breaking news
safe drive
-
‘సేఫ్’ సర్టిఫికెట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ ధరించలేదని వాహనదారుడికి జరిమానా, సీటు బెల్ట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు ఫైన్, సిగ్నల్ జంపింగ్ చేశాడని మరో వాహనదారుడికి ఈ–చలాన్...ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనులను శిక్షించినట్లుగానే...ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులనూ గుర్తించి ‘సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్’ పేరుతో స్టిక్కర్ ఇచ్చి ప్రశంసిస్తున్నారు. అబుదాబీలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ పేరుతో దేశంలోనే తొలిసారిగా గురువారం చింతల్‌కుంట ఎక్స్‌రోడ్డులో సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వస్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేసిన సీపీ ఈ–చలాన్లో జరిమానాలు లేని కారు డ్రైవింగ్ చేస్తున్న లేడీ డాక్టర్ రిచా, సీనియర్ సిటిజన్ గోపాల కే సురేఖతో పాటు మరికొందరి వాహనాలకు ‘సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్’ను అతికించారు. అనంతరం వారిని సర్టిఫికెట్తో సన్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు 24 వాహనాల చొప్పున ఆరు నెలల్లో నాలుగువేల మంది వాహనచోదకులను గుర్తించి ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అబుదాబీలో 2016 అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తుండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించే అలవాటు పెరిగిందన్నారు. ఆ తరహా మార్పు త్వరలో రాచకొండ పరిధిలోని వాహనదారుల్లో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ సేఫ్ డ్రైవర్ల గుర్తింపు... ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న మర్యాద వాహనచోదకులను కూడా గుర్తించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో ప్రతిరోజూ కొన్ని వాహనాలను గుర్తించి సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందించనున్నారు. తద్వారా వారు ట్రాఫిక్ నియమాలను పాటించడంతో పాటు ఇతరులను చైతన్యం చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన వాహనచోదకుడు ఆరు నెలల పాటు మళ్లీ ట్రాఫిక్ నియమాలు తూచతప్పకుండా పాటిస్తే రివార్డుతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జోన్ల ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదంలో ఆదుకునే అత్యాధునిక డివైస్
త్రివేండ్రమ్: జాతీయ రహదారిపై మన కారు జుయ్న దూసుకెళుతున్నప్పుడు ఊహించని ప్రమాదం జరగొచ్చు. కారులో వెళుతున్న వారంతా తీవ్రంగా గాయపడొచ్చు. సాయం కోసం అరిచే పరిస్థితి లేకపోవచ్చు. అరిచినా వినిపించుకునే నాథుడు లేకపోవచ్చు. ఉన్నా మనకు ఎలా సాయం చేయాలో తెలియక పోవచ్చు. అంబులెన్స్నో, పోలీసులనో పిలిచేందుకు సాయం చేయడం కోసం వచ్చిన వాళ్ల చేతుల్లో సెల్ఫోన్లు లేకపోవచ్చు. ఉన్నా సిగ్నల్స్ అందకపోవచ్చు. క్షతగాత్రులను ఎలాగో తరలించాలనుకున్నా దగ్గర్లో వాహనం అందుబాటులో ఉండకపోవచ్చు. మరి, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మనం నిమిత్త మాత్రులమైనా మన ప్రమేయం లేకుండానే అన్నీ తానై తాను చేసుకుపోయే అద్భుత ‘సేఫ్ డ్రై వ్ డివైస్’ను కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రసాద్ పిళ్లై రూపొందించారు. సెన్సర్ల ద్వారా జరిగిన ప్రమాదాన్ని గుర్తించి ఈ డివైస్ తక్షణమే స్పందిస్తుంది. ఎలక్ట్రానిక్ నెట్వర్క్, జీపీఎస్ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన చోటును గుర్తించడమే కాకుండా దానంతట అదే సమీపంలోవున్న ఆస్పత్రికి లేదా అంబులెన్స్ సర్వీసుకు, పోలీసులకు, మనం ఫీడ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రమార సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తోంది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 28 శాతం మంది మరణిస్తున్నా, వారిలో ఎక్కువ మంది సకాలంలో సహాయం అందకనే మరణిస్తున్నారని గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ కారణంగా ఈ డివైస్ ఎంతో మేలు. దీన్ని ఆటో, కారు, జీపు, టూ వీలర్లకు అమర్చుకోవచ్చు. అంతేకాకుండా డ్రైవర్ సరిగ్గా వాహనాన్ని నడపకపోయినా గుర్తించి యజమాని లేదా కారులో ప్రయాణికులను ముందస్తుగా హెచ్చరిస్తుంది. కారు వేగం, మలుపులు, కుదుపులను సెన్సర్ల ద్వారా గుర్తించి డ్రై వింగ్ గురించి అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రసాద్ పిళ్లై రెండు సంవత్సరాల క్రితం స్వగ్రామం త్రివేండ్రమ్‌కు వచ్చినప్పుడు ఎదురైన ఓ అనుభవం నుంచి ఈ డివైస్ పుట్టుకొచ్చింది. ఓ రోజు ప్రసాద్ పిళ్లై తన భార్య పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా బ్రేకులు పనిచేయక కారు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. ముందుకు కదలేని పరిస్థితుల్లో ఉన్న కారును వదిలేసి వెళ్లాలన్నా ఎలా వెళ్లాలన్న సంశయం. సిగ్నల్స్ అందక సెల్‌ఫోన్ కూడా పనిచేయలేదు. ఎవరి సాయం ఎలా అర్థించాలో అర్థం కాలేదు. చాలా సేపటి వరకు ఆ రోడ్డున ఎవరూ రాలేదు. చివరకు కారును అక్కడే వదిలేసి దారిన పోయే ఓ వాహనాన్ని పట్టుకొని ఎలాగో ఒకలాగా ఇంటికి చేరుకున్నారు. ఇలాంటి డివైస్‌ను ఒకదాన్ని తయారు చేయాలని ఆ రోజే అనుకున్నారు. అమెరికా జాబ్‌కు గుడ్‌బై చెప్పారు. జయంత్ జగదీష్ అనే మిత్రుడితోపాటు మరో ఐదుగురిని సమీకరించి ‘ఎల్సీస్ ఇంటెలిజెంట్ డివెసైస్ ప్రై వేట్ లిమిటెడ్ ’ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కష్టపడి ఈ సరికొత్త డివైస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి నెలలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో డివైస్ వెలను పదివేల రూపాయలుగా నిర్ణయించారు. ఏడాదికి వెయ్యి రూపాయల సర్వీసు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డివైస్‌ను భవిష్యత్తులో మరింత అభివద్ధి చేస్తామని, దీనితో అనుసంధానించడానికి ఓ కాల్ సెంటర్‌నే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రసాద్ పిళ్లై తెలిపారు.