తుప్పుకిక ఓటమి తప్పదు... 

Chemical for the mango leaves oxide - Sakshi

మామిడి ఆకుల నుంచి తుప్పు వదిలించే రసాయనం  

అభివృద్ధిపరిచిన తిరువనంతపురం పరిశోధకులు 

మామిడి ఆకులను ఎందుకు వాడతారు? గుమ్మానికి తోరణంగా వాడొచ్చు.. యాగాలు, హోమాలు చేస్తూంటే ప్రోక్షణకు పనికొస్తుంది. అంతకుమించి దానివల్ల ఇంకేం ఉపయోగం అంటున్నారా? మీ ఆలోచనలకు కళ్లెం వేయండి. ఎందుకంటే.. ఇకపై ఈ మామిడాకులు ఏటా లక్షల కోట్లు ఆదా చేస్తాయి మరి! ఎలాగంటే.. ఇనుమును అలాగే వదిలిస్తే ఏమవుతుంది? కొంత కాలానికి తుప్పు పడుతుంది. సముద్రంలో ఎప్పుడూ ఉండే పెద్ద పెద్ద నౌకలు మరింత వేగంగా తుప్పుపడతాయి. ఈ తుప్పు వదిలించుకునేందుకు అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఏకంగా.. రెండున్నర లక్షల కోట్ల డాలర్లు! అయితే మామిడాకుల నుంచి తీసిన ఓ పదార్థం ఇనుముకు తుప్పు అసలే పట్టనివ్వదని తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ పదార్థాన్ని వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న కృత్రిమ రంగుల వాడకాన్ని నిలిపివేయవచ్చని అంచనా.

మామిడాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, తుప్పు తట్టుకునే పాలీఫినాల్స్‌ ఎక్కువగా ఉంటాయని.. అందుకే తాము వీటిపై పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నిషాంత్‌ కె.గోపాలన్‌ తెలిపారు. ఎథనాల్‌ సాయంతో ఎండిపోయిన మామిడాకుల నుంచి పాలీఫినాల్స్‌ వంటి రసాయనాలను తొలుత వేరు చేశామని చెప్పారు. వేర్వేరు సాంద్రతలతో ఈ రసాయనాలను పరిశీలించగా ఇనుము లాంటి లోహాలతో బంధం ఏర్పరచుకున్న పాలీఫినాల్స్‌ తుప్పును సమర్థంగా అడ్డుకుంటుందని వివరించారు.

గరిష్టమైన నిరోధకత కలిగిన పదార్థపు పూత పూసిన ఇనుమును ఉప్పునీటిలో ఉంచి పరీక్షించినప్పుడు తుప్పు పట్టడం 99 శాతం తగ్గిందని చెప్పారు. ఈ పదార్థంపై మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉందని గోపాలన్‌ చెప్పారు. మార్కెట్‌లో తుప్పును నిరోధించే రసాయనాలు ఎన్నో ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కు వని.. పైగా వాటితో మానవ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంద న్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తాము మొక్కల రసాయనాలను అన్వేషించామని చెప్పారు. మామిడాకులతో పాటు ఈత/ఖర్జూరపు గింజలు, అల్లం నుంచి వేరు చేసిన రసాయనాలు కూడా తుప్పును తట్టుకోగలవని తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top