చదువంటే ఏబీసీడీలేనా?

Chukka Ramaiah Write Article On Childrens Education - Sakshi

సందర్భం

మీరు విశ్లేషించాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా కార్పొరేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యకు ప్రమాణం గుడ్డిగా ఏబీసీడీలు పెట్టడమా?

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆయనొక దార్శనికుడు. దేశ భవిష్యత్తుపట్ల దూరదృష్టితో ఆయనీ నినాదం ఇచ్చారు. ఈ దేశ భవిష్యత్తుకు ఇంధనం కచ్చితంగా నేటి బాలలే. అలాంటి అమూల్యమైన సంప దను సామాజిక విలువలు, బాధ్యత కల్గిన పౌరులుగా నైపుణ్యాలతో కూడిన పదునైన ఆయుధాలుగా మలచు కోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా నేటి సమాజానిదే. అందువల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి సరి కొత్త ఆలోచనా విధానాన్ని, స్వతహాగా ఆలోచించే దృక్ప థాన్ని పెంపొందించేలా ప్రభుత్వాలు వ్యూహరచనలు చేయాలి. 

కానీ ఈ రోజు పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. పిల్లల్ని ఓ మూసలో పోసినట్టు తయారు చేయడంతో వారు మార్కుల సునామీలో కొట్టుకుపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు పిల్లల్ని మార్కుల యంత్రా లుగా తయారు చేస్తున్నాయి. క్వశ్చన్‌ బ్యాంకులు, నిత్యం స్టడీ అవర్లతో ఆ చిన్నారులతో మార్కుల జపం చేయి స్తున్నాయి. ఇది దేశ భవిష్యత్తుకు పెను ముప్పు.

విద్యార్థి ప్రతిభకు నేడు మార్కులే గీటురాయిగా మారిపోయాయి. ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక సామర్థ్యంతో ఏ మాత్రం పని లేకుండా కేవలం మార్కు లకే ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యా వ్యవస్థ రోజురోజుకీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని చెప్పక తప్పదు. విద్యార్థి ప్రతిభకు ఆలోచనా విధానం, అతడి విశ్లేషణా త్మక సామర్థ్యమే కొలమానం తప్ప మార్కులు కారాదు. దురదృష్టవశాత్తు మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందువల్ల మన పరీక్షల విధానంలోనే మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉంది.

ఈ రోజు ప్రతి పాఠశాలలో వారం కాగానే పరీక్ష. పరీక్షలు పెట్టడం తప్పేం కాదు. కానీ, ఒక పరీక్ష, రెండో పరీక్షకు మధ్య జరగాల్సిన పునశ్చరణ మాత్రం లోపి స్తోంది. వెనకట ఓ పరీక్ష జరిగాక పిల్లల్లో ఏయే లోపాలు ఉన్నాయి? ఏయే పిల్లలు దేనిలో ముందంజలో ఉన్నారు? మిగతావారు దేంట్లో వెనుకబడిపోతున్నారు? అందుకు కారణాలేమిటో విశ్లేషించేవారు. తదనంతర కాలంలో అధ్యయనంలో లోపాల్ని గుర్తించి వాటిని సవ రించేవాళ్లు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తి విరుద్ధంగా తయారైంది. పరీక్షలు పెడుతూ వాటి ద్వారానే విద్యలో నాణ్యతా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు.

ప్రైవేటు యాజమాన్యాలు తమ ఆధిక్యతను చూపించడం కోసం, తల్లిదండ్రులకు జవాబుదారీతనం కోసం పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. పరీక్షలు పెట్టడమే చదువు అనే భ్రమల్ని కల్పిస్తున్నారు. అంతేగాకుండా ప్రతివారం వాటిని మూల్యాంకనం చేసి మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు నిర్ణయిస్తున్నారు. తద్వారా ఈ వారం ఒక విద్యార్థి ఒక సెక్షన్‌లో ఉంటే వచ్చే వారం అతడికి వచ్చిన గ్రేడ్‌ ఆధారంగా ఇంకో సెక్షన్‌లో పడేస్తు న్నారు. వారాంతపు పరీక్షల ఆధారంగానే ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి పాఠ్య పుస్తకంతో చదువు చెప్పడా నికి బదులుగా క్వశ్చన్‌ బ్యాంకులు కొనుక్కోమని చెప్పడం పరిపాటిగా మారింది. 

పరీక్ష పేపర్లు కూడా తక్కువ సమయంలో వాల్యుయేషన్‌ కావాలని ఆబ్జెక్టివ్‌ టైప్‌లో పరీక్షలు పెడుతున్నారు. దీంతో పిల్లలు ఆలోచిం చనక్కర్లేదు. ఇచ్చిన ప్రశ్నను విశ్లేషించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తమకు తోచిన విధంగా ఏబీసీడీలు పెట్టుకుంటూ పోతే ఎన్నో కొన్ని మార్కులు వస్తాయిలే అనుకొనే అవకాశమూ లేకపోలేదు. చదువంటే ఏబీసీ డీలు పెట్టడమా? పిల్లలు తమ ఆలోచనను స్వతహాగా వ్యక్తపరిచే సంప్రదాయాన్నే పూర్తిగా నిరాకరిస్తున్నారు.

మీరు విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఆలోచించా ల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా వారిని ప్రోత్సహిస్తుంటే ఎలాంటి వాతావరణం నెలకొంటుందో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా విద్యార్థి ప్రతిభకు అద్దంపట్టేది అతడి విశ్లేషణాత్మక నైపుణ్య ధోరణి. కానీ, దాన్ని పక్కనబెట్టి సమయాభావం, ఇంకా ఇతర సమ స్యల కారణంగా పెద్ద పెద్ద పరీక్షలకు సైతం ఆబ్జెక్టివ్‌ టైప్‌ లోనే పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి గందరగోళంగా తయా రయ్యే అవకాశం ఉంది. పిల్లవాడు చదివిన దాన్ని అర్థం చేసుకొని పరీక్షలో జవాబులు రాయడానికి బదులుగా నేరుగా వెళ్లి ఏబీసీడీలు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తోన్న పోకడల్ని చూస్తున్నాం.

ఈ రోజు ఆలోచన పోయింది. రాత పోయింది. చదవడం పోయింది. కేవలం ఏబీసీడీలు రాయడం మాత్రమే పెరిగింది. అంటే పిల్లవాడికి ప్రశ్నపత్రం ఇవ్వగానే దాంట్లో ఏబీసీడీలు పెడదామనే ఆలోచిస్తాడు. అన్నీ ‘బి’లు పెట్టినా ఏ పది మార్కులో రావచ్చను కుంటున్నాడు. అయితే, ఈ ‘బి’ ఆలోచనతో పెట్టినవి కాదు. అందువల్ల ఇలాంటి పద్ధతుల ద్వారా విద్యార్థు లకు వచ్చిన మార్కులు అతడి ప్రతిభకు దక్కిన మార్కులు అని అంచనాకు రావడం సబబు కాదు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించే పద్ధతులను అవలం భించడం ద్వారా, నాణ్యమైన బోధనలతో విద్యార్థుల్లో బలహీనతల్ని రూపుమాపాలి తప్ప, వారి బలహీనత లతో ధనం సంపాదించడం సరైంది కాదు. ఈ డిజిటల్‌ యుగంలో కొత్త నైపుణ్యాలు కల్గిన మానవ సంపదను దేశానికి అందించడమే లక్ష్యంగా అంతా ముందుకెళదాం.

- చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top