిన భూముల వివరాలను సకాలంలో అప్లోడ్ చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఆదేశించారు. శనివారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాల సర్వేయర్లలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు మండలాల్లో 78 మంది విలేజ్ సర్వేయర్లు, నలుగురు డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్‌స్పెక్టర్లు, తొమ్మిది మంది మండల సర్వేయర్లలో 13 టీమ్‌లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 273 గ్రామాల్లో 1.601 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తయిందన్నారు. సర్వే చేసి భూముల వివరాలను తప్పుల్లేకుండా అప్లోడ్ చేయాలని సూచించారు. విలేజ్ సర్వేయర్లు, నోడల్ అధికారులు అనుమతి లేకుండా సెలవులు పెట్టవద్దని, అందుకు విరుద్ధంగా పనిచేసిన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే అఫ్ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, బాబూరావు, నాగభూషణం పాల్గొన్నారు.