breaking news
reddy appala naidu
-
చింతమనేని హత్యకు కుట్ర, 9 మంది అరెస్ట్
ఏలూరు: వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీలో ఇప్పుడు హత్యారాజకీయాలు కూడా తెరమీదికి వచ్చాయి. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు సొంత పార్టీ నేత కుట్ర పన్నిన ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. చింతమనేని ప్రభాకర్ పాటు మరో ఇద్దరి హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలతో వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడి సహా ఎనిమిది మంది రౌడీషీటర్లను ఏలూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులోని రౌడీషీటర్ నక్కలపండు అతని అనుచరులు చింతమనేనిని హత్య చేసేందుకు ఆయుధాలతో తిరుగుతున్నట్టు జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యల కోసం టీడీపీ నేత రెడ్డి అప్పలనాయుడు తమకు డబ్బు ఇచ్చారని నిందితులు వెల్లడించారు. రెడ్డి అప్పలనాయుడు, పురంధర్ తోపాటు ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు నక్కలపండు, షేక్ యాకూబ్, షేక్ లతీఫ్, షేక్ నాగూర్, హరిష్ కుమార్, బేతా రత్నకుమార్, గున్నాబత్తుల సురేష్ లను అరెస్ట్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే రెడ్డి అప్పలనాయుడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశాల్లో విచారించి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాగా, ఇదంతా చింతమనేని ప్రభాకర్ కుట్ర అని అప్పలనాయుడు ఆరోపించారు. తనపై కక్షతో అన్యాయంగా కేసులో ఇరికించారని, బయటకు వచ్చాక నిజాలు వెల్లడిస్తానని చెప్పారు. తన భర్తను రాజకీయంగా అణగదొక్కేందుకు టీడీపీలోని కొందరు నాయకులతో పాటు చింతమనేని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అప్పలనాయుడి భార్య రెడ్డి అనురాధ ఆరోపించారు. మరోవైపు అప్పల నాయుడిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి ప్రకటించారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. -
చింతమనేనీ.. పిచ్చివేషాలు మానుకో!
టీడీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి హెచ్చరిక ఎంపీపీ పదవిని రూ.40 లక్షలకు అమ్మేశాడని ఆరోపణ నాయకులు, కార్యకర్తలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరిక ఏలూరు రూరల్: ‘‘చింతమనేని ప్రభాకర్.. పిచ్చి వేషాలు మానుకో. సామాన్య ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినట్టు పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకోం’’ అంటూ తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారం ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు చింతమనేని రూ.40 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఈ డబ్బు చేతులు మారిందన్నారు. అందుకు ప్రతిఫలంగా రెడ్డి అనురాధను ఎంపీపీ పీఠం నుంచి తొలగించి కొల్లేరు గ్రామానికి చెందిన ఎంపీటీసీకి ఆ పదవి కట్టబెట్టేందుకు చింతమనేని కుతంత్రాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఇందుకోసం పార్టీ మారిపోతున్నామంటూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. లంచాలు పుచ్చుకుని, మట్టి, ఇసుకతోపాటు అభివృద్ధి పేరిట ప్రభుత్వ సొమ్ము దోచుకుని తానేమీ సంపాదించలేదంటూ చింతమనేనికి చురకలేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి తన భార్య రెడ్డి అనురాధ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జెడ్పీ కార్యాలయానికి వెళ్లి రాజీనామా లేఖ అందించారు.