కీచక జాబితా @ ఐటీఎస్‌ఎస్‌ఓ  | Central Govt has Taken A Revolutionary Step In Its Efforts to Prevent Physical Assaults | Sakshi
Sakshi News home page

కీచక జాబితా @ ఐటీఎస్‌ఎస్‌ఓ 

Mar 10 2020 1:46 AM | Updated on Mar 10 2020 1:46 AM

Central Govt has Taken A Revolutionary Step In Its Efforts to Prevent Physical Assaults - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్రం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అలాంటి దారుణాలకు పాల్పడే కీచక జాబితా సిద్ధం చేసి ప్రత్యేక డేటాబేస్‌ ద్వారా అన్ని రాష్ట్రాలు, ఏజెన్సీలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలోపడింది. దీనికోసం క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌)కి భిన్నంగా ‘ఇన్వెస్టిగేటింగ్‌ ట్రాకింగ్‌ సిస్టం ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’(ఐటీఎస్‌ఎస్‌ఓ)కు రూపమిస్తోంది.

ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా ఆ జాబితాలను అప్‌డేట్‌ చేసి అందజేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిధిలో నడిచే సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరగాళ్ల గత చరిత్రను పోలీసులు తెలుసుకుంటున్నారు. కీచక నేరస్థులు మళ్లీ నేరం చేసి దొరికినపుడు వారి గత చరిత్రను ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లలో పేర్కొనాలని యోచిస్తోంది. దీనికోసమే ఐటీఎస్‌ఎస్‌ఓ అందుబాటులోకి తీసుకొస్తోంది. 

‘దిశ’ ఘటన నేపథ్యంలో.. 
‘దిశ’ఘటన నేపథ్యంలో కేంద్రం మహిళలపై అకృత్యాలకు పాల్పడే నిందితులందరికీ ప్రత్యేక డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీఎస్‌ఎస్‌ఓ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. హైదరాబాద్‌ శివారులో నవంబర్‌ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశపై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. తరువాత డిసెంబర్‌ 6న జరిగిన పోలీస్‌ ఎన్‌కౌంటర్లలో దిశ కేసులో నిందితులు నలుగురు చనిపోయారు. నిందితులు నలుగురు వృత్తిరీత్యా లారీ డ్రైవర్లు, క్లీనర్లు కావడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా మహిళలపై అలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అన్న అనుమానాలను సీపీ సజ్జనార్‌ సైతం వ్యక్తం చేశారు. గతంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది. వారి డీఎన్‌ఏ శాంపిళ్లను కర్ణాటకతోపాటు, ఏపీ తదితర రాష్ట్రాలకు పంపుతామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. 

భవిష్యత్తులో ఐటీఎస్‌ఎస్‌ఓనే ఆధారం.. 
ఈ డేటాబేస్‌లో ఆడవారిపై అనుచితంగా ప్రవర్తించేవారు, అఘాయిత్యాలకు పాల్పడేవారు, ట్రాఫికింగ్, వ్యభిచారం, కిడ్నాపులు, ఆన్‌లైన్‌ వేధింపులకు పాల్పడేవారి జాబితాను పొందుపరుస్తారు. ఇందులో నేరగాళ్ల వేలిముద్రలు, బ్లడ్‌గ్రూప్, డీఎన్‌ఏ, పాత నేరాలు, నేర స్వభావం, నేరం చేసే విధానం తదితర విషయాలు రికార్డు చేస్తారు. దేశంలో ఎక్కడ మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఘటనాస్థలంలో దొరికిన శాంపిల్స్‌ను ఇకపై ఐటీఎస్‌ఎస్‌ఓకు పంపుతారు. ఒకవేళ నేరస్తుడిని ముందే గుర్తించినా అతని వేలిముద్రలను ఐటీఎస్‌ఎస్‌ఓతో పోల్చి చూస్తారు.

ఒకవేళ గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటే.. అవి కూడా దర్యాప్తు అధికారికి తెలుస్తాయి. ఫలితంగా దర్యాప్తు వేగంగా పూర్తవుతుంది. పాత నేరస్తుడి గత చరిత్రను చార్జిషీటుతో పాటు కలిపి న్యాయస్థానానికి సమర్పించడంతో నిందితుడికి తక్కువ సమయంలో కఠిన శిక్షలు పడేలా చూడాలన్నది కేంద్రం యోచన. ప్రస్తుతం తెలంగాణ పోలీసుల వద్ద దాదాపుగా 5 లక్షల మందికిపైగా నేరస్తుల వేలిముద్రలు, నేర చరిత్ర వివరాలున్నాయి. వీటిలో రేపిస్టులు, మహిళలను వేధించేవారి వివరాలను వేరు చేసి త్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement