ఆయుష్మాన్ భవ..!

People Prefer Nature Cure Treatment in Hyderabad - Sakshi

రుగ్మతల విముక్తి కోసం ‘ప్రకృతి’బాట

సహజ జీవనశైలి పట్ల నగరవాసుల్లో ఆసక్తి

మండే ఎండల నుంచి కూడా ఉపశమనం

నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక పోకడలకు వంటబట్టించున్ననగరం.. ఆరోగ్యం, జీవనశైలి విషయాల్లోనూ పాతవిధానాన్నే అనుసరిస్తోంది. అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలు, వెరైటీ ఆహార పదార్థాలు ఒకవైపు కట్టిపడేస్తున్నప్పటికీ చాలామంది నిరాడంబరమైన జీవన విధానం వైపే మొగ్గుచూపుతున్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబుటులోకి వచ్చినా దీర్ఘకాలిక రోగాలకు, అసలు రోగాలే రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంలే నగర వాసుల్లో అనూహ్యంగా ఆరోగ్య స్పృహ పెరిగింది.

బిర్యానీలు, చికెన్‌ కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌ను ఇప్పుడిప్పుడే దూరం పెడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిరుధాన్యాల ఆహారం తప్పనిసరైంది.  మధ్య తరగతి, ఆ పైవర్గాలే కాదు.. సాధారణ ప్రజలు సైతం తమ ఆహారంలో  మార్పులు చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు వివిధ రకాల రుగ్మతల కోసం పొందే వైద్య చికిత్సల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అత్యవరమైతే తప్ప అల్లోపతిని ఆశ్రయించేందుకు విముఖత చూపుతున్నారు. ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. మధుమేహం, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, వివిధ రకాల చర్య వ్యాధులు, స్పాండిలైటిస్, సయాటికా వంటి జీవన శైలి వ్యాధులకు ప్రకృతి వైద్యాన్నేప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.  

ప్రకృతిలో వేస‘విహారం’..
నిప్పులు చెరిగే ఎండల నుంచి ఉపశమనాన్ని పొందేందుకు చాలా మంది చాలా రకాల పద్ధతులను ఎంపిక చేసుకుంటారు. ఆహార విహారాల్లో  మార్పులు చేసుకుంటున్నారు. చల్లటి ప్రదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొనేందుకు ఇప్పడు చాలామంది ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి కొద్ది రోజులుగా సందర్శకులు, రోగులతో కిటకిటలాడుతోంది. వారం నుంచి 15 రోజుల పాటు ప్రకృతి వైద్య చికిత్సలను పొందేందుకు జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే చిరుధాన్యాల బాట పట్టిన నగరవాసులు ఆ బాటలోనే ప్రకృతి వైద్యం వైపు సాగుతున్నారు. దీంతో 184 పడకలతో వైద్యసేవలను అందించే నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి ప్రతిరోజు 30 నుంచి 40 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకొని ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వంద మందికి పైగా ఆస్పత్రిని సందర్శించి ప్రకృతి వైద్యం గురించి తెలుసుకుంటున్నారు. ఏయే జబ్బులకు ఎలాంటి  చికిత్సలు లభిస్తాయనే విషయంపై అవగాహన చేసుకుంటున్నారు. ప్రకృతి వైద్యంతో పాటు, యోగ, ప్రాణాయామపైనా ఆసక్తి చూపుతున్నారు. అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు చికిత్స చేస్తున్నారు. ఏసీ, నాన్‌ ఏసీ గదులు, కాటేజీలు, సాధారణ వార్డులు సైతం ఇక్కడ ఉన్నాయి. వ్యాధుల తీవ్రత మేరకు వారం నుంచి 15 రోజుల పాటు ఈ చికిత్సలు ఉంటాయి. అందుకు అనుగుణంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకు ఫీజులున్నాయి.  

మట్టి స్నానం..మహా ప్రక్షాళనం
శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించి, స్వేదగ్రంధులను విశాలం చేసి సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించే మట్టిస్నానం మరో ప్రత్యేకత. భూమిలో మూడు అడుగుల లోతు నుంచి సేకరించిన నల్లరేగడి మట్టిని ఈ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. వంటి నిండా మట్టి పూసి అవసరమైన చోట మట్టి ప్యాచ్‌లు వేస్తారు. తర్వాత కనీసం 20 నిమిషాలు ఎండలో ఉంచుతారు. ‘మట్టిలోని పుష్కలమైన ఖనిజాలు శరీరానికి పటుత్వాన్ని, మృదుత్వాన్ని అందజేస్తాయని, శరీరం ప్రక్షాళనమవుతుంద’ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవాని తెలిపారు.

ఆహారం అమృతమయం
ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు, శస్త్ర చికిత్సలు లేని ప్రకృతి వైద్యవిధానంలో ఆహారమే పరమ ఔషధం. అందుకే శరీరంలోని విష పదార్థాలను తొలగించే సూర్యాహారం, అమృతాహారాన్ని ఈ వైద్యంలో అందజేస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వంటివి సూర్యాహారంగా, పళ్లు, ఎండుఫలాలు, తేనె, చెరకురసం, బెల్లం అమృతాహారంగా అందజేస్తారు. చికిత్స అనంతరం దైనందిన జీవితంలో ఎలాంటి ఆహార నియమాలను అనుసరించాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. ఎప్పుడు, ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలో తెలియజేసే యుక్తాహారం, మితాహారం పద్ధతులు కూడా ప్రకృతి చికిత్సలో భాగమే. వీటితో పాటు మర్ధన చికిత్సలు, అరిటాకు స్నానం, సూర్యచికిత్స, యోగ, ప్రాణాయామ, ఫిజియోథెరపీ వంటి వివిధ రకాల వైద్య,ఆరోగ్య పద్ధతులతో రోగికి స్వస్తత చేకూరుస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top