
స్టోక్స్ సెంచరీ: ఇంగ్లండ్‌దే సిరీస్
ఇంగ్లండ్ మళ్లీ 300 పైచిలుకు పరుగులు బాదేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 2 పరుగుల తేడాతో గెలిచింది.
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మళ్లీ 300 పైచిలుకు పరుగులు బాదేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 2 పరుగుల తేడాతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. స్టోక్స్ (79 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), బట్లర్ (53 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
రబడకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా గెలుపు వాకిట బోల్తా పడింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 4 పరుగులే చేసింది. ఫలితంగా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసి ఓడింది. డికాక్ (98; 11 ఫోర్లు) 2 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. డివిలియర్స్ (52), మిల్లర్ (71 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్లంకెట్‌కు 3 వికెట్లు దక్కాయి.