‘వెల్‌నెస్‌’కు వెళ్తేనే వైద్యం! | Sakshi
Sakshi News home page

‘వెల్‌నెస్‌’కు వెళ్తేనే వైద్యం!

Published Sun, Oct 29 2017 2:00 AM

New approach to medical services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వైద్య సేవల విషయంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. జనవరి 1 నుంచి ఉద్యోగులు వెల్‌నెస్‌ సెంటర్లకు వెళ్లిన తర్వాతే వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం ఈ ఏడాది డిసెంబర్‌తో ఆగిపోనుంది. నచ్చిన ఆస్పత్రుల్లో ఉద్యోగులు చికిత్స చేయించుకునే పరిస్థితికి తెరపడనుంది.

అయితే మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానం ముగిసేలోగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఈ విషయంలో వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జనవరికల్లా పాత జిల్లాల కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికీ రెండే వెల్‌నెస్‌ సెంటర్లు, అవీ హైదరాబాద్‌లోనే (ఖైరతాబాద్, వనస్థలిపురంలలో) ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుత విధానంలో ఎక్కడైనా వైద్యం...
రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, మరో ఏడు లక్షల మంది వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 11 లక్షల మంది ప్రభుత్వపరంగా వైద్య సేవలు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుబాటులోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.

ఆ తర్వాత ఆస్పత్రి బిల్లులతో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు వైద్య సేవలను అందించే ఆస్పత్రుల జాబితాను రూపొందించింది. కొన్నిసార్లు ఈ జాబితాలో లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఉద్యోగులు పెట్టిన ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తోంది.

గడువులోగా వెల్‌నెస్‌ కేంద్రాలు వచ్చేనా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సేవల విషయంలో మార్పులు చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్‌) ప్రవేశపెట్టింది. పథకం అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ఆధ్వర్యంలోనే వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. అలాగే జర్నలిస్టుల వైద్య సేవల పథకాన్ని దీనికి అనుసంధానించింది.

ఈ పథకం ప్రకారం వెల్‌నెస్‌ సెంటర్లలో అందుబాటులో ఉండే అన్ని విభాగాల వైద్యులు... చికిత్సల కోసం వచ్చే వారిని పరిశీలించి అవసరమైన టెస్ట్‌లు ప్రతిపాదించి వాటి నివేదికలను చూశాక అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని వైద్య సేవల విషయంలో మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

అయితే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంతులేని జాప్యం నెలకొంది. తొలి దశలో భాగంగా 2016 డిసెంబర్‌ 17న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో మొదటి వెల్‌నెస్‌ సెంటర్‌ను, 2017 ఫిబ్రవరి 2న వనస్థలిపురంలో రెండో సెంటర్‌ను ఏర్పాటు చేసిన సర్కారు... మిగిలిన జిల్లాల్లో డిసెంబర్‌లోగా వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఏవీ మొదలుకాలేదు.

మరో రెండు నెలల్లో అన్ని పాత జిల్లాల కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా గడువులోగా వాటి ఏర్పాటు ప్రక్రియ ముగిసే అవకాశాలు కనిపించట్లేదు.


ఉన్న రెండు సెంటర్లలో విపరీతమైన రద్దీ
రాష్ట్రంలో ప్రస్తుతం రెండే వెల్‌నెస్‌ సెంటర్లు ఉండడంతో ఈ కేంద్రాలకు వచ్చే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్‌నెస్‌ సెంటర్లకు రోజూ కనీసం 1,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తున్నారు.

దీంతో వైద్యుల అపాయింట్‌మెంట్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వైద్యులకు పరీక్షల నివేదికలను చూపి అవసరమైన మందులను పొందడం మరింత ఆలస్యమవుతోంది. ఈ రెండు సెంటర్లలో ఇప్పటివరకు 2,40,517 మందిని వైద్యులు పరీక్షించి వారిలో 1,33,046 మందికి ఉచితంగా మందులు ఇచ్చారు. 25,221 మందిని చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు పంపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement