అడవుల సంరక్షణలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఆదిలాబాద్ క్రైం : అడవుల సంరక్షణలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటవీ సిబ్బంది కంటే కలప పట్టుకోవడంలో పోలీసులే ముందుండటమే ఇందుకు నిదర్శనం. అటవీ సిబ్బంది కలపను పట్టుకోవడం దేవుడెరుక.. పట్టుకున్న కలపను స్వాధీనం చేసుకోవడం, వచ్చిన సమాచారానికి స్పందిస్తే చాలనే భావన నెలకొంది. జిల్లా విస్తీర్ణంలో 43 శాతం అడవులు ఉన్నాయి.
సుమారు 7.15 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. జిల్లాలో టేకు చెట్లకు డిమాండ్ అ ధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కలపస్మగర్ల దాటికి అడవి అంతరించి పోతోంది. జిల్లాలోని ఆరు డివిజన్‌ల పరిధిలో 20 చెక్‌పోస్టులు ఉన్నా కలప స్మగ్లర్ల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా అడవులు కాపాడటంలో అటవీశా ఖ అధికారులు దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.
పోలీసులదే ముఖ్య భూమిక
కొంత కాలంగా జిల్లాలో కలప రవాణాను అడ్డుకోవడంలో పోలీసులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారుల మన్ననలు కూడా అందుకుంటున్నారు. కాగా అటవీ సంపదను కాపాడి.. కలప అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత కలిగిన అటవీ శాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు రైలులో అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. పలు సందర్భాల్లో నిందితులు పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి.
పట్టుకున్న కలపను స్వాధీనం చేసుకోవడంలో అటవీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా పోలీసులకు పలుమార్లు పట్టుబడ్డ కలపను స్వాధీనం చేసుకోవాలని అటవీ సిబ్బందికి సమాచారం అందించిన సరైన సమయానికి రాకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు పోలీసు వర్గాలు చర్చించుకోవడం గమనార్హం.
స్వాధీనం చేసుకోవడానికి గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, కొన్ని సందర్భాల్లో రాత్రి సమయంలో పట్టుబడ్డ కలపను తర్వాతి రోజు వచ్చి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ పట్టణానికి తాసిం, తలమడుగు, ఇచ్చోడ, బజార్‌హత్నూర్ ప్రాంతాల నుంచి కలప రవాణా అవుతుంది. కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసినా అటవీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా అటవీ సిబ్బంది కంటే కలప పట్టుకోవడంలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
తరలుతున్న కలప
జిల్లాలో కలప అక్రమ రవాణా మూడేళ్లలో చూసుకుంటే 17,681 కేసులు నమోదు కాగా రూ.24కోట్ల విలువైన కలప ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో కలప, వాహనాలు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులు పట్టుబ డ్డ సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. అసలు నేరస్తులు మాత్రం దొరకడం లేదు. జిల్లాలో అడవులు నరరకడంతో విలువైన వృక్ష సంపదను కోల్పోతున్నాము. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, నిర్మల్, మామడ, ఖానాపూర్, బిర్సాయిపేట, తాళ్లపేట్, ఇందన్‌పల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల నుంచి కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది.
రోడ్లు, నదులు, రైల్వే మార్గం గుండా ఈ దందా కొనసాగుతుంది. రోడ్డు మా ర్గం గుండా తరలించే కలపను అక్కడక్కడ పోలీసు తనిఖీల్లో పట్టుబడుతుండగా.. నదులు, రైల్వే, ఇతర అక్రమ దారుల గుండా తరలించే కలపను పట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో అటవీ సిబ్బంది కంటే పోలీసులే ముందుంటున్నార ు. జిల్లాలో ప్రతి ఏటా రూ. 10 కోట్లకు పైగా టేకు స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండడంతో అడవి ఎంత పెద్ద మొత్తంలో నరకబడుతుందో కేసుల సంఖ్యను చూస్తే తెలిసిపోతుంది.
ఆయుధాలుంటే అడ్డుకోగలరు..
అటవీశాఖ అధికారులకు ఆయుధాలు లేకపోవడంతోనే స్మగ్లర్లు భయంలేకుండా యథేచ్ఛగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. కలప రవాణాను అడ్డుకునే సమయంలో తమపై దాడి చేస్తారేమోనని అటవీశాఖ సిబ్బంది భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కలప రవాణాను అడ్డుకోవడంలో పురోగతి సాధించడం లేదని తెలుస్తోంది. తమ వద్ద కూడా తుపాకులుంటే స్మగ్లర్లు భయపడుతారని, కలప అక్రమ రవాణా చేసేందుకు సాహసించరని చెప్పుకొస్తున్నారు. అయితే 1982కు ముందు అటవీశాఖ సిబ్బంది ఆయుధాలు, వైర్‌లెస్ సెట్లు ఉండేవి.
కానీ మావోయిస్టుల ప్రభావంతో ఎక్కడ ఆయుధాలు అపహరించుకుపోయే అవకాశాలు ఉన్నందున 1986లో ప్రభుత్వం ఆయుధాలను వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి అటవీ సంరక్షణలో ఉన్న సిబ్బందిపై స్మగ్లర్ల దాడులు పెరిగాయి. పలువురు వీరి దాడుల్లో మృత్యువాత కూడా పడ్డారు. దీంతో స్మగ్లర్లను అడ్డుకోవడంతో ఫారెస్టు అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. పోలీసులకు ఆయుధాలు ఉండడంతో స్మగ్లర్లు వారిపై దాడులు చేసేందుకు భయపడుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులకు కలప రవాణా అవుతుందని తెలిస్తే ఆ ప్రాంతంలో నిర్భయంగా తనిఖీలు చేస్తున్నారు. అవే ఆయుధాలు తమకు కూడా ఇస్తే అటవీ సంరక్షణకు పాటుపడుతామని అధికారులు పేర్కొంటున్నారు.
కలప రవాణాను అడ్డుకుంటాం..
కలప రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టడం జ రిగింది. కలప తరలించే మార్గాలన్నింటిని మూసివేస్తున్నాం. ప్రస్తుతం 20 శాతం మంది సిబ్బంది కొరత ఉన్నప్పటికి కలప రవాణాను అడ్డుకోవడంలో సిబ్బంది కృషి చేస్తున్నారు. దీనికి పోలీసులు సైతం సహకరిస్తున్నారు. కలప తరులుతున్నట్లు ఎటువంటి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి అ క్కడికి చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కలపతో పాటు వాటిని రవాణా చేసేవారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నాం. అటవీ సంపదను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాం. వచ్చే ఏడాదిలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అడవులను కాపాడే బాద్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.