మాన్‌సూన్‌ ఎంజాయ్‌

IRCTC Packages on Tourism Hyderabad - Sakshi

మాన్‌సూన్‌ టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు

సెప్టెంబర్, నవంబర్‌లలో జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు  

చైనా, అండమాన్‌ దీవులకు చలో.. చలో..  

మేఘాలయలో విహారం, రన్‌ఆఫ్‌ కచ్‌ వేడుకలు చూసొద్దాం  

చిరుజల్లులు కురిసే వేళ.. రివ్వున తాకే చల్లటి గాలుల నడుమ ప్రయాణం ఎంతో ఆనందం, ఆహ్లాదభరితం. సరికొత్త  ప్రదేశాలను సందర్శిస్తే ఆ అనుభూతి మరింత ఉల్లాసభరితం. సాహసోపేత యాత్రలు, జాతీయ, అంతర్జాతీయ నగరాల సందర్శన మనసును కట్టిపడేస్తుంది. విభిన్న జీవన సంస్కృతులు, భాషలు, ఆచార సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. పర్యటన గొప్ప అనుభవమవుతుంది. ఆ అనుభవాలను  నగరవాసులకు పరిచయం చేసేందుకు మాన్సూన్‌ టూర్‌లను సిద్ధం చేసింది ఐఆర్‌సీటీసీ.  మొట్టమొదటిసారిగా చైనా టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు అండమాన్, మేఘాలయ, రన్‌ ఆఫ్‌ కచ్‌ (గుజరాత్‌) పర్యటనలను సిద్ధం చేసింది. చిటపట చినుకులుపడుతున్న వేళల్లో నింగిలోకి దూసుకుపోయి.. సరికొత్త ప్రదేశాల్లోవాలిపోవాలనుకుంటున్నారా.. అయితే బీ రెడీ. 

చాంగ్‌ భలే చైనా..
హైదరాబాద్‌ నుంచి సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, శ్రీలంక వంటి అంతర్జాతీయ టూర్‌లను పరిచయం చేసిన ఐఆర్‌సీటీసీ మొదటిసారిగా చైనాలోని షాంఘై, బీజింగ్‌ నగరాలకు ప్యాకేజీలను రూపొందించింది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు ఏడు రాత్రులు, 8 పగళ్లు ఈ పర్యటన సాగుతుంది. షాంఘైలోని బుద్ధ టెంపుల్, యువాన్‌ గార్డెన్, సిల్క్‌ఫ్యాక్టరీ, నాంజీరోడ్, జిన్మావో టవర్, ఏరోబేటిక్‌ షో తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. డిస్నీ లాండ్, హోంగీ నది సందర్శన ఉంటుంది. బీజింగ్‌లోని జెడ్‌ ఫ్యాక్టరీ, గ్రేట్‌వాల్, బీజింగ్‌ ఒలింపిక్‌ పార్కు, టీ హౌస్, కుంగ్‌ఫూ షో, తియాన్మెన్‌ స్క్వేర్, ఫోర్బిడెన్‌ సిటీ, టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్, పెరల్‌షాప్, సిల్‌స్ట్రీట్‌ మార్కెట్‌ తదితర ప్రాంతాల సందర్శన. అనంతరం సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకుంటారు.  

ప్యాకేజీ ఇలా..  
భోజనం, హోటల్, రోడ్డు రవాణా, రైలు తదితర అన్ని సదుపాయాలను ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది. భారతీయ రెస్టారెంట్‌లతో పాటు, స్థానిక వంటకాలను సైతం రుచి చూడవచ్చు. ప్రయాణ బీమా సదుపాయం కూడా ఉంటుంది. చైనా పర్యటన ప్యాకేజీ ఒకరికి రూ.1,09,560, ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకుంటే రూ.96,040 (ఒక్కొక్కరికి) చొప్పున ఉంటుంది.  

అహో.. అండమాన్‌.. 
సెప్టెంబర్‌ 6 నుంచి 11 వరకు ఈ పర్యటన ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 పగళ్ల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో కరేబియన్‌ బీచ్, సెల్యూలార్‌ జైల్, పోర్ట్‌బ్లెయిర్‌లోని రాస్, నార్త్‌ బే (కోరల్‌), హావ్‌లాక్‌ దీవులు, రాధానగర్‌ బీచ్,  అనంతరం పోర్ట్‌బ్లెయిర్‌ చేరుకుని కాలాపత్తర్‌ బీచ్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. పర్యటనలో 5వ రోజు సెప్టెంబర్‌ 9న బారట్టంగ్‌ పర్యటన ఉంటుంది. అనంతరం పోర్టుబ్లెయిర్‌ నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

ప్యాకేజీ ఇలా..  
భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఉంటాయి. ఒకరికి రూ.45,500, ఇద్దరికైతే రూ.31,556, ముగ్గురికి కలిపి బుక్‌ చేసుకుంటే రూ.30,433.  

మేఘాలలో తేలిపోయేలా.. 
మాన్‌సూన్, వింటర్‌ టూర్‌ ప్యాకేజీల్లో భాగంగా మేఘాలయ, రన్‌ ఆఫ్‌ కచ్‌ టూర్‌లను  అందుబాటులోకి తెచ్చారు. నవంబర్‌ 7 నుంచి 12 వరకు 5 రాత్రులు, 6 పగళ్లు మేఘాలయ టూర్‌ ఉంటుంది. ఈ పర్యటనలో గౌహతి నుంచి షిల్లాంగ్‌ చేరుకొని వర్డ్స్‌ లేక్, పోలీస్‌ బజార్‌ సందర్శిస్తారు. చిరపుంజి, నొహకలికాయ్‌ జలపాతం, మౌస్మి గుహలు, ఎలిఫెంటా జలపాతం. ఖజిరంగా నేషనల్‌ పార్కు, డాన్‌బాస్కో మ్యూజియం, ఉమియుమ్‌ లేక్, జీప్‌ సఫారీ, బాలాజీ టెంపుల్, కామాఖ్య టెంపుల్‌ తదితర ప్రాంతాలు సందర్శించవచ్చు.  

ప్యాకేజీ ఇలా..  
ఇరువురికి  రూ.33,325, ముగ్గురు కలిపి బుక్‌ చేసుకుంటే రూ.30,397.  

రన్‌ ఆఫ్‌ కచ్‌ వేడుకలు.. మనసు రంజిల్లు..
నవంబర్‌ 16 నుంచి 18 వరకు కొనసాగే గుజరాత్‌లోని కచ్‌ ఎడారి పర్యటన ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. తెల్లటి ఎడారిలో ఉప్పును తయారు చేయడం ఒక వేడుకగా నిర్వహిస్తారు. కన్నుల పండువగా సాగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనలో మొదట కాండ్లా చేరుకుని నేరుగా రాన్‌ ఆఫ్‌ కచ్‌ వేడుకలకు బయలుదేరతారు. రెండో రోజు పూర్తిగా కచ్‌ ఫెస్టివల్‌లోనే ఎంజాయ్‌ చేయొచ్చు. మూడో రోజు నవంబర్‌ 18న కచ్‌ నుంచి బయలుదేరి భుజ్‌ మీదుగా శ్రీ స్వామి నారాయణ టెంపుల్, ఐనా మహల్, భుజోడీ విలేజ్, క్రాఫ్ట్‌ పార్కు తదితర ప్రాంతాలను సందర్శిస్తారు.  ప్యాకేజీ ఇలా.. ఒకరికి రూ.29,706, ఇద్దరికి కలిపి బుక్‌ చేసుకుంటే 27,563 (ఒక్కరికి)

వివరాలకు సంప్రదించండి..
మాన్సూన్‌ పర్యటనల వివరాలు, బుకింగ్‌ కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీకార్యాలయంలో లేదా 04027702407, 97774 40030లలో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top