
కోవిడ్ మరణాలు పెరుగుతుండటంతో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు.
రోమ్: కరోనా వైరస్ ప్రతాపానికి ఇటలీ చిగురుటాకుల వణుకుతోంది. ఐరోపాలో కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా మారిన ఇటలీలో కోవిడ్-19 మహమ్మారి విరుచుకుపడటంతో ఇప్పటివరకు 5,476 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 59,138 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. చైనా తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో సగానికిపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో నమోదైన మొత్తం మరణాల్లో మూడింట రెండొంతులు ఇక్కడే సంభవించాయి. కరోనా కారణంగా ఆదివారం ఒక్కరోజే ఇటలీలో 651 మంది మృత్యువాత పడ్డారు.
కోవిడ్ మరణాలు పెరుగుతుండటంతో అధికారులు మరిన్ని ఆంక్షలు విధించారు. ఇప్పటికీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయట తిరుగుతుండటంతో కఠిన నిబంధనలు పెట్టారు. ఉత్తర ఇటలీలో ఆరుబయట వ్యాయామం చేయడంపై నిషేధం విధించారు. పెంపుడు కుక్కలను వాకింగ్ తీసుకెళ్లడంపైనా ఆంక్షలు పెట్టారు. 650 అడుగుల దూరం వరకే పెంపుడు శునకాలకు బయటకు తీసుకెళ్లాలని సూచించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే శనివారంతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గడంతో ఇటలీ వాసులకు కాస్తంత ఊరట లభించినట్టైంది. శనివారం 793 మంది ప్రాణాలు కోల్పోగా, 6,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా బారిన పడిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 7,024 మంది కోలుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి)
ఆదివారం (మార్చి 22) 5,560 కోవిడ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అంతకు ముందు రోజే అంటే శనివారం(మార్చి 21) 6,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు పెరుగుతుండటం కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. ఆదివారం కొత్త కేసుల నమోదు 15 శాతం, మరణాలు 18 శాతం తగ్గాయని సమాచారం. కరోనా కారణంగా ఆదివారం ఇటలీలో 651 మంది, శనివారం 793 మంది మృతి చెందారు. కాగా, బెర్గామో నగరంలో మృతదేహాలను ఖననం వీలు లేకపోవడంతో శవాలను తిప్పి పంపిస్తున్నారు. కొంతకాలం ఇళ్లలోనే భద్రపరచాలని కోరుతూ ఇందుకు అవసరమైన సామాగ్రిని వారికి అందజేస్తున్నారు. (కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ)