అర్హతలున్నా అలక్ష్యం!

Autonomous Status not giving universities - Sakshi

కాలేజీలకు అటానమస్‌ హోదాపై వర్సిటీల నిర్లక్ష్యం

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 30 శాతం సిలబస్‌ను మార్చుకుని కోర్సులు నిర్వహించుకునేలా అర్హతలున్న కాలేజీలకు అటానమస్‌ హోదా ఇవ్వడంలో యూనివర్సిటీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అర్హతలున్న కాలేజీలు అటానమస్‌ హోదా తీసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పదేపదే చెబుతున్నా వర్సిటీలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు అటానమస్‌ హోదా ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అర్హత కలిగిన కాలేజీలు అనేకం ఉన్నా అటానమస్‌ హోదా కోసం ప్రయత్నిస్తున్న కాలేజీలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 3 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉంటే కేవలం 59 కాలేజీలకే అటానమస్‌ హోదా ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
– సాక్షి, హైదరాబాద్‌

పెత్తనం పోతుందనే...
విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం... న్యాక్‌ గుర్తింపు ఉంటేనే రూసా నిధులను ఇస్తామన్న నిబంధనను విధించింది. అంతేకాదు న్యాక్‌ గుర్తింపు ఇచ్చే నిబంధనలను మార్చింది. విద్యార్థుల అభిప్రాయాలను, ఆ కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే న్యాక్‌ గుర్తింపు ఇచ్చేలా నిబంధనలను సవరించింది. మరోవైపు న్యాక్‌ గుర్తింపు ఉన్న కాలేజీలన్నీ అటానమస్‌ కోసం చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులు తమ పరిధిలోని కాలేజీలపై పెత్తనం పోతుందని, తమకు వచ్చే ముడుపులకు గండి పడుతుందన్న ఆలోచనలతో ప్రమాణాలుగల కాలేజీలు అటానమస్‌ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కా>లేజీలు దరఖాస్తు చేసుకున్నా ఎన్‌వోసీ ఇవ్వకుండా యూజీసీకి ఆ దరఖాస్తులను పంపట్లేదన్న విమర్శలు ఉన్నాయి.

అటానమస్‌తో ఎన్నెన్నో ప్రయోజనాలు..
.అటానమస్‌ హోదా వల్ల కాలేజీలకే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాలేజీలు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా 30% సిలబస్‌ను మార్పు చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ కాలేజీ ల్లో చేరేలా ఆకర్షించవచ్చు. సొంత పరీక్షల విధానం అమలు చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు తగిన ట్లు సిలబస్‌ రూపొందించుకుని అమలు చేస్తారు కనుక పరిశ్రమలు కూడా అటానమస్‌ కాలేజీల నుంచే ఎక్కు వ మంది విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ హోదా పొందేందుకు అటానమస్‌ హోదా తప్పనిసరి. అటానమస్‌ హోదాకు దరఖాస్తు చేసే కాలేజీల్లోని కోర్సులకు ఎన్‌బీఏ 675 పాయింట్లకంటే ఎక్కువ స్కోర్‌ ఉండాలని లేదా కనీసం న్యాక్‌ ఏ గ్రేడ్‌ కలిగి ఉండాలి.


రాష్ట్రంలో పరిస్థితి ఇలా..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలోని 3 వేల వరకు కాలేజీలు ఉంటే వాటిలో కేవలం 59 కాలేజీలకే అటానమస్‌ హోదా ఉంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని 42 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అటానమస్‌ హోదా ఉండగా మిగతావి డిగ్రీ, పీజీ, బీఎడ్‌ కాలేజీలు.

658 కాలేజీలకే అటానమస్‌
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 వరకు యూనివర్సిటీలు, 40 వేల వరకు ఉన్నతవిద్య కాలేజీలు ఉన్నాయి. యూజీసీ ఇటీవల జారీ చేసిన లెక్కల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 106 వర్సిటీల పరిధిలోని 658 కాలేజీలకే అటానమస్‌ హోదా ఉంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం తోపాటు అటానమస్‌ హోదా తీసుకునేలా కాలేజీలను ప్రోత్సహించాలని కేంద్రం తెలి పింది. దీనిలో భాగంగా అటానమస్‌కు దరఖాస్తు చేసేలా కాలేజీలను ప్రోత్సహించేం దుకు ఫిబ్రవరి 4న యూజీసీ మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో దేశవ్యాప్త సదస్సు నిర్వహించనుంది.

మార్పులు తెచ్చుకోవాలి..
యూనివర్సిటీలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలి. కాలేజీలపై పెత్తనం కోసం పాకులాడవద్దు. అర్హత కలిగిన కాలేజీలు అటానమస్‌ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి.
– తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top