ఫేస్‌బుక్‌లో కూడా సెన్సార్‌ చేస్తారా?

Is Facebook really blocking criticism of the Indian government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్నిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలనుగాని ‘ఫేస్‌బుక్‌’ లాంటి సోషల్‌ మీడియాలో విమర్శించడానికి వీల్లేదు. అలాంటి విమర్శలు కనిపించిన మరుక్షణం విమర్శించిన వ్యక్తుల ఖాతాలను ఫేస్‌బుక్‌ యాజమాన్యం స్తంభింపజేస్తోంది. ‘కమల్‌ కా ఫూల్‌ హమారి బూల్‌ (కమలానికి ఓటేయడం మేము చేసిన తప్పు)’ అంటూ జర్నలిస్ట్‌ మొహమ్మద్‌ అనాస్‌ సెప్టెంబర్‌ 26వ తేదీన ‘ఫేస్‌బుక్‌’లో పోస్ట్‌ చేయగా, యాజమాన్యం వెంటనే స్పందించి, ఆయన అకౌంట్‌ను సరిగ్గా 30 రోజులు స్తంభింపజేసింది. అదే ఆయన పోస్ట్‌ను షేర్‌ చేసుకున్న వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

జీఎస్టీ కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఓ వ్యాపారస్థుడి బ్యాంక్‌ క్యాష్‌ మెమోపై ‘కమల్‌ ఫూల్‌ హమారి బూల్‌’ అనే వ్యాక్యతో ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పయింది. ఆ మరుసటి రోజున అంటే, సెప్టెంబర్‌ 27న ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ హిందూత్వ’ గ్రూప్‌ పోస్టులను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది. జాతిపిత మహాత్మాగాంధీ, గౌరీలంకేష్, ఎంఎం కల్బూర్గీ, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దాబోల్కర్‌ చిత్రాలతో కూడిన బుల్లెట్‌ రైలు గ్రాఫిక్‌ చిత్రంపై ‘రండి! భారత్‌ బుల్లెట్‌ రైలుపై విహరించండి’ అన్న వ్యాఖ్యతో కూడిన పోస్ట్‌ను హ్యూమన్స్‌ ఆఫ్‌ హిందూత్వ తొలగించడమే కాకుండా దాని ఖాతాను కూడా స్తంభింపజేసింది. మహాత్మాగాంధీని నాథూరామ్‌ గాడ్సే 1948లో హత్య చేయగా, జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను సెప్టెంబర్‌ 5వ తేదీన, మిగతా వారిని 2013–2015 మధ్యన హిందూత్వ శక్తులు హత్య చేసిన విషయం తెల్సిందే. తమ భావ స్వాతంత్య్రాన్ని ఎందుకు అణచివేస్తారంటూ వేలాది మంది ఫేస్‌బుక్‌ ఫాలోవర్లు విమర్శించారు. ఫేస్‌బుక్‌కు దాదాపు 24.10 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
 
ఈ విషయమై ఫేస్‌బుక్‌ యజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, తమ మార్గదర్శకాలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న పోస్టింగ్‌లను కచ్చితంగా తొలగిస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదా బీజేపీ, ఆరెస్సెస్‌ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాసినా హంతు చూస్తామంటూ వచ్చిన వాట్సాప్‌ హెచ్చరికల పోస్టింగ్‌లను కూడా తాము అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేసింది. ‘మేము నిర్దేషించుకున్న కమ్యూనిటీ ప్రమాణాలను దెబ్బతేసే విధంగా ఉన్నా, అవినీతి, అక్రమ చర్యలను ప్రోత్సహించే విధంగా ఉన్నా పోస్టులను తొలగిస్తాం. వ్యక్తిగత గోప్యతకు మేము పూర్తి భరోసా ఇస్తాం. వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ‘కమలానికి ఓటేసి పొరపాటు చేశాం’ అన్న పోస్టింగ్‌లో ఓ వ్యక్తి బ్యాంక్‌ ఖాతాల వివరాలు ఉన్నాయని, అందుకనే ఆ పోస్టింగ్‌ను అడ్డుకోవాల్సి వచ్చిందని వివరించింది. పోస్టింగ్‌లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తుంటాయా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది.

 
ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడం సహజమేనని, 2016 సంవత్సరంలో ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు లేదా విజ్ఞప్తులు 2.753 వచ్చినట్లు ప్రతి ఆరు నెలలకోసారి విడుదల చేసే ‘ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ గవర్నమెంట్‌ రిక్వెస్ట్‌ రిపోర్ట్‌’ తెలియజేస్తోంది. ఈ విషయంలో భారత్‌ రెండవ స్థానంలో ఉండగా 2, 896 విజ్ఞప్తులతో మొదటి స్థానంలో ఉంది. అగ్రదేశమైన అమెరికా అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసిన వారి వివరాలు తెలియజేయాల్సిందిగా మాత్రమే కోరుతుందని, పోస్టింగ్‌లను అడ్డుకోమని కోరదని ఈ నివేదికల ద్వారా తెల్సింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top