breaking news
OP Bhatt
-
ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్‌పేషెంట్ కవర్‌తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్‌బిల్ట్‌గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్‌ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్‌కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్‌మెంట్‌కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్‌ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్‌లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్‌లాంగ్ ‘ఎల్డర్‌కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్‌బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్‌కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్‌కు యాడాన్‌గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్‌ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్‌లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్‌లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్‌ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్‌కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
టాటా స్టీల్ నుంచీ మిస్త్రీ ఔట్!
టాటా పవర్, టాటా కెమెకిల్స్ అనంతరం టాటా స్టీల్ కూడా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై వేటు వేసింది. శుక్రవారం ఏర్పాటుచేసిన అత్యవసర బోర్డు సమావేశంలో టాటా స్టీల్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఓపీ భట్‌ను డిసెంబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు టాటా స్టీల్ బోర్డు పేర్కొంది. చైర్మన్ పదవితో కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా కూడా ఆయనకు ఉద్వాసన పలుకనున్నట్టు బోర్డు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనతో పాటు మిస్త్రీకి వంత పాడుతున్న నుస్లీ ఎన్ వాడియాను కూడా కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా తొలగించేందుకు బోర్డు నిర్ణయించింది. దీనికోసం డిసెంబర్ 21న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు బోర్డు పేర్కొంది. ఈ సమావేశంలోనే బోర్డు చైర్మన్‌ను నియమించనున్నారు. మెజారిటీ బోర్డు మెంబర్లు మిస్త్రీని చైర్మన్‌గా తొలగించేందుకు మొగ్గుచూపినట్టు టాటాస్టీల్ పేర్కొంది. అయితే టాటా గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మిస్త్రీని గ్రూప్‌లోని మిగతా కంపెనీల చైర్మన్‌గా కూడా తొలగించాలని నిర్ణయించిన టాటా సన్స్, ఈ మేరకు కంపెనీలు బోర్డు సమావేశాల్లో ఆయనపై వేటు వేయాలని ఆదేశిస్తూ ఓ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు టాటా పవర్, టాటా కెమెకిల్స్ ఇప్పటికే మిస్త్రీని చైర్మన్‌గా తొలగించాయి.