
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకి సన్నిహితులుగా పేరొందిన కొందరు పోలీస్ బాస్‌ల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలు దిగువస్థాయి పోలీస్ సిబ్బందిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. సార్ చెబితే.. రైట్ రైట్ అనే తరహాలో అనుమానిత వాహనాలను కూడా సోదాలు చేయకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల సరిహద్దులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పెద్దఎత్తున ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను దాటుకుని టీడీపీ, పలువురు అధికారుల వాహనాలు దర్జాగా వెళ్లిపోతున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీకి చెందిన రూ.5 కోట్లను కారులో తరలిస్తుండగా మహిళా తహసీల్దార్ తనిఖీచేసే ప్రయత్నం చేశారు. ఆయన వెంటనే టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీస్ బాస్‌కు ఫోన్‌చేశారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు ఆగమేఘాలపై స్పందించి కారు సోదాను అడ్డుకుని అవి ఎన్నికల సామాగ్రి అంటూ పంపేసారనే ఫిర్యాదులు వచ్చాయి.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నంను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడానికి ఈ ఘటన ఓ ప్రధాన కారణమని చెబుతున్నారు. అలాగే, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులవర్తి నానికి రూ.రెండు కోట్లు తీసుకువెళ్లే వాహనాన్ని ఎవరూ తనిఖీ చేయకుండా పైలెట్‌గా వెళ్లాలంటూ ఎస్సైను ఒక సీఐ ఆదేశించారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత పనులను తాను చేయలేనని ఎస్సై చెప్పడంతో సీఐ స్వయంగా రంగంలోకి దిగి డబ్బు చేరవేసినట్టు ఆరోపణలొచ్చాయి. సీఐ ఫిర్యాదు మేరకు సదరు ఎస్సైని ఎస్పీ వీఆర్‌కు పంపించారు. ఎస్సై రిలీవ్ అవుతూ జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేయడంతో విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఆ ఎస్సైకు తిరిగి పోస్టింగ్ ఇచ్చేలా చేసిన ఎన్నికల అధికారులు చిత్తూరు ఎస్పీపై సీరియస్ అయ్యారని కథనాలు వచ్చాయి. ఇలా పలు జిల్లాల్లో టీడీపీ సేవలో తరిస్తున్న వారంతా ఒకవైపు చెక్‌పోస్టులను పాలకపక్షానికి అనుకూలంగాను, ప్రతిపక్షంపై ఆంక్షలకు ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పోకడలపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ టీడీపీ సేవలో తరిస్తున్న పోలీసులను పైఅధికారులు కాపాడే ప్రయత్నాలు చేయడం గమనార్హం.