breaking news
Kaifiyat Express
-
యూపీలో మరో రైలు ప్రమాదం
♦ పట్టాలపై బోల్తాపడ్డ ట్రక్కును ఢీకొన్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ♦ 100 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం ♦ రైల్వే బోర్డు చైర్మన్ రాజీనామా.. కొత్త చైర్మన్‌గా అశ్విని లోహియా లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఐదురోజుల్లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ఘటనను మరవకముందే.. ఔరైయా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వేశాఖ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ఘటనలో 100 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు నిర్మాణ పనులకోసం ఇసుకలోడుతో ఉన్న ట్రక్కును ఢీకొనటంతో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ (ఆజాగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న రైలు)లోని 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక బోగీ బోల్తా పడటం వల్ల క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉందని ఔరైయా ఎస్పీ సంజయ్ త్యాగి వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది. గాయపడిన వారిని సైఫై, ఎటావా ఆసుపత్రులకు తరలించామని.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని త్యాగి తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం కొందరిని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనతో ఈ మార్గంలో వెళ్లాల్సిన 40 రైళ్లను దారిమళ్లించారు. కాన్పూర్–ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను రద్దుచేశారు. గురువారం నుంచి యధావిధిగా రైళ్లు నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ఎలా జరిగింది?: ప్రమాదం జరిగిన మార్గం చాలా ముఖ్యమైనది. ఇటీవల రైళ్ల ట్రాఫిక్ పెరగటంతోపాటుగా ట్రాక్ విస్తరణ చేపట్టారు ఇందుకోసం పాటా, అచ్చాల్దా స్టేషన్ల మధ్య పట్టాలకు ఆనుకునే పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి ఇసుక లోడ్‌తో వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్ వద్దకు రాగానే ఓ పక్కకు ఒరిగింది. బరువు ఎక్కువగా ఉండటంతో ట్రక్కు పట్టాలపై పడిపోయింది. ఈ విషయంపై సమాచారం లేకపోవటంతో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చింది. ప్రమాదాన్ని ముందే ఊహించిన డ్రైవర్ ఎస్కే చౌహాన్ ఎమర్జెన్సీ బ్రేకుతో రైలు ఆపేందుకు ప్రయత్నించారు. రైలు వేగం కొంతమేర తగ్గినా.. అప్పటికే ట్రక్కు సమీపంలోకి వచ్చేయటంతో ప్రమాదం జరిగింది. రైలు వేగంగా ట్రక్కును ఢీకొట్టడంతో ఇంజన్ సహా బీ2, హెచ్1, ఏ1, ఏ2, ఎస్ 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ఒక బోగీ బోల్తాపడింది. ట్రాక్‌పై ట్రక్కు పడిన విషయం తనకు ముందే తెలిసుంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదని గాయాలతో బయటపడ్డ డ్రైవర్ చౌహాన్ తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ రాజీనామా ఐదురోజుల్లోనే రెండు రైలు ప్రమాద ఘటనల నేపథ్యంలో రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ రాజీనామా చేశారు. దీనిపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఈ రాజీనామాను రైల్వే మంత్రి ఆమోదించారు. 2016 జూలైలోనే మిట్టల్ పదవీ కాలం ముగిసింది. అయితే రైల్వే శాఖ వ్యవహారాల్లో అత్యంత సమర్థుడిగా పేరున్న మిట్టల్ పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం జూలై 2018 వరకు పొడిగించింది. కాగా, మిట్టల్ స్థానంలో ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విని లోహానీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైల్వే మెకానికల్ సర్వీసెస్‌లో కొంతకాలం పనిచేసిన లోహానీ.. ఢిల్లీ డివిజనల్ రీజనల్ మేనేజర్‌గా, ఐటీడీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. -
పట్టాలు తప్పిన కైఫియత్ ఎక్స్‌ప్రెస్
అరియా: ఉత్తర్‌ప్రదేశ్‌లో కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు పట్టాలు తప్పింది. అరియా వద్ద న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అచ్చాల్దా స్టేషన్ దాటాక పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే శాఖ పీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. ఈ ఘటనలో 74 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను అచ్చాల్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై మాట్లాడిన రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.