breaking news
Brewery water
-
ఒక యూరోకే దిగ్గజ కంపెనీ అమ్మకం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమయంలో చేసిన ఓ ప్రకటన దిగ్గజ కంపెనీ కొంప ముంచింది. ఫలితంగా వందల కోట్ల కంపెనీని ఒక యూరో (రూ.89.33)కే అమ్మింది. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. డచ్ బ్రూవరీ సంస్థ హైనకెన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఆ దేశం నుంచి హైనకెన్ వైదొలగాలని భావించింది. ఇందుకోసం కేవలం ఒక యూరోకి తన సంస్థను రష్యా కంపెనీ ఆర్నెస్ట్కు విక్రయించింది. ఈ సందర్భంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బ్రూవరీగా పేరు ప్రఖ్యాతలున్న హైనకెన్ 300 మిలియన్ల యూరోల (324.8 మిలియన్ డాలర్ల) నష్టానికే ఆర్నెస్ట్కు అమ్మినట్లు తెలిపింది. అయితే, సంస్థను అతి తక్కువ ధరకే అమ్మడానికి హైనకెన్ మార్చి 2022లో చేసిన ప్రకటనే అని తెలుస్తోంది. యుద్ధం కారణంగా రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపిస్తున్నట్లు ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. కానీ, నెలలు గడుస్తున్నా రష్యాను విడిచి పెట్టకపోవడంపై విమర్శలు, వరుస నష్టాల్ని చవి చూసింది. ఈ క్రమంలో, సుధీర్ఘ కాలం తర్వాత రష్యా నుంచి హైనకెన్ ఎట్టకేలకు వైదొలగింది. రష్యాలో తన సంస్థను వందల కోట్ల నష్టానికే అమ్మింది. మిగిలిన ఏడు బ్రూవరీస్‌ను ఆస్తుల్ని సైతం ఆర్నెస్ట్కు అప్పగించింది. -
ఆయనకు ఒంట్లో ఆల్కహాల్!
న్యూయార్క్: బయటకెళ్లి ఆల్కహాల్ కొనకుండా ఇంట్లోనే ఆల్కహాల్ దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే ఆల్కహాల్ ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆపి ఆల్కహాల్ స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది. ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా కాకుండా, ఆల్కహాల్‌గా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే ఆల్కహాల్ స్థాయి లేదు. దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్బరా కార్డెల్ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆల్కహాల్ సేవించినట్లు కనిపిస్తారు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
సర్కారీ సారాపై కసరత్తు !
* గుడుంబాకు ప్రత్యామ్నాయంగా తెచ్చే ప్రయత్నాలు * విధివిధానాలు రూపొందించే పనిలో అధికార యంత్రాంగం * ఏటా వందల సంఖ్యలో పేదలను మింగుతున్న నాటుసారా * రాజధాని నుంచి పల్లెల వరకు అంతటా గుడుంబా బాధితులే * గత ఏడాది 9 నెలల్లోనే 51 లక్షల లీటర్ల నాటుసారా పట్టివేత * అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం * ఆరోగ్యకరమైన ప్రమాణాలతో ప్రభుత్వ సారా తయారీకి అధికారుల ప్రతిపాదన * మహారాష్ట్ర ‘దేశీ దారూ’ తరహాలో వైన్‌షాపుల ద్వారా విక్రయించే యోచన * ప్రజారోగ్యాన్ని కాపాడేలా నిర్ణయం తీసుకుంటామంటున్న ప్రభుత్వ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలను హరిస్తున్న నాటుసారాను అరికట్టేందుకు స్వయంగా సారాయిని ఉత్పత్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. దీనిపై ప్రజా వ్యతిరేకత వస్తుందని ముందుగా సంశయించినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న నాటుసారా తయారీ, అమ్మకాలను అరికట్టాలంటే అదొక్కటే మార్గమని సర్కారు గట్టిగా భావిస్తోంది. గుడుంబా వల్ల ఎదురవుతున్న అనర్థాలను ప్రజలకు వివరించిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించే బాధ్యతను ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. 1993 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ‘వారుణి వాహిణి’ పేరుతో సర్కారీ సారా పొట్లాల అమ్మకాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సారా వ్యతిరేక ఉద్యమం రావడంతో వాటి అమ్మకాలను అప్పటి ప్రభుత్వం నిషేధించింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సర్కారీ సారా ఊసులేకపోయినా.. నాటుసారా(ఐడీ లిక్కర్), గుడుంబా పేరుతో ప్రైవేటు దందా విచ్చలవిడిగా మారింది. దీని కోరల్లో చిక్కి పేద కుటుంబాలు నలిగిపోతున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాటుసారా వ్యాపారం కుటీర పరిశ్రమను మించిపోయింది. ఆబ్కారీ శాఖ అప్పుడప్పుడు చేసే దాడుల్లో పట్టుబడుతున్న నాటుసారా అంతంతమాత్రమే. యూరియా, కుళ్లిన పండ్లు, బెల్లం, బ్యాటరీ పొడి, అరటిపండ్ల తొక్కలు వంటి వ్యర్థాలతోపాటు విషపూరిత రసాయనాలతో బట్టీలు పెట్టి దీన్ని తయారు చేస్తున్నారు. గుడుంబాకు అలవాటుపడిన వ్యక్తి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి చివరికి ప్రాణాలమీదకు వస్తుంది. దీనికి బానిసైన వారి వల్ల దిగువ మధ్యతరగతి వర్గాలు, కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఏటా కోటి లీటర్లకు పైగా నాటుసారా ఉత్పత్తి జరుగుతోంది. దీంతో రూ. వంద నుంచి రూ. 150 కోట్ల వ్యాపారం నడుస్తోంది. గుడుంబా అమ్మకాలపై ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌కు స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పర్యటన పూర్తయిన వెంటనే ఎక్సైజ్ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలంటూ యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో వారు నివేదికలు రూపొం దించే పనిలో పడ్డారు. గుడుంబాకు బదులుగా ప్రభుత్వమే చీప్ లిక్కర్ కన్నా తక్కువ ధరలో లభించే సారాయిని తయారు చేస్తే పరిస్థితిని అదుపు చేయొచ్చని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది. మహారాష్ట్రలో చీప్ లిక్కర్ కన్నా తక్కువ ధరలో ‘దేశీ దారూ’ పేరుతో సారాయిని వైన్‌షాపులు, బార్లలో ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే గుడుంబాను నియంత్రించడంతో పాటు ‘ఆరోగ్యకరమైన ప్రమాణాలతో’ సారాయిని అందించే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అరకొర దాడులతోనే భారీగా కేసులు ఎక్సైజ్, పోలీస్ శాఖ పరోక్ష సహకారం లేకుం డా నాటుసారా ఉత్పత్తి, విక్రయం అసాధ్యమనే విషయం ప్రభుత్వానికీ తెలుసు. అందుకే తాండాలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు గుట్టు చప్పుడు కాకుండా లక్షల లీటర్ల నాటుసారా తయారీ, అమ్మకాలు సాగుతూ ఉన్నాయి. మరోవైపు నెలనెలా వచ్చే మామూళ్లతో అధికారుల జేబులు నిండుతున్నాయి. హైదరాబాద్‌లో నాటుసారా తయారీకి ధూల్‌పేట పెట్టింది పేరు. ఇక్కడి నుంచి నాటుసారా సీసాలు, పాకెట్లు నగరమంతటికీ సరఫరా అవుతాయి. మంగళ్‌హాట్, సరూర్‌నగర్, మేడ్చెల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ గుడుంబా తయారీ కేంద్రాలున్నాయి. ఇక ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మన్ననూరు, గద్వాల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, గోదావరి ఖని, మంచిర్యాల, బెల్లంపల్లి వంటి పట్టణాలు నాటుసారా తయారీ కేంద్రాలుగా ఆబ్కారీ శాఖ రికార్డుల్లో నమోదయ్యాయి. సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలైన గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లితో పాటు ఆదిలాబాద్, ఉట్నూరు, కాసీపేట మొదలైన ప్రాంతాలన్నీ ఎక్సైజ్ దాడుల్లో తరచూ రికార్డుల్లోకెక్కుతాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో పట్టుబడిన ఐడీ లిక్కర్ 10,53,728 లీటర్లు కాగా, 67,800 కేసులు నమోదయ్యా యి. 27,299 మంది తయారీదారులు, విక్రయదారులు అరెస్టయ్యారు. 9 నెలల్లోనే పదిన్నర లక్షల లీటర్ల గుడుంబాను పట్టుకున్నారంటే.. ఇక విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అధికారులకే అంతుపట్టడం లేదు. అలాగే 2011-12 నుంచి 2013-14 వరకు 51 లక్షల లీటర్ల నాటుసారాను స్వాధీ నం చేసుకొని 3,61,930 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 1,22,583 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నాటుసారాను అరికట్టడానికి ప్రభుత్వమే ప్రత్యేక డిస్టల్లరీలను ఏర్పాటు చేసి ప్రాణహాని లేని సారాయిని తయారు చేసే ఆలోచనకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై మంగళవారం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి. ఆర్. మీనాను మీడియా ప్రశ్నించగా.. ఓ విధానం లేకుండా తయారు చేస్తున్న గుడుంబా స్థానంలో ప్రభుత్వమే ప్రమాణాలతో కూడిన సారాయిని ఉత్పత్తి చేయించాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. ప్రాణాంతకమైన నాటుసారాను అరికట్టేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ప్రజలకు హాని కలగకుండా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, రెండు రోజుల్లో అధికారులతో ఎక్సైజ్ మంత్రి పద్మారావు ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్కారీ సారా ఉత్పత్తి, విధివిధానాలపై చర్చించనున్నట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.