5 నుంచి రోడ్డెక్కనున్న ‘విద్యుత్‌’ బస్సులు | TSRTC Will Starts Electric Buses In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఎలక్ట్రిక్‌’ పరుగులు

Feb 3 2019 2:17 AM | Updated on Feb 3 2019 12:26 PM

TSRTC Will Starts Electric Buses In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో నూటికి నూరు శాతం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ బస్సులు మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. ఏమాత్రం కాలుష్యం వెదజల్లకపోవడం ఈ బస్సుల ప్రత్యేకత. ఈ బస్సులను గ్రేటర్‌ పరిధిలో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట మియాపూర్‌ డిపో నుంచి 20 బస్సులను, ఆ తరువాత కంటోన్మెంట్‌ డిపో నుంచి మరో 20 బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 5న ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎలక్ట్రిక్‌ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, సిద్ధార్ధ, డీవైడీ సంస్థలతో కూడిన కన్సార్షియంతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం 12 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఒప్పందం మేరకు బస్సుల నిర్వహణ పూర్తిగా కన్సార్షియం పరిధిలో ఉంటుంది. ఈ బస్సులను కన్సార్షియం డ్రైవర్లే నడుపుతారు. విద్యుత్‌ చార్జింగ్‌ మాత్రం ఆర్టీసీ డిపోల నుంచి అందజేస్తారు. ఈ బస్సులకు కిలోమీటర్‌కు రూ. 36 చొప్పున ఆర్టీసీ చెల్లించనుంది. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, హరిత ప్లాజా, మైత్రీవనం, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల మీదుగా ఈ బస్సులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయి. కంటోన్మెంట్‌ డిపో నుంచి నడిచే బస్సులు సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్, సంగీత్‌ చౌరస్తా, తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తాయి. 

ఒకసారి చార్జింగ్‌ చేస్తే తిరిగే దూరం:  250-300 కి.మీ.
ఒక కిలోమీటర్‌కు ఆర్టీసీ చెల్లించనున్న మొత్తం: రూ. 36

వీడిన పీటముడి.... 
హైదరాబాద్‌లో బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గత సంవత్సరమే ప్రణాళికలు రూపొందించింది. విశ్వనగర ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయంగల రవాణా సదుపాయాలను ప్రతిపాదించారు. అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ముందుకు వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే 5 బస్సులను విడుదల చేశారు. కానీ అప్పటికి ఇంకా ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కన్సార్షియంలోని వివిధ సంస్థల మధ్య అవగాహన కుదరకపోవడం వల్ల ఆర్టీసీతో ఒప్పందం వాయిదా పడింది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సుల ప్రాజెక్టుపై పీటముడి ఏర్పడింది. అప్పటి వరకు వివిధ డిపోల నుంచి ఈ బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన ఆర్టీసీ సైతం గందరగోళంలో పడిపోయింది. చివరకు కన్సార్షియంలోని మూడు భాగస్వామ్య సంస్థలైన సిద్ధార్ధ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, చైనాకు చెందిన డీవైడీ సంస్థలు పరస్పర అవగాహనకు రావడంతో ఆర్టీసీతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ బస్సులపై కన్సార్షియంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికీ హక్కు ఉంటుంది. రవ్వంత కాలుష్యానికి సైతం అవకాశం లేకుండా విద్యుత్‌తో నడిచే ఈ బస్సులను ఒకసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఉన్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానంలో ఈ అత్యాధునిక బస్సులను నడుపుతారు. 

పూర్తయిన డ్రైవర్ల శిక్షణ... 
ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపే డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక శిక్షణనిచ్చింది. బస్సులు నడిపేటప్పుడు మెళకువలు పాటించడంతోపాటు టికెట్‌ ఇష్యూ మిషన్‌ల వినియోగం, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యహరించడం వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. ప్రస్తుతం మియాపూర్‌ డిపో నుంచి ప్రారంభం కానున్న ఈ బస్సుల కోసం ఆ డిపోలో ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు 12 చార్జింగ్‌ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్‌ డిపోలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా చార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి ఆ డిపో నుంచి మరో 20 బస్సులను నడుపుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement