ఓట్ల కోసం... ప్రధాని పచ్చి అబద్ధాలు

KCR Fires On Narendra Modi - Sakshi

ఐదేళ్లు ఆయనేం అభివృద్ధి చేశారు?.. మిర్యాలగూడ సభలో కేసీఆర్‌

మోదీవన్నీ వట్టిమాటలు

ఆరోగ్యశ్రీకి కాపీయే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం

ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తా

జూన్‌లో దేశమే ఆశ్చర్యపడేలా రైతుల బాధలు తీరుస్తా

అప్పటిదాకా మ్యుటేషన్లు, పట్టాలు చేసుకోకండి

ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ పీసీసీ పదవి ఊస్టింగే 

ఓట్ల కోసం, రాజకీయాల కోసం ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు, ఘోరమైన మాటలు మాట్లాడిండు. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీనే కాపీ కొట్టి ‘ఆయుష్మాన్‌ భారత్‌’  తీసుకొచ్చారు. ఐదేళ్లు దేశంలో ఏం అభివృద్ధి జరిగిందని?. గోల్‌మాల్‌ గందరగోళం చేసిండ్రు.

యూపీఏ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి. అవి బయటకు చెప్పరు. అవి వ్యూహాత్మక దాడులు. ప్రధాని మోదీ మొన్న సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని డంబాచారంగా డొల్ల ప్రచారం చేశారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ఓట్ల కోసం, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు, ఘోరమైన మాటలు మాట్లాడిండు. కేంద్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రం అందులో చేరలేదంటడు. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్నే కాపీ కొట్టి ఆయుష్మాన్‌భారత్‌ పథకం తీసుకొచ్చారు. ఐదేళ్లు దేశంలో ఏం అభివృద్ధి జరిగిందని? వట్టి మాటలు, గోల్‌మాల్‌ గందరగోళం చేసిండ్రు. రైతులకు ఏం చేశారు? దళిత, గిరిజన, మైనారిటీ, బీసీలకు ఏం చేశారు?’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సభలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కేశవరావు, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నల్లగొండ లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, చందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్‌ నాయకులు తేరా చిన్నపరెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌ కుమార్, తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...

గాంధీలు, చౌకీదార్‌ల ప్రచారంతోప్రజలకు ఒరిగిందేమీ లేదు...
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇచ్చేది చాలా తక్కువ. దానికంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ ఉన్నందునే తిరస్కరించా. ఈ రెండు పథకాల్లో ఏది గొప్పదో చర్చకు రావాలి. మోదీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలు ఆలోచించాలి. రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు, బీసీలకు ప్రధాని ఏమైనా చేశారా? కాంగ్రెస్‌లేని భారత్‌ అని బీజేపీ, మోదీని గద్దె దించుతామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. గాంధీలు చౌకీదార్‌లు సాగిస్తున్న ప్రచారాలతో దేశంలో మైకులు పగులుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏమీ ఒరగడంలేదు.

బీసీలు కనపడరా ?
కేంద్ర కేబినెట్‌లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆర్‌. కృష్ణయ్యను వెంటబెట్టుకొని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిశా. బీసీల కోసం మంత్రిత్వశాఖ పెట్టాలని కోరా. కానీ నాడు కాంగ్రెసోళ్లు, ఇప్పుడు బీజేపీ నేతలు బీసీల కోసం మంత్రిత్వశాఖ పెట్టలేదు. 50 శాతం ఉన్న బీసీలను 73 ఏళ్లపాటు పట్టించుకోలేదు. వాళ్లకు కళ్లు నెత్తికి ఎక్కినయా.. బీసీలు కనబడరా? కానీ అడ్డం పొడవు మాట్లాడుతారు. దేశంలో గుణాత్మక మార్పు వచ్చినప్పుడే ప్రజల బాధలు తీరుతాయి. సన్నాసుల పరిపాలన వల్ల ఏం కాదు.

11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి...
యూపీఏ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి. అవి బయటకు చెప్పరు. అవి వ్యూహాత్మక దాడులు. వాళ్లు (పాక్‌) చేస్తారు. మనం (భారత సైన్యం) చేస్తాం. ప్రధాని మోదీ మొన్న సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని డంబాచారంగా డొల్ల ప్రచారం చేశారు. చీమ కూడా చావలేదని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చెప్పాడు. దేశాన్ని ఇలాగే నడుపుతరా? ఈ ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? దేశం సమస్యలు పట్టవా? పేదరికం, రైతుల సమస్యలు పరిష్కరించరా?  

సూడో హిందువులు...
వాళ్లంతా (బీజేపీ నేతలను ఉద్దేశించి) సూడో హిందువులు. ఓటు హిందువులు. మనం భక్తితో ఉన్నం. వారిది రాజకీయ హిందుత్వం.. నిజమైనది కాదు. వేరే మతాలను సహించనిది హిందూ మతం ఎట్లయితది? వారు చెప్పే మాటలు విని యువత ఆగం కావొద్దు. మనం దేశానికి ఆదర్శంగా ఉన్నాం. రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ భగీరథ పథకాలు దేశం దృష్టిని ఆకర్శించాయి. దేశంలో 70 వేల టీఎంసీల నీరుంది. ఎందుకు వాడుకోవడం లేదు? ఎన్నికల తర్వాత బీజేపీ శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.

అంతర్జాతీయ స్థాయికి ఎదగలే...
దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును వాడుకోవడం లేదు. 70 వేల టీఎంసీల నీటిని వాడుకోవడం లేదు. 40 కోట్ల ఎకరాల భూమి ఉంది. దీనంతటికీ 30 వేల టీఎంసీల నీరు చాలు. ఇంత కరెంటున్నా సగం దేశం చీకటిగానే ఉంది. విదేశాల్లో ఒక ట్రక్‌ 80 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతుంటే ఇండియాలో 24 కి.మీ స్పీడే. అంటే రోడ్లు లేవు. రైల్వే అభివృద్ధి కాలేదు. అంతర్జాతీయ స్థాయికి మనం ఇంకా ఎదగలేదు. కానీ మోదీ, రాహుల్‌ మాత్రం రఫేల్, బోఫోర్స్‌ అంటూ పరువు తీస్తున్నరు.

పొలికేక పెట్టడానికి నేను సిద్ధం...
దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దేశంలో గత్తర లేపుతా. జాతీయ పార్టీ స్థాపిస్తా. ఒకాయన ఏం కేసీఆర్‌.. ఎన్నికలు వచ్చినయ్, పార్టీ ఎప్పుడు స్థాపిస్తవ్‌ అని ప్రశ్నించిండు. నాది ఎలక్షన్‌ టార్గెట్‌ కాదు. దేశం టార్గెట్‌. రైతుల బాధలు తీరాలి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పెడతా. పొలికేక పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు 16 మంది ఎంపీలను గెలిపియ్యాలి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు గెలిచినా వారు గులాములు, బానిసలు.  కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర, సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలి. వీళ్లు (బీజేపీ, కాంగ్రెస్‌) రాష్ట్రాల హక్కులను తొక్కేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కొట్లాడామో అదే పద్ధతిలో దేశానికి ఉత్తమమైన పాలన అందిద్దాం.

అన్నింటా తెలంగాణ నంబర్‌ వన్‌...
గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదు.. ప్రజల అభిమతం. అదే విజయం సాధించాలి. ప్రజలు ఎవరిని గెలిపించాలని కోరుకుంటారో వాళ్లే గెలవాలి. తెలంగాణ అన్నింటా నంబర్‌ వన్‌గా నిలుస్తోంది. ఆర్థిక ప్రగతిలో నంబర్‌ వన్‌. కరెంటు సరఫరాలో నంబర్‌ వన్‌. ప్రజా సంక్షేమబాట పట్టింది. దాన్ని చూసే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం అందించారు. ఏపీలో గతంలో బందీలుగా ఉన్నాం. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాం. రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటా. చివరి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తాం.

ఎన్డీయేకు 150.. కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు
ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ భరతం పడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ పగటి కలలు కంటున్నడు. తాజా సర్వేలు, తాజా సమాచారం మేరకు ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 150 సీట్లు, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు. దేశ పాలనలో మే 23వ తేదీ తర్వాత పెను మార్పులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు కేంద్ర రాజకీయాలను శాసిస్తాయి. పదహారు మంది ఎంపీలతో ఇన్నాళ్లూ గడ్డి పీకారా అని విమర్శిస్తున్నరు. మరి ఢిల్లీలో అధికారంలో ఉండి నువ్వేం పీకినవ్‌? ఏ వర్గం సంతోషంగా ఉంది?

టికెట్లు అమ్ముకునే సంస్కృతి  కాంగ్రెస్‌దే...
నేను రూ. 100 కోట్లు తీసుకొని వేమిరెడ్డి నర్సింహారెడ్డికి టికెట్‌ ఇచ్చానని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపణ చేసిండు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  ఉత్తమ్, కుంతియా టికెట్లు అమ్ముకున్నారని క్యామ మల్లేశ్, బోడ జనార్దన్, సర్వే సత్యనారాయణ, భిక్షపతి యాదవ్, శ్రీహరి అనే వ్యక్తులు ఆరోపణలు చేశారు. టికెట్లు అమ్ముకునే నీచ సంస్కృతి మాకు లేదు. ఆ టక్కుటమార విద్య మాకు రాదు. వేమిరెడ్డి వాడుకుంటున్న జెండాలను కూడా మేమే పంపించాం. ఆయన కొత్త వ్యక్తి కాదు. 15 ఏళ్ల నుంచే ఆయన టీఆర్‌ఎస్‌ అభిమాని. అవసరం వచ్చినప్పుడల్లా ఉద్యమానికి ఆర్థిక అండదండలు ఇచ్చిండు. అవకాశం ఇస్తే సేవ చేస్తానని అన్నందుకు టికెట్‌ ఇచ్చాం. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోలేకనే ఉత్తమ్‌ నీచమైన మాటలు మాట్లాడుతుండు. దొంగకు దొంగ బుద్ధి.. లంగకు లంగ బుద్ధి. ఉత్తమ్‌ తన మాటలు వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి. ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ పీసీసీ పదవి ఊస్టు అయితది. కానీ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నర్సింహారెడ్డి మాత్రం ఎంపీగా గెలిచి, ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంటులో కూర్చుంటడు.

ఒక్క రూపాయి కూడా  లంచం ఇవ్వకండి...
ప్రభుత్వ అధికారులకు రేపట్నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకండి. నేను యువ రైతుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత నా పీఏల కు, కార్యాలయానికి వందల, వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. నేను హామీ ఇస్తున్నా. నెలపదిహేను రోజులు ఓపిక పట్టండి. గ్రౌండ్‌లో ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు. నేనూ రైతు బిడ్డనే. ఆ బాధలు నాకు తెలుసు. కాబట్టి నెలా పదిహేను రోజుల దాకా ఎవరికీ లంచం ఇవ్వకండి. మ్యుటేషన్లు, పట్టాలు చేసుకోకండి. జూన్‌ మాసంలో దేశమే ఆశ్చర్యపడే విధంగా రైతుల బాధలు తీరుస్తాను. అప్పటి దాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గుడికి కూడా లంచం ఇవ్వకండి. రేపట్నుంచి లంచం ఇవ్వడం బంద్‌ చేయండి. నెలపదిహేను రోజుల వరకు మీ పనులు పెండింగ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని రైతుల సమస్యలు పరి ష్కారం చేస్తా. రైతు సమస్యలు, పోడు భూముల సమస్యలను పరిష్కరించే దాకా నేను నిద్రపో ను, అధికారులను నిద్ర పోనివ్వను.  

ఎల్బీ స్టేడియం సభకురాలేకపోయిన సీఎం
హైదరాబాద్‌ :
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ శుక్రవారం సాయంత్రం  నిర్వహించిన బహిరంగ సభ కు ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు హాజరు కాలేకపోయారు. సాయంత్రం నాలుగు గం టలకు మిర్యాలగూడలో జరిగిన నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌ బహిరంగ సభకు హాజరైన కేసీఆర్‌... సాయంత్రం ఐదున్నర గంటలకు ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల (నగర ప్రాంతం) లోక్‌సభ సెగ్మెంట్ల ఎన్నికల ప్రచార సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే మిర్యాలగూడ సభ ఆలస్యంగా ప్రారం భం కావడం, చీకటి పడటంతో కేసీఆర్‌ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరారు. ప్రయాణం ఆలస్యం కావడంతో ఎల్బీ స్టేడియం సభకు హాజరుకాలేకపోయారు.  

గజ్వేల్‌తో ముగింపు...
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార ప్రక్రియ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.  ఏప్రిల్‌ 4 వరకు కేసీఆర్‌ ప్రచార షెడ్యూ ల్‌ ఖరారైంది. గజ్వేల్‌లో బహిరంగ సభ తో కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగించే అవకాశం ఉంది. ప్రచారం ముగింపు విషయంలో 2014 నుంచి ఇది సెంటిమెంట్‌ గా కొనసాగుతోంది. ఆ ఆనవాయితీ ప్రతిసారీ టీఆర్‌ఎస్‌కు విజయాలను తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సైతం సొంత నియోజకవర్గంలోనే ముగించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 2014 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కలిపి జరిగాయి. సీఎం కేసీఆర్‌ అప్పుడు గజ్వే ల్‌ అసెంబ్లీ స్థానానికి, మెదక్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. అప్పుడు గజ్వేల్‌లో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం ముగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సైతం అక్కడే పూర్తి చేశారు. రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఘన విజయం నమోదు చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ కేసీఆర్‌ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top