మొట్టమొదటి దుర్ఘటన

MMTS First Train Accident in Kachiguda Railway Station - Sakshi

ఎంఎంటీఎస్‌లో తొలి ప్రమాదం  

2003లో ప్రారంభమైన సర్వీసులు  

సాక్షి, సిటీబ్యూరో:కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్‌ ప్రమాద ఘటనతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ కాచిగూడ స్టేషన్‌కు కొద్ది దూరంలో అదే మార్గంలో వస్తున్న కర్నూల్‌–సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌ గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్‌ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్‌ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

సిటీ లైఫ్‌లైన్‌  
ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రతిరోజు సుమారు లక్షన్నర మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రజా రవాణాలో ఇది సిటీ లైఫ్‌లైన్‌గా నిలిచింది. తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 11గంటల వరకు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి మధ్య ఈ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతి 15–30 నిమిషాల వ్యవధిలో ఒక సర్వీసు చొప్పున నడుస్తోంది. పాలు, కూరగాయలు విక్రయించే చిరువ్యాపారుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఎంఎంటీఎస్‌ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అటు బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు వంటి దూరప్రాంతాల్లో ఉంటూ హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు.. ఇటు భువనగరి, ఘట్కేసర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సికింద్రాబాద్‌ చేరుకొని అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి ఎంఎంటీఎస్‌ ఒక లైఫ్‌లైన్‌లా మారింది. నాంపల్లి, ఖైరతాబాద్, సెక్రటేరియట్, గాంధీభవన్‌ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులు ఎంఎంటీఎస్‌ రైళ్లలోనే పయనిస్తున్నారు. 

లక్షా 60వేల మందికి సేవలు...  
పెరుగుతున్న నగర జనాభా, తీవ్రమవుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలు, అన్నింటికీ మించి వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2003లో ఎంఎంటీఎస్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో  సుమారు రూ.69.50 కోట్ల వ్యయంతో ఇవి పట్టాలెక్కాయి. తొలుత సికింద్రాబాద్‌–లింగంపల్లి వరకు సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ ఈ సర్వీసును ప్రారంభించారు.

ఆ తర్వాత సికింద్రాబాద్‌–ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ సేవలు అంచెలంచెలుగా పెరిగాయి. ప్రస్తుతం 121 సర్వీసులు ప్రతిరోజు తిరుగుతున్నాయి. సుమారు లక్షా 60వేల మంది ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. బోగీల సంఖ్యను 6–9కి, ఆ తర్వాత 12కు పెంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలిస్కోపిక్‌ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. 2010లో ప్రారంభించిన ‘మాతృభూమి’ మహిళల ప్రత్యేక రైలులో బోగీల సంఖ్యను కుదించినప్పటికీ,  4 బోగీలను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించారు. ఇక రెండో దశ పనులు సైతం తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే లింగంపల్లి నుంచి బీహెచ్‌ఈఎల్, రామంద్రాపురం, తెల్లాపూర్‌ వరకు వేసిన కొత్త రైల్వే మార్గంలో 2 సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌–బొల్లారం లైన్లు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మార్గాల్లో విద్యుదీకరణ, డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. రెండో దశ పూర్తయితే ఘట్కేసర్, పటాన్‌చెరు, మేడ్చల్‌ లాంటి శివారు ప్రాంతాలు నగరానికి చేరువవుతాయి.  

డీఆర్‌ఎఫ్‌ కీలక పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్‌ రైళ్లు ఢీకొన్న సంఘటన స్థలానికి జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు అతి తక్కువ సమయంలోనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే 50 మందితో కూడిన మూడు బృందాలు ఎన్‌డీఆర్‌ఎఫ్, రైల్వే, విపత్తుల నివారణ శాఖ సిబ్బందితో కలిసి పని చేశాయి. డీఆర్‌ఎఫ్‌ విభాగం వద్దనున్న పరికరాలతోనే ఈ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top