breaking news
rain slow
-
మూగ రోదన
– కరుణ చూపని వరుణుడు – పిడికెడు మేత కోసం కాపరుల పాట్లు లేపాక్షి : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా వరుణుడు కరుణ చూపకపోవడంతో జిల్లాలో వర్షాలు పడక గడ్డిపోచ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిడికెడు మేత కోసం కాపరులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటలు పండుతాయనే ఉద్దేశంతో చాలామంది రైతులు వివిధ రకాల పంటలను పెట్టుకున్నారు. దుక్కిలు చేసుకోవడానికి, విత్తనాలు విత్తుకోడానికి, కలుపులు తీసే సమయానికి సకాలంలో వర్షాలు అనుకూలించాయి. అయితే విత్తన ఉత్పత్తి దశలో పూర్తిగా వర్షాలు రాకపోవడంతో పంటలు చేతికి అందకుండా పోయాయి. కనీసం పశుగ్రాసం కూడా దొరక్కపోవడంతో పశువులు, గొర్రెలు, మేకల కాపరులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా చాలామంది పాడి ఆవులు, వ్యవసాయం చేసే పశువులను సంతల్లో చౌక బేరానికే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం కొరత అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుని కాపరులు, రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రబీలోనూ..అదే గోడు
– మొహం చాటేసిన వరుణుడు – మేఘాలు ఊరిస్తున్నా.. నేల రాని చినుకు – పంటల సాగుకు ఆటంకం ఖరీఫ్‌ను కల్లోలం చేసిన వరుణుడు రబీని కూడా వెంటాడుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో రబీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ప్రధాన పంట పప్పుశనగ సాగుకు ఈ నెలంతా మంచి అనుకూలం. అయితే.. ఇప్పటి వరకు వాన చినుకు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విస్తారంగా వర్షాలు పడాల్సిన సమయంలో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. గత పది రోజులుగా ఇదే పరిస్థితి. అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత రబీ సీజన్లో ప్రధానంగా నల్లరేగడి భూములు కల్గిన మండలాల్లో పప్పుశనగ సాగు చేస్తారు. 80 వేల నుంచి 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే..వర్షాభావం వల్ల ఇప్పటివరకు ఎక్కడా పంట విత్తుకోలేదు. అలాగే వేరుశనగ 20 వేల హెక్టార్లు, వరి పది వేల హెక్టార్లు, జొన్న, మొక్కజొన్న, ఉలవ తదితర‡ పంటలు మరో 30 వేల హెక్టార్లలో వేయనున్నారు. మొత్తమ్మీద రబీలో అన్ని పంటలు కలిపి 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సివుంది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చేవి. ఈ సారి ఇప్పటికీ నల్లరేగళ్లు కలిగిన దాదాపు 30 మండలాల్లో పదును వర్షం కాదు కదా.. కనీసం తుంపర్లు కురవలేదు. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 110.7 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. ఇప్పటివరకు కేవలం 2.3 మి.మీ నమోదైంది. అంటే వర్షాభావ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్‌లో కురిసే వర్షాలే రబీ పంటలకు ప్రాణం. తర్వాత నవంబర్‌లో 35 మి.మీ, డిసెంబర్లో కేవలం 9 మి.మీ సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు రబీ సాగుకు కీలకమైన అక్టోబర్‌లో వర్షాలకు బదులు ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో 32 నుంచి 34 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రతలు.. వారం రోజులుగా చాలా ప్రాంతాల్లో 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉరవకొండ, తాడిపత్రి, గుత్తి, రాయదుర్గం, పెనుకొండ వ్యవసాయ డివిజన్ల పరిధిలో నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పప్పుశనగ, నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు వేస్తారు. వర్షం పడకపోవడంతో పంటల సాగులో ఇప్పటికీ కదలిక లేదు. భారీ వర్షాలు లేదా జడివాన పడితే కానీ నల్లరేగడి భూముల్లో విత్తుకు సరిపడా పదును అయ్యే పరిస్థితి లేదు. వర్షం లేక ఖరీఫ్‌లో వేసిన కంది, ఆముదం, పత్తి లాంటి పంటలకు కూడా ఇబ్బంది తలెత్తుతోంది.