రాయపోలు(దుబ్బాక): మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని నిలదీసిన భార్యపై భర్త కొడవలితో దాడి చేసి హత్యాయత్నం చేసిన సంఘటన రాయపోలు మండలం రామారంలో చోటు చేసుకుంది. తొగుట సీఐ వెంకటేశం కథనం ప్రకారం... రామారం గ్రామానికి చెందిన రెడ్డమైన లక్ష్మణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం నెడుపుతున్నాడని ఆరోపిస్తూ భార్య మంజుల(30) ఆదివారం అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంజులపై లక్ష్మణ్ కొడవలితో దాడి చేశాడు. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు విషయాన్ని గమనించి అడ్డుకున్నారు. బాధితురాలు రాయపోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ వెంకటేశం సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మంజులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. లక్ష్మణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.