‘పెద్దపల్లి నగరపంచాయతీ కార్యాలయంలో ఏం జరుగుతోంది.. నీవేం చేస్తున్నావ్.. పంచుకుని తింటున్నారా..
పెద్దపల్లి కమిషనర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
పెద్దపల్లి : ‘పెద్దపల్లి నగరపంచాయతీ కార్యాలయంలో ఏం జరుగుతోంది.. నీవేం చేస్తున్నావ్.. పంచుకుని తింటున్నారా.. ఇదివరకు కూడా చెప్పాను.. నీవింతేనా..’ అంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నగర పంచాయతీ కమిషనర్ శ్రీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి నగరపంచాయతీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. పట్టణ అభివృద్ధి కోసం కావాల్సిన వస్తువులు, కొనుగోలు చేస్తున్న వాటి వివరాలు తెలపాలని ఆదేశిస్తే మౌనంగా ఎందుకు ఉంటున్నావని మందలించారు.
ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేస్తున్నవారిని వేధిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అక్రమ నియామకాలు చేపట్టి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులు సవరించుకునే ప్రయత్నం చేయడంలేదని, తాను మళ్లీ ఒకసారి ఈ కార్యాలయానికి వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆగ్రహించారు. పనిచేతకాకపోతే సెలవుపై వెళ్లాల్సిందిగా కమిషనర్‌ను ఆదేశించారు. వెంటనే ఎంపీ బాల్కసుమన్ జోక్యం చేసుకొని మంత్రితో మాట్లాడి బదిలీ చేస్తానని ఫోన్ తీయడంతోనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఈసారికి క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనవెంట నగర పంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య ఉన్నారు.