అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?
పిల్లలూ! మీరేదైనా మ్యాజిక్ షోకి వెళ్లినప్పుడు స్టేజీ మీద ఉన్న మెజీషియన్ తప్పకుండా ‘అబ్రకదబ్ర’ అనే మాట వాడటం వినే ఉంటారు. చాలాసార్లు మ్యాజిక్ షోలలో ఈ పదం వాడుతుంటారు. దీనికి అర్థమేమిటో, ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా? ఈ పదం ఎప్పుడు, ఎవరు, ఎలా పుట్టించారో కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ రెండో శతాబ్దానికి చెందిన రోమన్ వైద్యుడు సెరెన్ సమ్మోనికస్ రాసిన గ్రంథాల్లో ఈ మాట ఉంది. కాబట్టి ఇది చాలా పురాతనమైన మాట అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. జ్వరం తగ్గిపోవడానికి చిట్కాగా ఆయన తన గ్రంథంలో ‘అబ్రకదబ్ర’ అనే పదాన్ని వాడారు. ఈ పదానికి హిబ్రూ భాషలో ‘నేను చెప్పినట్లే సృష్టిస్తాను’, అరేబిక్ భాషలో ‘నా మాట ప్రకారం సృష్టి జరుగుతుంది’ అనే అర్థాలున్నాయంటారు. హిబ్రూ భాషలోని ‘హ బ్రఖా దబరా’ (ఆశ్వీరాదం పొందినవారు) అనే వాక్యం నుంచి ఈ పదం వచ్చి ఉంటుందని డాన్ స్కీమర్ అనే చరిత్రకారుడు అంచనా వేశారు. ఇవన్నీ అంచనాలే తప్ప ‘అబ్రకదబ్ర’ అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ పదానికి చాలా శక్తి ఉందని, ఇది పఠిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని రకరకాలుగా ప్రచారం చేశారు. అనంతరం 1800 నుంచి మెజీషియన్లు దీన్ని తమ షోల్లో వాడటం మొదలుపెట్టారు. ఏదైనా ఒక మ్యాజిక్ ట్రిక్ చేసే ముందు ఈ పదాన్ని వాడి, ఆ ట్రిక్ చేయడం ద్వారా ఈ పదానికి మహత్వం ఉందని అందరూ అనుకునేవారు. నేటికీ అది కొనసాగుతోంది. తెలుగువారి కీర్తిపతాకం.. భోగరాజు పట్టాభి సీతారామయ్య పిల్లలూ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పుట్టిన ఓ మహనీయుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయనే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సీతారామయ్య 1880 నవంబర్ 24 న కృష్ణా జిల్లా గుండుగొలను అనే ఊరిలో జన్మించారు. చిన్ననాటి నుంచి వైద్యుడిగా మారాలన్న ఆలోచనతో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చేరి ఎంబీసీఎం డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మచిలీపట్నంలో వైద్యుడిగా సేవలందించడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తన పని వదిలేసి స్వాతంత్రో ద్యమంలో చేరారు. 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించారు. అందుకే ఆంధ్రాబ్యాంకు ప్రధాన భవనానికి ‘పట్టాభి భవన్’ అని పేరు పెట్టారు. దీంతోపాటు ఆయన ఆంధ్రా ఇన్సూరెన్స్సంస్థను కూడా స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన సీతారామయ్య మహాత్మాగాంధీకి సన్నిహితుడిగా మారారు. 1935లో ‘ది హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్’ పుస్తకం రాశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ని మూడేళ్లపాటు అహ్మద్ నగర్ జైల్లో ఉంచారు. అక్కడున్నరోజుల్లో ‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’ పేరుతో తన జైలు అనుభవాలు రాశారు. ఆపై ‘గాంధీ అండ్ గాంధీయిజం’ పుస్తకాన్ని రాశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం తొలి గవర్నర్గా వ్యవహరించారు. తెలుగువారి కీర్తిపతాకంగా నిలిచారు. దేశానికి నలేని సేవలందించిన ఆయన 1959 డిసెంబర్ 17న మరణించారు.