ఇంటికే ఆరోగ్య సేవకులు!

Report on Tribal Health in India - Sakshi

అలాగైతేనే తల్లీ, బిడ్డల మరణాల రేటు తగ్గించగలం

గిరిజనుల ఆరోగ్యంపై కేంద్రానికి నిపుణుల కమిటీ సూచన

గర్భం దాల్చిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న గిరిజన మహిళలు 15 శాతమే. 81.8 శాతం గర్భిణులు ఒక్కసారే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 27 శాతం మంది ఇప్పటికీ ఇళ్లల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ప్రసవానంతర ఆరోగ్య సేవలు అందుకుంటున్న ఎస్టీ మహిళలు 37 శాతమే.. ఇవీ గిరిజనుల ఆరోగ్యంపై నిపుణులు కమిటీ వెలువరించిన నివేదికలోని బాధాకరమైన విషయాలు. గ్రామీణ వైద్య నిపుణుడు డాక్టర్‌ అభయ్‌ బంగ్‌ నేతృత్వంలో 2013లో ఆరోగ్య, గిరిజన శాఖలు ఏర్పాటు ఈ కమిటీ గత ఆగస్టులో నివేదిక సమర్పించింది.

‘ట్రైబల్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికన వెలువడ్డ ఈ నివేదిక ప్రకారం ఆరోగ్య కార్యకర్తలు స్నేహపూర్వకంగా ఉండక పోవడం, భాషను, వారు చెబుతున్న విషయాలను అర్థం చేసుకోలేకపోవడం వంటి అంశాలు ఎస్టీ మహిళలను ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉంచుతున్నాయి. గర్భిణులు ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రసవానికి అనుమతించాలని సూచించింది. తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం వారి ఇళ్లకు వెళ్లి సేవలు అందించే సుశిక్షిత ఆరోగ్య కార్యకర్తల్ని తయారుచేయాలని పేర్కొంది. స్థానిక గిరిజనుల్ని ఆరోగ్య సేవకుల్లో భాగం చేయడం ద్వారా మరణాల రేటు తగ్గించొచ్చనిపేర్కొంది.  

65శాతం మహిళల్లో రక్తహీనత
చిన్న వయసులోనే పెళ్లిళ్లు, తల్లులు కావడం, తక్కువ బరువు, రక్తహీనత తల్లుల మరణాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.
దాదాపు 50 శాతం మంది కిశోర బాలికలు (15–19 వయోశ్రేణి) తక్కువ బరువున్నారు. మూడో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 15–49 వయసున్న మహిళల్లో 65శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 6–59 నెలల వయసున్న పిల్లల్లోఇతరుల (64శాతం) కంటే ఎక్కువగా ఎస్టీ పిల్లలు (77శాతం) రక్తహీనత బారిన పడుతున్నారు.
  కుళాయి నీరు 10.7 శాతం మంది గిరిజనులకే అందుబాటులో ఉంది. ప్రతి నలుగురిలో ముగ్గురు (74.7శాతం) మరుగు దొడ్ల వాడకానికి దూరంగా ఉన్నారు.
ఆహార భద్రత కల్పించడం, స్థానికంగా దొరికే ఆహారంపై, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం, సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని (ఐసీడీఎస్‌) బలోపేతం చేయడం, వ్యాధుల నివారణ, చికిత్సపై దృష్టి పెట్టడం ద్వారా ఎస్టీ స్త్రీలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని సూచించింది.

26 ఏళ్లలో సగం..
నాలుగు విడతల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(1988–2014) ప్రకారం 26 ఏళ్ల కాలంలో గిరిజన శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు) 90 నుంచి 44కి తగ్గిందని, ఇది కచ్చితంగా చెప్పుకోదగ్గ విజయమేననీ కమిటీ అభిప్రాయపడింది.

నివేదిక ప్రకారం ఇదే కాలంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 135 (1988) నుంచి 57 (2014)కు తగ్గింది. అయితే ఇతరులతో పోల్చుకుంటే గిరిజన పిల్లల మరణాల రేటు ఎక్కువే. 1988లో మిగిలిన సామాజిక తరగతులకు, ఎస్టీలకు పిల్లల మరణాలపరంగా ఉన్న అంతరం 21 శాతం. 2014 నాటికి అది 48 శాతానికి పెరిగింది. 44 శాతం మంది ఎస్టీ పిల్లలు   వ్యాధి నిరోధక టీకాలకు దూరమవుతుండటం మరో ఆందోళనకరమైన విషయం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top