సైన్యంలో పని చేయాల్సిందే..

Compulsory Defence Service for those Seeking Govt Jobs - Sakshi

ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పనిసరి..

పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైనా చేరాలంటే సైన్యంలో ఐదేళ్లు పనిచేయాలనే నిబంధన విధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫాస్సు చేసిన నేపథ్యంలో నిర్బంధ సైనిక శిక్షణ, సేవపై దేశంలో చర్చ ఆరంభమైంది. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మొత్తం59, 531 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్రివిధ బలగాల్లో సిపాయి వంటి పునాది స్థాయి ఉద్యోగాల్లో సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారు. ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్య అవసరమైన ఆఫీసర్‌ ఉద్యోగాల్లోనే సైనికోద్యోగుల కొరత ఎక్కువ ఉందని ఇండియా డిఫెన్స్‌ రివ్యూ అనే పత్రికలో రాసిన వ్యాసంలో బ్రిగేడియన్‌ అమత్‌ కపూర్‌ వెల్లడించారు.

అధికారుల ఉద్యోగాలతోపాటు ఆఫీసర్‌ కింది ర్యాంకు ఉద్యోగాలు(పీబీఓఆర్‌) కూడా పూర్తిగా భర్తీకావడం లేదు. ఆధునిక నైపుణ్యం సంపాదించిన ఉన్నత విద్యావంతులకు మార్కెట్లో మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉండడంతో సైనిక దళాల్లో అధికారుల ఉద్యోగాల్లో చేరడానికి వారు ముందుకు రావడం లేదు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులను సైన్యంలోకి ఆకర్షించడానికి దినపత్రికల్లో ‘మీలో ఈ సత్తా ఉందా?’ అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయినా సాంకేతిక విద్య అభ్యసించిన యువతీయువకులు తగినంత మంది సైనికదళాల్లో చేరడం లేదు. ఈ సమస్యను పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం దీని పరిష్కారానికి ఎవరూ ఊహించని రీతిలో పై సిఫార్సు చేసింది.

ఫ్రెంచి విప్లవం నాటి నుంచే నిర్బంధ సైనిక సేవ!
దాదాపు ఈడొచ్చిన యువకులందరికీ నిర్బంధ సైనిక శిక్షణ–సేవ అనే విధానం 1790ల్లో ఫ్రెంచి విప్లవం కాలంలోనే మొదటిసారి అమల్లోకి వచ్చింది. తర్వాత అనేక ఐరోపా దేశాలు ఈ విధానం అనుసరించాయి. అర్హతలున్న యువకులందరూ ఒకటి నుంచి మూడేళ్లు సైన్యంలో శిక్షణ తీసుకుని పనిచేశాక వారిని రిజర్వ్‌ దళానికి పంపించడం ఆనవాయితీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎక్కువగా జరిగిన 19, 20వ శతాబ్దాల్లో  సైన్యంలో పనిచేయడం తప్పనిసరి చేసిన దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడూ కాకున్నా యుద్ధాల సమయంలో నిర్బంధ సైనిక సేవ ఉండేది. 21వ శతాబ్దంలో అత్యధిక దేశాలు నిర్బంధ సైనిక శిక్షణ–సేవ పద్ధతికి స్వస్తి పలికాయి. అమెరికాలో కూడా ఈ విధానం ఎన్నో ఏళ్లు అమల్లో ఉంది.  అమెరికాలో 1973లో నిర్బంధ సైనిక సేవను రద్దుచేశారు. స్వచ్ఛంద సైనిక శిక్షణ అమల్లోకి వచ్చింది.

32 దేశాల్లో అమలు!
ప్రపంచంలోని అనేక దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానం 21 దశాబ్దంలో చాలా వరకు రద్దయింది. ఇంకా 32 దేశాల్లో  18 ఏళ్లు నిండిన యువకులు సైనిక దళాల్లో చేరడానికి పేర్లు నమోదు చేయించుకుని, శిక్షణ పొందే పద్ధతి అమల్లో ఉంది. అయితే, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఈ విధానం అనుసరిస్తున్నారు. కొన్ని దేశాల్లో యువతీయువకులందరూ తప్పని సరిగా సైన్యంలో చేరాలనే నిబంధన ఉంది. మరి కొన్ని దేశాల్లో మహిళలను దీని నుంచి మినహాయించారు. కొన్ని దేశాల్లో యుద్ధ సమయాల్లో మాత్రమే యువకులందరూ సైన్యంలో చేరాలనే నియమం పాటిస్తున్నారు. అమెరికా, కొలంబియా, కువాయిట్, సింగపూర్‌లో నిర్బంధ, స్వచ్ఛంద విధానాలు రెండూ అమల్లో ఉన్నాయి. కాని, ఎక్కడా ముందు సైన్యంలో ఇన్నేళ్లు పనిచేస్తేనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చనే నిబంధన అమల్లో లేదు.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top