లోయలో పడిన బస్సు

44 Dead As Bus Falls In Gorge In Himachal Pradesh - Sakshi

హిమాచల్‌ ప్రమాదంలో 44 మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు బస్సు (హెచ్‌పీ 66–7065) అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని బంజార్‌ తెహ్‌సిల్‌ వద్ద ఉన్న ధోత్‌ మోర్హ్‌ దగ్గర బస్సు 300 అడుగుల లోతున్న లోయలో పడిందని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ఎక్కువ మందిని ఎక్కించడం, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని బంజార్‌ పట్వారీ షీతల్‌ కుమార్‌ అన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టాల్సిందిగా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి గోవింద్‌ కులు జిల్లాకు బయలుదేరారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ. 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం రోడ్లను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చోట్ల రోడ్డు వెడల్పును పెంచాలని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు పీయూష్‌ తివారీ డిమాండ్‌ చేశారు.  

కాలువలో వ్యాను బోల్తా
ముగ్గురు పిల్లల మృతి
లక్నో: పెళ్లి నుంచి తిరిగొస్తుండగా 29 మంది ప్రయాణిస్తున్న వ్యాను కాలువలో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృత దేహాలను గురువారం వెలికితీశారు. లక్నోకు సమీపంలోని నగ్రాం ప్రాంతంలోని ఇందిరా కెనాల్‌లో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాను బోల్తా పడింది. పొరుగున ఉన్న బారాబంకీ జిల్లాలో ఓ పెళ్లినుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌ కౌశల్‌రాజ్‌ శర్మ తెలిపారు. ప్రమాదం తరువాత 22 మందిని రక్షించగలిగారు. 5 నుంచి 10 ఏళ్లలోపు ఏడుగురు పిల్లలు గల్లంతవ్వగా, గాలింపుల అనంతరం మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన నలుగురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top