నిద్ర చాలా అవసరం గురూ...! | Over 60 Percent Of Indians Feel Sleep Is Not a Priority | Sakshi
Sakshi News home page

నిద్ర చాలా అవసరం గురూ...!

Mar 16 2018 11:31 PM | Updated on Mar 16 2018 11:31 PM

Over 60 Percent Of Indians Feel Sleep Is Not a Priority - Sakshi

నిద్ర...మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యతున్న అంశం. చుట్టూ ఏదో జరిగిపోతోంది. జీవితంలో ఏదో సాధించాలి..అమ్మో.. టైమ్‌ చాలా తక్కువగా ఉందని భావించే వారూ ఎక్కువ మందే ఉన్నారు. దీని కారణంగానే వారు నిద్రాకాలాన్ని తగ్గించుకుంటున్నట్టు వెల్లడైంది. అయితే దీనిని దీర్ఘకాలిక ప్రాతిపదికన విశ్లేషిస్తే ఆరోగ్య, శక్తి సామర్థ్యాలపరంగా నష్టం కలిగించవచ్చునని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 16 (శుక్రవారం)ను  ‘వరల్డ్‌ స్లీప్‌ డే’గా వరల్డ్‌ స్లీప్‌ కమిటీ నిర్వహిస్తోంది. నిద్రను ఒక ఉత్సవంగా, పండుగలా నిర్వహించేందుకు ఈ దినోత్సవం ఉపయోగపడుతుందని, నిద్రతో ముడిపడిన ఆరోగ్యం, మందులు, విద్య, సామాజిక అంశాల వంటివి చర్చనీయాంశం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ కమిటీ పేర్కొంది. నిద్రలో నడిచేవారు 15 శాతం ఉంటారని,  నిద్రలో వచ్చిన 50 శాతం కలలు మెలకువ వచ్చాక మరిచిపోతామని మరో అధ్యయనంలో వెల్లడైంది. 

అరవై శాతానికి పైగా భారతీయులు నిద్రను ప్రాధాన్యతా అంశంగా  పరిగణించడం లేదని, అంతే శాతం మంది  ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కంటే కూడా శారీరక వ్యాయాయమే ముఖ్యమనే అభిప్రాయంతో ఉన్నట్టు  ఓ సర్వేలో తేలింది.  మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా అవసరమే అన్న విషయం చాలా మందికి అవగాహన లేదని  ఫిలిప్స్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా సర్వే తేల్చింది. భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, కొలంబియా, అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్, జపాన్‌లలోని 15 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. 

టెక్నాలజీతో నిద్రాభంగం...
మన దేశం విషయానికొస్తే,... సుఖమయమైన నిద్ర కోసం 45 శాతం వయోజనులు ధ్యానం (మెడిటేషన్‌) చేస్తున్నారు. నిద్ర నుంచి దృష్టి మళ్లేందుకు, నిద్రించే సమయం తగ్గిపోయేందుకు టెక్నాలజీ ప్రధాన ప్రతిబంధ కంగా మారిందని 32 శాతం అభిప్రాయపడ్డారు. రోజూ సవ్యంగా నిద్రపోయేందుకు ‘ప్రత్యేక బెడ్డింగ్‌’ ఏర్పాట్లు చేసుకున్నట్టు 24 శాతం వెల్లడించారు.  పనివేళల కారణంగా సాధారణ నిద్రా సమయం ప్రభావితం అవుతుందని 19 శాతం పేర్కొన్నారు.  అందరూ అనుకుంటున్న దాని కంటే అపసవ్యమైన నిద్ర అనేది మరింత తీవ్రమైన సమస్య అని ఫిలిప్స్‌సంస్థ స్లీప్, రెస్పిరేటరీ హెడ్‌గా ఉన్న హరీష్‌ ఆర్‌ చెబుతున్నారు. దీని ప్రభావం గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటీస్‌ తదితరాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. గురకతో కూడిన నిద్రను సంతృప్తికరమైనదిగా భారతీయులు భావిస్తుంటారని, అయితే ఇది ఎన్నో తీవ్రమైన సమస్యలకు మూలమని గుర్తించాలన్నారు.

ఎదురయ్యే సమస్యలు...
–సరైన నిద్ర లేకపోతే బరువు పెరగడంతో పాటు కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది
–నిద్రలేమి గుండెజబ్బుతో పాటు గుండెపోటుకు అవకాశాలెక్కువ
–నిద్రలో నియంత్రణలు బ్లడ్‌షుగర్‌పై ప్రభావంతో పాటు ఇన్సూలిన్‌ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది
–తక్కువ నిద్ర భావోద్వేగంపై, సామాజిక కలివిడిపై ప్రభావం చూపుతుంది

సానుకూలాంశాలు...
–మంచినిద్ర ఆరోగ్యంతో పాటు ఆకలి పెంచుతుంది
–ఉత్పాదకత పెరిగేందుకు, మరింత ఏకాగ్రతను సాధించేందుకు ఉపయోగపడుతుంది
–మంచి నిద్రతో క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు
–రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది, దీర్ఘకాలిక రోగాలతో ముడిపడిన సమస్యలు తగ్గే అవకాశం
–జ్ఞాపకశక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను పెంచుకునేందుకు సహకరిస్తుంది

-- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement