breaking news
Holy Quran
-
ఇన్షా అల్లాహ్
మీరు కోరుకున్నదల్లా అల్లా ఇవ్వాలి పిల్లలకు మనం ఇచ్చే విలువైన బహుమతి... నైతిక విలువలు. అవి పిల్లలు నేర్చుకుంటే... భవిష్యత్ తరం నేర్చుకున్నట్లే. రమజాన్ మాసం గురించి పిల్లలకు చెబితే మనకు పుణ్యం. వారికి కాంతి దర్శనం. రమజాన్ పవిత్రతను తెలియజేయడానికి ఇది సరియైన సందర్భం. రమజాన్ అంటే... ప్రతి క్షణం వెయ్యి పవిత్ర దినాలయ్యే కాలం. రమజాన్ అంటే... ఆత్మదర్శనం... మానవులందరికీ మార్గదర్శకం, రుజు మార్గం చూపే పవిత్రగ్రంథం ‘ఖురాన్’ ఉదయించిన మాసం. పవిత్ర ‘ఖురాన్’ను అర్థం చేసుకోవాల్సిన మాసం. అక్షరాల ఆచరించాల్సిన మాసం. వినయ విధేయతల మాసం... దానధర్మాల మాసం. ఈ పవిత్రమాసంలో కోరుకున్నవి అల్లాహ్ నిజం చేస్తాడు. వర్షాలు కురవాలి... వాగులు వంకలు నిండాలి... పొలాలు పచ్చపచ్చగా నవ్వాలి... కార్మికుడికి కడుపు నిండాలి, పేదవాడికి ఊపిరందాలి.‘నా’ అనే భావం మాయమవ్వాలి. ‘మన’ అనే భావం మొలకెత్తి వటవృక్షం కావాలి. స్వార్థపు గోడలు నిట్టనిలువునా కూలిపోవాలి. పరుల కోసం చేసే త్యాగాలు హిమాలయాలంత ఎత్తవ్వాలి. చిన్నోళ్లు పెద్దోళ్లు... ఇంటి వాళ్లు, ఇరుగు వాళ్లు, పొరుగు వాళ్లు అందరం ఆనందంగా ఉండాలి. ఇన్షా అల్లాహ్... పవిత్ర ఖురాన్ ఆవిర్భావం... ఎటు చూసినా కపటం, మోసం, లోభం, కామం, నేరం... పెరిగిపోతున్నాయి. ఐహిక లాలస, ధనపిపాసే జీవిత పరమావధిగా మారిపోతున్నది. ముహమ్మద్ కలవరపడిపోతున్నారు. విచారిస్తున్నారు. ‘ఎందుకిలా?’ అని తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. సృష్టికర్తకు, సృష్టికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి మక్కా నగరం సమీపంలో ఉన్న హిరా కొండ గుహలో ఏకాగ్రచిత్తంతో కూర్చుండేవారు. ఒకరోజు ఆయన ధ్యానముద్రలో ఉండగా అశరీరవాణి వినిపించింది... తలెత్తి చూడగా ఎదురుగా దైవదూత. ‘చదువు! సృష్టించిన నీ ప్రభువు పేరుతో’ అన్నాడు. ఇక్కడ చిత్రమేమిటంటే ఎవరిని ఉద్దేశించి అయితే ‘చదువు!’ అని వినిపించిందో ఆయనకు చదువు రాదు. నిరక్షరాస్యులు. కానీ దైవానుగ్రహంతో అనర్గళంగా చదివేశారు. దైవనిర్ణయం అంతుపట్టనిది కదా! అలా ముహమ్మద్(స) అంతిమ దైవప్రవక్తగా అవతరించారు. అల్లాహ్ సందేశాలు అందుకున్నప్పుడల్లా ముహమ్మద్ (స) విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవారు. దైవం నుంచి తనకు అందిన సందేశాలను ప్రవక్త తన అనుచరులకు చెబుతుండేవారు. ప్రవక్త నోటి నుంచి వచ్చిన సందేశాన్ని తమకు ఏది అందుబాటులో ఉంటే దానిపై రాసేవారు. రాసిన తరువాత ప్రవక్తకు చదివి వినిపించేవారు. అది సరిగ్గా రాశారని నిర్ధారించుకున్న తరువాతే దానిని భద్రపరిచేవారు. ఇలా దైవసందేశావతరణ 23 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ దివ్య సందేశమే ‘ఖుర్ ఆన్’గా వెలుగుదారి చూపింది. అరబ్బీలో ‘ఖుర్ ఆన్’ అంటే ‘చదువుట’ ‘వల్లెవేయుట’ ‘పదే పదే చదువుట’ అని అర్థం. పవిత్ర మాసం రమజాన్ రమజాన్ చాంద్రమాన మాసం. ఇస్లామీయ క్యాలెండర్‌లోని పన్నెండు నెలలలో తొమ్మిదవ నెల రమజాన్. షాబాన్ నెలలో అమావాస్య తరువాత కనిపించే నెలవంకను చూసిన అనంతరం... వేకువ జాము నుంచే రమజాన్ మొదలవుతుంది. ఇది యావత్ ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ నెలలోనే దివ్య ఖురాన్ ఆవిర్భవించింది. నెలరోజుల తరువాత షవ్వాల్ మాసపు నెలవంకను చూసి ‘ఈదుల్ ఫితర్’ అంటే రమజాన్ పర్వదినం ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. నమాజ్‌తో ఇహ, పర ప్రయోజనాలు... ‘నమాజ్’. విశ్వాసులకు ఇది తప్పనిసరి విధి. రోజూ అయిదు పూటలు వారు నమాజ్ ఆచరిస్తారు. ఈ అయిదు నమాజులను ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా పేర్లతో పిలుస్తారు. ఉషోదయానికి ముందు ప్రాతఃకాల నమాజును ‘ఫజర్’ అని, సూర్యుడు నడినెత్తి నుండి వాలిన మధ్యాహ్న సమయ నమాజును ‘జొహర్’ అని, సాయంకాలం 4 గంటల తరువాత చేసే నమాజును ‘అసర్’ అని, సూర్యాస్తమయం వెంటనే చేసే నమాజును ‘మగ్రిబ్’ నమాజ్ అని, సూర్యాస్తమయమై 7 గంటలు దాటిన తరువాత చేసే నమాజును ‘ఇషా నమాజు’ అని అంటారు. దైవారాధన విధానంలో అత్యున్నత స్థాయి ఆరాధనా విధానం నమాజ్. ఇందులో అనేక రకాల ఆరోగ్య రహస్యలు కూడా ఇమిడి ఉన్నాయి. దైవప్రసన్నత కోసం చేసే ఆరాధన విధానంలో దేవుడు ఆరోగ్య పరిరక్షణ కూడా ఉంచాడు. నమాజులో ఆచరించే వివిధ భంగిమలు మానవారోగ్యాన్ని నిలకడగా, సురక్షితంగా ఉంచడానికి దివ్య ఔషధంలా ఉపకరిస్తాయి. ఉదాహరణకు... నమాజులో మొదటి భంగిమ నిటారుగా నిలబడడం. దీన్ని ‘ఖియామ్’ అంటారు. అంటే తక్బీరె తహెరీమా (అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం)... తరువాత కొద్దిసేపు అలా నిటారుగా నిలబడడం. తరువాత అలా నిటారుగా నిలబడి ‘ఖిరాత్’ చేయాలి. అంటే, అదే భంగిమలో దృష్టిని సజ్ దా ప్రదేశంలో నిలిపి పవిత్ర ఖురాన్‌లోని కొంత భాగాన్ని పఠించడం. తరువాత భంగిమ ‘రుకూ’ అంటే రెండు అరచేతులను మోకాలి చిప్పలకు ఆన్చి నడుమును బల్లపరుపుగా వంచడం. ‘రుకూ’ నుండి నిటారుగా లేచేటప్పుడు ‘సమిఅల్లా హులిమన్ హమిద’ అనాలి. దీన్ని ‘తస్మీ’ అంటారు. ఆ తరువాత ‘సజ్ దా’ భంగిమ. రెండు మోకాళ్ళు, రెండు అరచేతులకు భూమిని ఆలంబనగా చేసి, నుదిటిని, ముక్కును నేలకు ఆన్చాలి. ‘అల్లాహు అక్బర్’ అంటూ ‘సజ్ దా’ రెండుసార్లు చెయ్యాలి. రెండుసార్లూ ‘అల్లాహు అక్బర్’ అనాలి. తరువాత భంగిమ ‘ఖఅద’ లేక ‘ఖాయిదా’ అంటే అత్తహియ్యాత్ చదవడానికి కూర్చోవడం. రెండు మోకాళ్లను వెనుకకు మడిచి, ఎడమవైపు పాదాన్ని కుడివైపుకు అడ్డంగా మడిచి, కుడిపాదాన్ని మునివేళ్ళపై నిటారుగా నిలిపి ఎడమ పాదంపై బరువు వేసి కూర్చోవడం... ఈ అన్ని సమయాల్లో దృష్టిని ఎటూ మరల్చకుండా దైవధ్యానంలో మనసు నిమగ్నం చేయాలి. చూపుల్ని కూడా అటు ఇటు తిప్పకూడదు. తరువాత కుడివైపుకు, ఆ తరువాత ఎడమవైపుకు సలాం చేయాలి. అంటే మెడను ముందు కుడివైపుకు, తరువాత ఎడమవైపు తిప్పాలి. సలాంతో నమాజ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. ఆత్మనిగ్రహం అలవడుతుంది. శరీరం అదుపులో ఉంటుంది. ‘ఖియాం భంగిమ’ పాదాలను, చేతులను పటిష్ట పరుస్తుంది. కాలి మడమలకు, మెడకు బలాన్ని చేకూరుస్తుంది. ‘రుకూ భంగిమ’ వల్ల శరీరంలోని కొవ్వు కరిగించబడుతుంది. నడుము నొప్పి దూరమవుతుంది. వెన్నెముకకు బలం చేకూరుతుంది. ‘సజ్ దా భంగిమ’ వల్ల కాలి వేళ్ళతో సహా, అన్ని అవయవాలకు సమతులమైన వ్యాయామం లభిస్తుంది. మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. నడుము, భుజకండరాలకు శక్తి లభిస్తుంది. ‘ఖఅద భంగిమ’ వల్ల మెదడుకు సంబంధించిన కండరాలు ఉత్తేజితమవుతాయి. పిక్కలు, కాళ్ళు, మోకాళ్ల కండరాలు పటిష్టవంత మవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనసు నియంత్రణలోకి వస్తుంది. మొత్తంగా నమాజు భంగిమల వల్ల శారీరక, మానసిక రుగ్మతల నుండి విముక్తి లభిస్తుంది. శరీరం దృఢంగా తయారవుతుంది. ఆలోచనాశక్తి, మంచీచెడుల విచక్షణా శక్తి అలవడుతుంది. కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలపై అదుపు సాధించే శక్తి జనిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. రక్తపోటు, మధుమేహం, ఉదర కోశ సంబంధిత వ్యాధుల నుండి నివారణ లభిస్తుంది. - యండి.ఉస్మాన్ ఖాన్రోజా ఖురాన్ ప్రకారం రమజాన్ నెలలో విధిగా ఉపవాసవ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసాన్ని ‘రోజా’ అని, అరబ్బీలో ‘సౌమ్’ అని పిలుస్తారు. రమజాన్ నెల ప్రారంభం నుంచి ముగిసేవరకు నిష్ఠగా రోజా పాటించాలి. రోజాలో ఉన్నవారు తెల్లవారుజామున భోజనం చేసి సూర్యాస్తమయ్యేంత వరకు ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ‘సహర్’ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ తరువాత తీసుకునే ఆహారాన్ని ‘ఇఫ్తార్’ అని అంటారు. రమజాన్ నెలలో సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాస దీక్ష పాటించడమే రోజా. ఇది కేవలం ఉపవాసదీక్ష మాత్రమే కాదు... నియమనిష్ఠలతో కూడిన జీవన విధానం రమజాన్ మాసంలో కనిపిస్తుంది. అబద్ధం ఆడకూడదు. పరనిందకు పాల్పడకూడదు. శారీరక, మానసిక వాంఛలకు దూరంగా ఉంటూ దైవచింతనలో గడపాలి. ఉపవాసదీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతిని పెంపొందించడం, నైతిక విలువలు, సుగుణాలను ప్రోదిచేయడం. దీన్ని పవిత్ర ఖురాన్ ‘తఖ్వా’ అంటోంది. ఉపవాస దీక్ష మాత్రమే కాదు... రమజాన్ అంటే ఉపవాసదీక్షలు చేసే మాసం మాత్రమే కాదు... మనిషిలో చెడును, అధర్మాన్ని రూపుమాపేది. రమజాన్ మాసంలో పేదవాడికి ఒక పూట అన్నం పెడితే, అల్లా మనకు 100 పూటలా అన్నాన్ని ప్రసాదిస్తాడు. వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారు, రుతుస్రావం గల స్త్రీలకు రోజా నుంచి మినహాయింపు ఉంది. కానీ వారు ఆ తర్వాత ఖజా రోజాలు పాటించాలి. ఉపవాసం-ఉపయోగం * సహనాన్ని పెంపొందిస్తుంది. పరుషపదాలను నోటి దగ్గరకు రానివ్వదు. * ఎవరైనా తగాదాకు వస్తే ‘నేను ఉపవాసంతో ఉన్నాను’ అని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు ప్రవక్త. * శరీరంలోని మలినాలన్నీ దూరమవుతాయి. * ఉపవాసాలు స్వీయనియంత్రణను నేర్పుతాయి. ఉదా: ఆకలితో ఉన్న మనిషిలో అసహనం ఎక్కువగా ఉంటుంది. చీటికిమాటికి కోపం వస్తుంది. మానసిక నియంత్రణ కోల్పోతాడు. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులలోనూ రమజాన్ ఉపవాసాలు సంయమనాన్ని నేర్పుతాయి. ఈ నెలలో నేర్చుకున్న సహన పాఠాలు అప్పటికే పరిమితం కావు. రాబోయే కాలానికి రక్షగా నిలుస్తాయి. * ఆకలి విలువ తెలుస్తుంది. దీనివల్ల పేదవారి ఆకలి గురించి ఆలోచిస్తాం. దాన ప్రవృత్తి పెరుగుతుంది. శాంతి చిహ్నం ఖర్జూరాలు ఇఫ్తార్‌లో ముఖ్యమైన ఆహారం. ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలు ఉపయోగిస్తారు. ఖర్జూరం అనేది శాంతికి చిహ్నం. ‘ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో... ఖర్జూరం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి’ అని చెబుతుంది ఒక అరబిక్ సామెత. ఖర్జూరం... ఉపవాసం ఉన్న వ్యక్తి ఆకలి భావనను తగ్గిస్తుంది. తరావీహ్ రమజాన్ మాసంలో ప్రత్యేకంగా చేయబడే నమాజ్ తరావీహ్. ఈ నెలలో వీలైనంత ఎక్కువగా దైవారాధన చేయాలని, దివ్య ఖురాన్ పూర్తిగా పారాయణం చేయాలని ప్రవక్త చెబుతారు. ప్రతిరోజు చేసే అయిదు పూటల నమాజ్‌లో ఇషా నమాజ్ చివరిది. తరావీహ్ నమాజ్‌ను ఇషా నమాజ్ తరువాత చేయాలి. ‘తరావీహ్’ అనే పదం ‘రాహత్’ నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి తీసుకొని మరీ చేయాల్సిన నమాజు అని భావం. దివ్యఖురాన్లోని ముప్ఫై అధ్యాయాలను తరావీహ్ నమాజ్‌లో రోజుకు ఒకటి చొప్పున చదువుతారు. ఏతేకాఫ్ రమజాన్ నెల 21వ రోజు నుంచి చివరి వరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇదే ‘ఏతేకాఫ్’. ఏతేకాఫ్ అంటే ఒకేరకమైన తపోనిష్ట. ‘ఏతేకాఫ్’ పాటించేవారు మసీదులోనే ఒక పక్క డేరాలాగా తెరను కట్టుకొని దైవధ్యానం, పవిత్ర ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నులవుతారు. ‘ఏతేకాఫ్’లో ఉన్నవారు బలమైన కారణం ఉంటే తప్ప బయటికి పోకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు. దాదాపుగా మౌనంగా ఉండాలి. షబ్-ఎ-ఖద్ రమజాన్ నెలలోని చివరి 5 బేసి రాత్రుల్లో (21,23, 25, 27,29) ఒక రాత్రి షబేఖద్.్ర అయితే 27వ రాత్రి లైలతుల్ ఖద్ ్రకావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంతటి గొప్ప రాత్రి ఫలానా రాత్రి అని దేవుడు ఎందుకు తెలియ జెయ్యలేదూ... అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం కావచ్చు. బహుశా ఆ రాత్రిని అన్వేషించే తాపత్రయంలో తన దాసులు సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధనల్లో గడపాలని, తమ పాపాల క్షమాపణ కోసం మరింత అధికంగా వారు వేడుకోవాలన్నది కారుణ్య ప్రభువు ఉద్దేశ్యం కావచ్చు. జకాత్ రమజాన్ నెలలో జకాత్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. సంపన్నులు ‘జకాత్’ విధిని తప్పక నెరవేర్చాలని పవిత్ర ఖురాన్ చెబుతుంది. ఆస్తిలో నుంచి ఒక నిర్ణీత మొత్తాన్ని దానం చేయడాన్నే ‘జకాత్’ అని అంటారు. ఇది పేదసాదల ఆర్థిక హక్కు. వారు కూడా అందరితో పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలన్నది, సంతోషంగా మనుగడ సాగించాలన్నది అసలు ఉద్దేశ్యం. ఫిత్రా రమజాన్ మాసంలో ఆచరించే మరోవిధి ‘ఫిత్రా’. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ ్రఅంటే శాబ్దిక అర్థం ఉపవాస విరమణ. షరియత్ పరిభాషలో ‘సదఖయెఫిత్’్ర అంటే... రోజా పాటించేటప్పుడు జరిగిన పొరపాట్లు, లోపాలకు పరిహారంగా రమజాన్ చివర్లో విధిగా చెల్లించవలసిన దానం అని అర్థం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేదసాదలు కూడా అందరితో పాటు పండుగ జరుపుకోవడానికి, పండుగ సంతోషంలో భాగస్వాములు కావడానికి ‘ఫిత్రా’ ఉపయోగపడుతుంది. పవిత్ర ఖురాన్ బోధనలు 1. ‘భూమిపై కల్లోలం సృష్టించకు. అలా సృష్టించేవారిని అల్లాహ్ క్షమించడు’ 2. జకాత్ ప్రతి ముస్లిం విధి. తద్వారా ప్రపంచంలోని పేదరికాన్ని తొలగించవచ్చు. 3. వృథా ఖర్చు చేయకండి. వృథా ఖర్చు చేసేవారు సైతాను సోదరులు. 4. తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. వారిని వృద్ధాప్యంలో కసురుకోకండి. 5. పేదరికానికి భయపడి సంతానాన్ని హత్య చేయకండి. 6. అశ్లీలం వైపు అడుగులు వేయకండి. అశ్లీలమే వ్యభిచారం వైపుకు నడిపించి కుటుంబాల వినాశనానికి కారణమవుతుంది. 7. వడ్డీ తీసుకోవడం మానేయండి. అల్లాహ్ వడ్డీని నశింపచేశాడు. 8. బంధుత్వ సంబంధాలను తెంచుకోవడం మానేయండి. 9. న్యాయమే పలకండి. మీ దగ్గరి వారి విషయంలోనైనా సరే. 10. పురుషులకు స్త్రీల పై ఉన్న హక్కులే స్త్రీలకు పురుషులపై ఉన్నాయి. -
రోజా, ఖురాన్... దేవుడి వరాలు
ఇస్లాం వెలుగు ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. ఇది పవిత్ర రమజాన్ మాసం. దైవ విశ్వాసుల పాలిట వరాల వసంతం. అందుకే దైవ విశ్వాసులంతా ఈ పవిత్రమాసంలో ఉపవాస వ్రతం పాటిస్తారు. ఇది సృష్టికర్త తరఫున మోపబడిన విధి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ ఇలా వివరిస్తోంది: ‘‘విశ్వాసులారా! గత ప్రవక్తల అనుయాయులకు ఏ విధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అలాగే ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు ఆచరించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’’ (2-183). దైవం పట్ల భయభక్తులు ఉన్నప్పుడే మనిషి అన్ని రకాల చెడులనూ, దుర్మార్గాలను విసర్జించి మంచిని స్వీకరిస్తాడు. ప్రతి మనిషీ మరణానంతరం ప్రపంచంలో తాను చేసుకున్న కర్మలకు పరలోకంలో విశ్వ ప్రభువు ముందు సమాధానం చెప్పుకోవలసి ఉన్నందున ఆ ప్రకారమే ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుంది. విశ్వాసి మదిలో నిరంతరం మెదిలే ఈ భావనే దైవభీతి. ఇలాంటి భయభక్తులు కలిగిన మనిషి సమస్త చెడులకు, పాపాలకు దూరంగా ఉంటూ సదాచార సంపన్నుడై సదా పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం గడుపుతాడు. పై వాక్యంలో రమజాన్ ఉపవాసాల అసలు ఉద్దేశం ‘దైవభీతి’ లేక ‘దైవభక్తులు’ అని తెలియజేయబడింది. అంటే రమజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు మనిషిలో భయభక్తుల్ని జనింప జేసి, ఆ భావనలను పటిష్టం చేసే శిక్షణ ఇస్తాయన్నమాట. దైవం విశ్వాసులకు రమజాన్ ఉపవాసాలు పాటించాలని ఆజ్ఞాపించిన ఉద్దేశంలో దైవభీతితో పాటు, కృతజ్ఞత తెలియజేసుకోవడం కూడా ఉంది. అంటే, దైవం రమజాన్ మాసంలో మానవుల జీవితాలను సమూలంగా సంస్కరించి వారికి ఇహ పర సౌభాగ్యాలు అనుగ్రహించే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపజేసినందుకు వారాయనకు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. ‘‘దైవం మీకు రుజుమార్గం చూపినందుకు ఆయన ఔన్నత్యాన్ని కొనియాడడానికి, ఆయనకు కృతజ్ఞులై ఉండేందుకు గాను ఈ సౌలభ్యం ప్రసాదించాడు’’ (2-185). రమజాన్ ఉపవాసాలు పాటించడం ద్వారానే మనం దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకోగలుగుతాం. ఈ పవిత్ర మాసంలో ఒక విశ్వాసి శక్తి ఉండి కూడా ఉపవాసాలు పాటించడం లేదంటే, అతడు దైవం చేసిన మేలును మరిచిపోయి ఆయనకు కృతఘు్నడై పోయాడని అర్థం. అ కృతఘ్నతా పర్యవసానాన్ని అతడు పరలోకంలో చవిచూడవలసి ఉంటుంది. కనుక ఉపవాసాల ఉద్దేశాన్ని, పవిత్ర ఖురాన్ అవతరణ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పరలోక పరాభవం నుండి తప్పించుకొని దైవ ప్రసన్నతకు పాత్రులం కాగలుగుతాం. అలా కాకుండా మిగతా మాసాలకు లాగానే రమజాన్‌ను కూడా నిర్లక్ష్యంగా గడిపేస్తే అంతకంటే దౌర్భాగ్యం మరేమీ ఉండదు. దైవం సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రసాదించాలని, పరలోకంలో ఉన్నత స్థానాలు అనుగ్రహించాలనీ కోరుకుందాం. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ -
మానవునిపై దైవానుగ్రహం ప్రసరించే పండుగ ఈదుల్ ఫితర్
రమజాన్ పేరు వినగానే ప్రతిఒక్కరికీ సేమియా, షీర్ ఖుర్మాలే గుర్తుకు వస్తాయి. పట్టణవాసులకైతే దీనితోపాటు హలీమ్, హరీస్ లాంటి వంటకాలు కూడా నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదు. నెల రోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావ తరంగాల్లో తేలియాడుతూ జరుపుకునే ముగింపు ఉత్సవం. ఈ నెలరోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమ్యా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీ... ఘుమఘుమలతో, అత్తరు పన్నీరు పరిమళంతో, ఉల్లాస పరవళ్ల హడావుడితో కళకళలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణంలో, తరావీహ్ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతుంటారు. నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాల సమ్మేళనాన్నే పండుగ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ అపురూప సందర్భమే ఈదుల్ ఫిత్ ఇదే రమజాన్ పండుగ. అసలు రమజాన్ అన్నది పండుగ పేరు కాదు. అదొక మాసం పేరు. సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో తొమ్మిదవ మాసం పేరు రమజాన్. అయితే దైవం పవిత్ర ఖురాన్ లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింపజేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన రోజాను విధిగా చేయడానికి ఈ మాసాన్ని ఎన్నుకున్నాడు. అందుకే ఈ మాసానికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్, రోజాలతో ఈ నెలకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు... ‘విశ్వాసులారా! మీ పూర్వీకులపై ఉపవాస వ్రతం ఎలా విధిగా నిర్ణయించబడి ఉందో, అలాగే మీపై కూడా విధిగా నిర్ణయించడం జరిగింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. రమజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. అది మొత్తం మానవాళికి సంపూర్ణ మార్గదర్శక గ్రంథం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరు చేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. (2-183, 185). మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే , మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడ కోసం అనేక ఏర్పాట్లుచేశాడు. మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక మార్గదర్శకం కోసం పవిత్ర ఖురాన్ లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపచేయడానికి నెలరోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరి వల్లా కాదు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడం రమజాన్ శిక్షణ ముఖ్య ఉద్దేశం. మాసం రోజులపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుతజీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవనవిధానానికి అలవాటు చేస్తాయి. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపచేసే రమజాన్ వ్రత దీక్షలను దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో పాటించగలిగినందుకు దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయులవారి సంప్రదాయ వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దైవప్రసన్నతను చూరగొనడానికి ఉపవాసవ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్; తరావీహ్ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలు ఆచరిస్తారు. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనులకోసం వ్యయపరచాలి. మంచిపనులకు, సమాజ సంక్షేమ కార్యక్రమాలకు వినియోగమయ్యే ధనవ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈవిధంగా రమజాన్ నెలవంక దర్శనంతో ఆరంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు సాగి ‘షవ్వాల్’ మాసం చంద్రదర్శనంతో ముగుస్తాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే పండుగ ఈదుల్ ఫిత్.్ర ఈ పండుగకు సంబంధం రమజాన్ మాసంతో పెనవేసుకుపోయి ఉండడంతో సాధారణ ప్రజలు దీన్ని రమజాన్ పండుగ అని కూడా వ్యవహరిస్తారు. పండుగరోజున ముస్లిమ్‌లంతా ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకుని ప్రాతఃకాల ఫజర్ నమాజులు చేస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు, పన్నీరు వంటి సుగంధ పరిమళాలను అద్దుకుని ఆనందోత్సాహాలతో ఈద్గాహ్కు బయలుదేరుతారు. అందరూ ఒకచోట గుమికూడి తమకు రోజా వ్రతం పాటించే భాగ్యం కలుగజేసినందుకు, మానవుల మార్గదర్శనం కోసం, సాఫల్యం కోసం, పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింపజేసినందుకు దైవానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు రకతుల నమాజులు చేస్తారు. తరువాత ఇమాం ఖురాన్; హదీసుల వెలుగులో వారికి నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలసి దేవుని గొప్పతనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమకోసం, కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, దేశంకోసం, దేశవాసుల సుఖసంతోషాలకోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం దైవాన్ని ప్రార్థిస్తారు. దైవం సమస్త మానవాళినీ సన్మార్గంలో నడిపించాలనీ, యావత్ ప్రపంచంలో సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్థిల్లాలని మనసారా కోరుకుందాం. - యండి. ఉస్మాన్‌ఖాన్