
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని కార్డియాలజీ విభాగాలు తీవ్రమైన గుండెపోటుతో బాధపడుతున్నాయి. మౌలిక సదుపాయాల కొరతకు తోడు ఆస్పత్రి అధికారులు ఆయా విభాగాలపై చిన్నచూపు చూస్తుండటం, చికిత్స చేసేందుకు అవసరమైన నిపుణులు లేకపోవడం, ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయక పోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. దీంతో అవి కేవలం వ్యాధి నిర్ధారణ పరీక్షలకే పరిమిత మవుతున్నాయి. గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభా గానికి రోజుకు సగటున 150 నుంచి 200 మంది హృద్రోగ బాధితులు వస్తుండగా, ఉస్మానియాకు రోజుకు సగటున 250 మంది వరకు వస్తుంటారు. వీరిలో 20 నుంచి 30 మంది వరకు పుట్టుకతోనే గుండెకు రంద్రాలు ఏర్పడిన శిశువులు ఉంటారు. వీరిలో 20 నుంచి 30 శాతం మందికి అమర్చాల్సి ఉండగా, 5 నుంచి 10 మందికి బైపాస్ సర్జరీలు అవసరమవుతుంటాయి. అయితే ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినంత మంది హృద్రోగ నిపుణులు లేకపోవడం, క్యాథ్‌ల్యాబ్ సర్వీసు ముగియడం, వాటిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో గుండె చికిత్సలకు విఘా తం ఏర్పడుతోంది. దీంతో రోగులకు కేవలం వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయడం, మందులు రాయడం, అవసరమైన వారికి స్టంట్లు వేయడం మినహా ఇతర మేజర్ (బైపాస్)చికిత్సలేవీ జరగడం లేదు.
వేధిస్తున్న పర్ఫ్యూజనిస్ట్‌ల కొరత
ఇతర సర్జరీలతో పోలిస్తే బైపాస్ సర్జరీ కొంత క్లిష్టమైంది. కార్డియో థొరాసిక్ సర్జన్ సహా అనెస్తీషియా వైద్యనిపుణుడితో పాటు (పంప్‌టీమ్)పర్ఫ్యూజనిస్ట్, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల సహకారం అవసరం. ఇది పూర్తిగా టీమ్ వర్క్‌తో ముడిపడి ఉంటుంది. సీటీ సర్జన్ రోగి ఛాతిపై 6 నుంచి 8 ఇంచుల వరకు కోత పెట్టి ఛాతిని ఓపెన్ చేసి దెబ్బతిన్న గుండె భాగాన్ని పునరుద్ధరిస్తే, మత్తు వైద్యుడు నొప్పిని నియంత్రిస్తాడు. సర్జరీ సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి వస్తుంది. కీలకమైన ఈ మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్‌లు ఆపరేట్ చేస్తుంటారు. ఇటీవల ఈ టెక్నిషియన్లు పదవీ విరమణ చేశారు. ప్రభుత్వం ఆయా ఖాళీలను భర్తీ చేయలేదు. కీలకమైన టెక్నిషియన్ లేకపోవడంతో పాటు సర్జరీకి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుండటం, ఆ తర్వాత రోగిని ఐసీయూలో అడ్మిట్ చేసి, అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. అధిక సమయంతో పాటు ఎక్కువ రిస్క్‌ను ఫేస్ చేయాల్సి వస్తుండటంతో వైద్యులు వీటికి దూరంగా ఉంటున్నారు. అదే కార్డియాలజీ విభాగాల్లో రోజుకు సగటున రెండు మూడు సాధారణ ప్రొసీజర్లు చేస్తున్నప్పటికీ..కార్డియోథొరాసిక్ విభాగాల్లో ఏడాదికి కనీసం ఒకటి రెండు కూడా చేయక పోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా తీవ్రమైన హృద్రోగ సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీలు అవసరమైన నిరుపేద రోగులు చేసేది లేక కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.
నిమ్స్ కొంత నయం
హృద్రోగ చికిత్సల్లో నిమ్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎయిమ్స్ సహా మరెక్కడా లేని విధంగా నిమ్స్‌లో అన్ని విభాగాల నిపుణులు అందుబాటులో ఉండటంతో పాటు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, పుట్టుకతో వచ్చే జన్యుసంబంధ గుండె జబ్బుల చికిత్సలు, రక్తనాళాల మార్పిడి, గుండె మార్పిడి వంటి కీలక విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. అనేక అరుదైన గుండె మార్పిడి చికిత్సలు చేసిన అనుభవం ఇక్కడి వైద్యులకు ఉంది. మూసుకుపోయిన రక్తనాళాలను స్టంట్లతో ఓపెన్ చేయడం, లీకేజీలను నియంత్రించడం వంటి సర్జరీలు సహా బైపాస్, వాల్వ్‌రీప్లేస్, హార్ట్/లంగ్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్లు కూడా ఇక్కడ జరుగుతుండటం, ఇతర ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ నిపుణులు అందుబాటులో ఉండటం, మెరుగైన చికిత్సలు అందుతుండటం వల్ల సాధారణ రోగులతో పాటు ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఇక్కడ చేరేందుకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఉస్మానియా, గాంధీలో సీటీ సర్జరీలు నిలిపివేయడంతో ఆ రోగులు కూడా ఇక్కడికే వస్తుంటారు. ఇతర విభాగాలకు లేని గుర్తింపు కార్డియాలజీ విభాగాలకు దక్కుతుండటంతో పరిపాలన విభాగంలోని కొందరు అధికారులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయా విభాగాలను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వీరం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అరుదైన చికిత్సలతో ఆస్పత్రికి గుర్తింపు తెస్తున్న వైద్యులను ప్రోత్సహించక పోగా, నిర్లక్ష్యం చేస్తుండటంతో పలువురు వైద్యులు మనస్తాపంతో ఆస్పత్రిని వీడుతున్నట్లు సమాచారం. ఫలితంగా గత ఏడాది నుంచి ట్రాన్స్‌ప్లాంటేషన్లు నిలిచిపోగా, సాధారణ చికిత్సలు కూడా గణనీయంగా తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది.