breaking news
Government contract
-
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
సర్కారీ కొలువులకు కోత
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది. -
700 ఎలుకలకు రూ.24.47 లక్షలు!
రాష్ట్ర చట్టసభల్లో ఎలుకను పట్టేందుకు గత ఏడేళ్లలో ప్రభుత్వం రూ. 24.47 లక్షలు ఖర్చు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఈ సమాధానం లభించింది. 2015 ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు విధానసౌధతో పాటు వికాసౌధలో ఎలుకలతో పాటు క్రిములును తొలగించేందుకు గాను రూ.4,96,333లను చెల్లించేలా ఓ ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన గత ఏడేళ్లలో ఎలుకల కోసం రూ.24.47 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. కాగా, ఈ ఏడేళ్లలో 700 ఎలుకలు పట్టుబడ్డాయని ప్రభుత్వం తెలియజేసింది. - సాక్షి, బెంగళూరు