పంటల రుణపరిమితి పెంపు | - | Sakshi
Sakshi News home page

పంటల రుణపరిమితి పెంపు

Jul 5 2025 6:16 AM | Updated on Jul 5 2025 6:16 AM

పంటల రుణపరిమితి పెంపు

పంటల రుణపరిమితి పెంపు

● పత్తి, మొక్కజొన్నకు రూ.2 వేలు అదనం ● బ్యాంకర్లు ఆదరించేనా.. ● రైతులకు ఆసరా లభించేనా..?

సాక్షి,ఆదిలాబాద్‌: ఈ ఏడాది పంట రుణ పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రస్థాయి టెక్నికల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) సిఫార్సుల మేరకు ఈ పెంపు ఉంటుంది. ప్రధానంగా రైతులకు ఏటా సాగులో పెట్టుబడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితి పెంపు ద్వారా అన్నదాతకు బ్యాంకులో లభించే రుణం కూడా పెరగనుంది. జిల్లాలో ఈ ఏడాది 5లక్షల 85వేల 350 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా పత్తి 4లక్షల 40వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత సోయా 62,500 ఎకరాలు, కందులు 55వేల ఎకరాలు, జొన్న 23వేల ఎకరాలు, తర్వాత వరి, మినుము, పెసర, ఇతర పంటలు స్వల్పంగా సాగు కానున్నట్లు పేర్కొంది.

పత్తి రైతుకు మేలు..

జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పత్తికి సంబంధించి పంట రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు చేకూరనుంది. ఎకరానికి నిర్ధారిత మొత్తం బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా సాగులో వారికి పెట్టుబడి భారం ఉపయుక్తంగా ఉంటుంది.

బ్యాంకులు

ఆదరించేనా..

ఈఏడాది 2లక్షల 9వేల 229 మంది రైతుల అకౌంట్లకు రుణాలు అందజేయాలని బ్యాంకర్లు లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే అన్నదాతలకు విరివిగా రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితులతో రుణం కట్టలేని పరిస్థితిలో ఉండగా, బ్యాంకర్లు దాన్ని మరోవిధంగా తమకు ఉపయుక్తంగా మార్చుకుంటున్నారు. పాత రుణాన్ని రెన్యూవల్‌ చేస్తున్నట్టే చేసే బ్యాంకర్లు రుణపరిమితి ఆధారంగా పెంచిన మొత్తాన్ని రైతుల చేతికి ఇచ్చి మిగతా మొత్తం పాత బకాయిగా సర్దుబాటు చేసుకోవడం ద్వారా తమ లక్ష్యం పూర్తయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. సాధారణంగా ఏటా బ్యాంకులో రైతుల పరంగా జరిగే ఈ తంతు సాధారణమే. ఈ పరిస్థితుల్లోనే రైతులు తిరిగి బయట అప్పు చేస్తుండడం ఆనవాయితీగా మారింది.

పంటల వారీగా రుణ పరిమితి.. (యూఐ– అన్‌ ఇరిగేటెడ్‌)

పంట ప్రస్తుత రుణ పరిమితి పెంచిన రుణ పరిమితి

ఎకరానికి (రూ.లలో) ఎకరానికి(రూ.లలో)

పత్తి (యూఐ) 44,000–46,000 46,000–48,000

సోయా 28,000–30,000 28,000–30,000

మినుము (ఇరిగేషన్‌) 19,000–21,000 20,000–22,000

మినుము (యూఐ) 15,000–17,000 16,000–18,000

పెసర్లు (ఇరిగేషన్‌) 20,000–22,000 20,000–22,000

పెసర్లు (యూఐ) 16,000–18,000 17,000–19,000

శనగ 24,000–26,000 25,000–27,000

జొన్న (ఇరిగేషన్‌) 18,000–20,000 19,000–21,000

జొన్న (యూఐ) 17,000–19,000 17,000–19,000

వరి (ఇరిగేషన్‌) 43,000–45,000 44,000–46,000

మొక్కజొన్న (ఇరిగేషన్‌) 32,000–34,000 34,000–36,000

మొక్కజొన్న (యూఐ) 26,000–28,000 28,000–30,000

గోధుమ (ఇరిగేషన్‌) 19,000–21,000 19,000–21,000

కందులు (ఇరిగేషన్‌) 22,000–24,000 23,000–25,000

కందులు (యూఐ) 19,000–21,000 20,000–22,000

విరివిగా పంట రుణాలందించాలి..

బ్యాంకర్లు రైతులకు విరివిగా పంట రుణాలు అందించాలి. పెంచిన రుణ పరిమితి ఆధారంగా పంపిణీ చేయాలి. లక్ష్యం మేరకు బ్యాంకర్లు ముందుకు సాగాలి.

– ఉత్పల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement