‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.! | Planning Is In Progress Of Adilabad Airport | Sakshi
Sakshi News home page

‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.!

Aug 21 2019 10:17 AM | Updated on Aug 21 2019 10:17 AM

Planning Is In Progress Of Adilabad Airport - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏయిర్‌ఫోర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించి బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపనుండగా, మరోవైపు జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారులు విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి రూట్‌మ్యాప్‌లు ఖరారు చేసి రెడీగా ఉంచడంతో మరింత ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఏఏఐ అధికారుల బృందం సభ్యులు హైదరాబాద్‌ నుంచి జిల్లాకు రానున్నట్లు అధికారులకు సమాచారం. సాయంత్రం 

వరకు ఇక్కడే ఉండి ఎయిర్‌పోర్టు విస్తరణలో సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడంతో పాటు వైమానిక శిక్షణ కోసం వినియోగిస్తున్న బేస్‌క్యాంప్‌ను పరిశీలన చేయనున్నారు. అందుబాటులోని స్థలం, బౌండ్రీలు, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్‌ డిమాండ్, రూట్‌మ్యాప్‌లు తదితర అంశాలను పరిశీలిస్తారు. జిల్లా అధికారుల  సహకారం తీసుకోనున్నారు. 

స్థలాన్ని పరిశీలించనున్న బృందం.. 
ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌బేస్‌ ఉంది. దీనిని పౌర విమానయాన సేవలకు తీర్చిదిద్దేందుకు రెండు విడతల్లో తొమ్మిది వందల ఎకరాలకుపైగా అవసరం అవుతుందని ప్రభుత్వం ఇది వరకే లెక్కలు వేసింది. అయితే విమానశ్రయం ఏర్పాటుకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉండడంతో జిల్లా ఎంపికైందని చెప్పవచ్చు. 2014లో జిల్లా అధికారులు చేసిన సర్వే ప్రకారం 1,591.45 ఎకరాల భూమి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 89.44 ఎకరాలు ఉండగా, ప్రైవేట్‌ భూమి 1502.01 ఎకరాలు ఉన్నట్లు తేలింది. పట్టణానికి అనుకొని ఉన్న ఖానాపూర్‌ శివారులో ప్రభుత్వ భూమి 50.20 ఎకరాలు, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి శివారులో 5.20 ఎకరాలు ఉంది. ప్రైవేట్‌ భూమి ఖానాపూర్‌ శివారులో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్‌కంటి శివారులో 313.24 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 256.07 ఉన్నట్లు అప్పట్లో సర్వే ద్వారా నిర్థారించారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్‌ భూమిని కలుపుకొని మొత్తం 1591.45 ఎకరాలు ఉన్నట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. 

ఏర్పాటుకు జిల్లా అనుకూలం.. 
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానశ్రయానికి వాయుమార్గంలో 150 కి.మీ. పరిధిలో కొత్తగా ఏయిర్‌పోర్టులు నిర్మించబోమని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు 300 కి.మీ.లకుపైనే ఉంది. దీంతో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అనుకూలించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వరకే జిల్లా అధికారుల బృందం విమానశ్రయ ఏర్పాటుకు జిల్లా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతోపాటు అప్పట్లో ఏయిర్‌ఫోర్స్‌ అధికారులు జిల్లాకు వచ్చి స్థలాన్ని పరిశీలన చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ – నాగ్‌పూర్‌ రెండు నగరాల మద్యలో జిల్లా ఉండడం, ఏర్పాటుకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం, ఇది వరకే ఓ మిలిటరీ ఏయిర్‌బేస్‌ ఉండడం లాంటివి ఏర్పాటుకు కలిసివస్తున్నట్లు చెప్పవచ్చు. 

ఏఏఐ నివేదికపైనే ఆశలు.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్‌ కింద రాష్ట్రంలో ఆరు విమానశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహాబూబ్‌నగర్, కొత్తగూడెంలలో విమానశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఏఏఐ బందంని జిల్లాలకు పంపిస్తోంది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అయితే పరిశీలనలో తెలుసుకున్న అంశాలు, ఏఏఐ బృందం రూపొందించే నివేదికపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.  అన్ని కోణాల్లో పరిశీలన చేసి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు బృందం నిర్థారిస్తే జిల్లాకు విమానయోగం కలుగనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement