
మెల్‌బోర్న్: తాను కూడా జాతి వివక్షకు గురైన బాధితురాలినేనంటూ విచారం వ్యక్తం చేసింది టీవీ నటి చాందిని భగ్వనాని. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఆమె తనకు ఎదురైన చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దీని ప్రకారం.. ఆమె మెల్‌బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే అక్కడ బస్సు ప్రయాణం ఆమెకు అదే తొలిసారి. బస్సు ఎన్నో మలుపులు తిరుగుతుండటంతో గాబరా పడ్డ ఆమె డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఇది సరైన స్థానానికే వెళ్తుందా? అని అడిగింది. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు సైతం ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే కురిపించగా వారికి సున్నితంగా, గౌరవంగా జవాబిచ్చాడు. ఇంతకుముందు తాను అడిగింది వినలేదేమోనని ఆమె మరోసారి ప్రయత్నం చేయగా నిశ్శబ్ధమే రాజ్యమేలింది. (నా చర్మం రంగు విలువ ఎంత?)
దీంతో మరింత కంగారుపడిన చాందిని అసలు ఎందుకు స్పందించడం లేదని అడగ్గానే డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోతూ కసురుగా వెళ్లిపొమ్మన్నాడు. "నేను చాలా మర్యాదగా అడిగాను కానీ అతను వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడు. 'చెత్త భారతీయులారా..ఇక్కడి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. అతనిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాలనేది తోచలేదు. వణుకుతూనే బస్సు దిగిపోయాను. జాతి వవక్ష ఇంకా ఉంది అనడానికి నాకు జరిగిన ఈ అనుభవమే నిదర్శనం" అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయడం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్‌డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఆమె చివరిసారిగా "సంజీవని" వెబ్‌సిరీస్‌లో కనిపించింది. (రేసిజానికి అర్థం మార్చేసింది!)
#racism #notcool #ptv #Melbourne smallest act of racism is as serious as another major act of racism pic.twitter.com/aysID8Wg9r
— Chandni Bhagwanani (@chandnib21) July 9, 2020