breaking news
Microchips
-
తెరపైకి తెలివైన బుర్ర
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్‌లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటి ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. మైక్రో చిప్స్‌ను, అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించి ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవల ందించే ఏఐ ఆధారిత మాడ్యూల్స్ కూడా రూపొందుతున్నాయి. ఊపిరిపోస్తున్న పరిశోధనలు చిప్‌ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు.. మన దేశంలో ఐఐటీ విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ‘శక్తి’ పేరిట చిప్‌ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలుకల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ.. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్‌ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు పదేళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఏయే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయవచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికలను పసిగట్టి, గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను క్రోడీకరించి అందించే మాడ్యూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్ర చికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స వంద శాతం విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి.. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మాడ్యూల్స్‌కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు.. ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్‌ను, ఏఐ ఆధారిత చిప్స్‌ను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60 శాతం పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20 శాతమే సమకూర్చుకుంటోందని అంటున్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్‌సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మాడ్యూల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ, మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సెమీకండక్టర్స్ రూపకల్పనపై దృష్టిపెట్టాలి సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మనవాళ్లు సెమీ కండక్టర్లు, చిప్‌ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడా అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎల్రక్టానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి.. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధికారి, జేఎన్టీయూహెచ్ తోడ్పాటుకు ‘ఏఐ’ సరే.. తుది నిర్ణయం సరికాదు న్యాయవ్యవస్థలో కొత్త సాంకేతికత ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దానికి పరిమితులు ఉండాలి. సాక్ష్యం, నేర దర్యాప్తు, పాత తీర్పుల తోడ్పాటు వంటి అంశాలకే ఏఐ పరిమితం అవ్వాలి. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ, తీర్పులో మానవ మేధోశక్తి మాత్రమే పనిచేయాలి. అప్పుడే తీర్పులు వాస్తవికతకు అద్దం పడతాయి. ఏఐ ఎంత శక్తివంతమైంది అయినా దాన్ని న్యాయ వ్యవస్థలో పరిమితంగానే వాడాలి. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తి -
శరీరాన్నే ఐడీ కార్డులుగా..!
ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగులకు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే స్వీడిష్ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ ఫాలో అయిపోతే సరిపోతుంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీచోటా ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా తమ శరీరాన్నే మైక్రోచిప్‌లతో నింపేస్తున్నారు స్వీడిష్ ప్రజలు. బియ్యపు గింజ పరిమాణంలో ఉండే మైక్రోచిప్‌ను చేతిలో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో అమర్చుకోవడం ద్వారా జిమ్ కార్డు, ఆఫీసు కీ కార్డులను రీప్లేస్ చేసేస్తున్నారు. 2015 నుంచే సుమారు 3 వేల మంది స్వీడిష్ ప్రజలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ తెలిపింది. గతేడాది స్వీడన్ రైల్వే శాఖ బయోమెట్రిక్ చిప్స్ కలిగి ఉన్న తమ ప్రయాణికుల చేతిని స్కాన్ చేయడం ద్వారా ప్రయాణంలోనే టికెట్లు అందించే సరికొత్త విధానానికి తెరలేపింది. మైక్రోచిప్ అమర్చుకోవడం సులువే.. కానీ.. ఇంజక్షన్ చేయించుకున్నంత తేలికగా శరీరంలో మైక్రోచిప్‌ను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని పని ప్రదేశాల వద్ద ఇలా మైక్రోచిప్‌లను అమర్చే వారు అందుబాటులో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు, జీవక్రియలపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని మైక్రోబయాలిస్టులు హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్ ప్రమాదం తక్కువే... స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్ గ్రూప్ బియానిఫికెన్ ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. స్వీడన్‌తో పాటు యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో దేశాల్లో ప్రజలు తమ చేతుల్లో మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి కనబరినట్లు తెలిపింది. స్నాక్స్ కొనేందుకు, కంప్యూటర్ లాగిన్, ఫొటోకాపియర్ ఇలా చిన్న చిన్న పనులకు కూడా మైక్రోచిప్‌లు అమర్చుకోవడం చూస్తుంటే టెక్నాలజీ పట్ల యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందని బయోఫికెన్ పేర్కొంది. శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చిన నేటి తరంలో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లంటూ అనేక రకాల గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే బదులు చేతి వేళ్లను ఆడించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకోవచ్చని బయోఫికెన్ స్థాపకుడు హాన్స్ సోబ్లాడ్ సలహా కూడా ఇస్తున్నారు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల సుమారు 10 మిలియన్ల మంది మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
సూపర్ హ్యూమన్!
విడ్డూరం సైన్స్‌ఫిక్షన్‌లో మనం చదువుకొని ఆశ్చర్యపడిన విషయాలన్నీ నిజ జీవితంలో ఆచరణలోకి వచ్చి అబ్బురపరిచాయి. శాంటి కొర్పోరాల్ వ్యవహారం కూడా అంతే. సిడ్నీ(ఆస్ట్రేలియా)కు చెందిన కొర్పోరాల్ తన హస్తాల్లో మైక్రోచిప్స్‌ను అమర్చుకున్నారు. దీనివల్ల ఆమె... తాళం చెవి లేకుండానే డోర్ ఓపెన్ చేయవచ్చు. ఎలాంటి పరికరం లేకుండానే కారు డోర్స్‌ను ఓపెన్ చేయవచ్చు. పాస్వర్డ్ ఉపయోగించకుండానే కంప్యూటర్లోకి వెళ్లవచ్చు. మైక్రోచిప్స్ బియ్యపు గింజ ఆకారంలో ఉంటాయి. ఇది మాత్రమే కాదు... పర్స్‌లు, కార్డులలాంటివేమీ ఉపయోగించకుండా కొత్తదారిలో ప్రయాణించాలనేది ఆమె భవిష్యత్ కల. పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు అవసరం లేని సరికొత్త జీవితం చూడొచ్చు అంటుంది కొర్పోరాల్. ‘‘ఆ తరువాత ఏమిటి? అనేదానికి ఆకాశమే హద్దు’’ అంటున్న కొర్పోరాల్ పరికరాల సహాయం లేకుండా ఎన్నో పనులు చేయాలని కలలు కంటోంది. కలలు కనడమే కాదు ఇంప్లాంట్స్ కోసం భర్త స్టీవెన్స్‌తో కలిసి ‘చిప్ మై లైఫ్’ పేరుతో డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌ను మొదలుపెట్టింది. సూపర్ హ్యూమన్‌లు నిజ జీవితంలో కూడా కనిపించే రోజు ఇంకెంతో కాలం లేదని అంటోంది కొర్పోరాల్.