ఈ అలవాటుతో ప్రమాదమా?

Health tips by doctor sobha  - Sakshi

ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నాకు టీ, కాఫీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంది. ఈ సమయంలో వాటిని పూర్తిగా మానేయాలని కొందరు, అది పట్టించుకోవలసిన విషయం కాదని మరికొందరు అంటు న్నారు. టీ, కాఫీల ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఈ అలవాటును మానేయాలనుకుంటే... ఏ నెలలో పూర్తిగా మానేస్తే మంచిది? – డి.మానస, అనకాపల్లి
కాఫీ, టీలలో కెఫిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్‌ చాకొలెట్, కూల్‌డ్రింక్స్‌లలో కూడా ఉంటుంది. వీలైనంత వరకు గర్భిణులు వీటిని తీసుకోకపోవడమే మంచిది. మరీ బాగా అలవాటైపోయి మానెయ్యలేకపోతే ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

కెఫిన్‌ రోజుకు 200ఎమ్‌జీ కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణులలో అబార్షన్లు, శిశువు బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తల్లికి కూడా కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. వీటివల్ల ఆహారంలోని ఐరన్‌ ఖనిజం రక్తంలోకి ఎక్కువగా చేరదు. కాబట్టి ఇవి తాగకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలో అయితే రోజుకి రెండుసార్లు చిన్న కప్పుల్లో కొద్దిగా తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి మానేస్తే మంచిదని అడిగారు కదా. గర్భం దాల్చినప్పటి నుంచే మానెయ్యడం మంచిది.

ఎలాంటి లక్షణాల ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని గుర్తు పట్టవచ్చు? నేను మార్నింగ్‌ సిక్‌నెస్‌కు గురవుతున్నాను. ఇది ప్రెగ్నెన్సీ లక్షణం అని ఒక స్నేహితురాలు అంటోంది. ఇది ఎంత వరకు నిజం? – ఆర్‌.కీర్తి, నగరి
గర్భం వచ్చిందని గుర్తు పట్టడానికి ఒక్కొక్కరి శరీరవాటాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్స్‌ మోతాదును బట్టి ఉంటాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా సాధారణంగా ఉంటారు. కళ్లు తిరగడం, వికారం, వాంతులు, నీరసం, రొమ్ములలో నొప్పి, ఛాతీ, గొంతులో మండినట్లు ఉండటం, కొద్దిగా నడుము నొప్పి, పొత్తి కడుపులో బరువుగా ఉండటం, యోని నుంచి నీరులాగా వైట్‌ డిశ్చార్జ్‌ అవ్వడం వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉండొచ్చు.

ఈ సమయంలో బీటా హెచ్‌సీజీ, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల విడుదల వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఇవి విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. కానీ కేవలం పైన చెప్పిన లక్షణాలను బట్టే ప్రెగ్నెన్సీ వచ్చిందని నూటికి నూరు శాతం చెప్పడం జరగదు. కానీ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. పీరియడ్‌ రాకపోతే మూత్రంతో బీటా హెచ్‌సీజీ పరీక్ష ద్వారా, అలాగే కొందరిలో బ్లడ్‌తో బీటీ హెచ్‌సీజీ పరీక్ష ద్వారా ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ చేయడం జరుగుతుంది. కొందరిలో నెల తప్పకుండా కూడా కొద్దిగా బ్లీడింగై గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. దీన్ని మూత్రంతో బీటా హెచ్‌సీజీ పరీక్ష ద్వారా, అంటే ప్రెగ్నెన్సీ కిట్‌ ద్వారా కన్‌ఫర్మ్‌ చేసుకోవచ్చు.

ఎపిలెప్సీ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీకి వెళ్లడం రిస్క్‌ అవుతుందా? ఒకవేళ తప్పనిసరి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయగలరు.
– కె.మాలిని, హన్మకొండ
ఎపిలెప్సీ అంటే ఫిట్స్‌ వ్యాధి ఉండటం. ఈ ఎపిలెప్సీ ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు, వారిలో మామూలు గర్భిణులతో పోలిస్తే కొన్ని సమస్యలు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్‌ కోసం వాడే మందుల వల్ల కొంతమంది శిశువుల్లో అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మందులు వాడకపోతే, తల్లిలో ఫిట్స్‌ రావడం వల్ల, శిశువుకి ఆక్సిజన్‌ సరఫరా తగ్గడం, బిడ్డ సరిగా బరువు  పెరగకపోవడం, బిడ్డ మెదడు, దాని పనితీరులో లోపాలు, అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు వంటి అనేక సమస్చలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎపిలెప్సీ ఉన్నవాళ్లు గర్భం రాకముందే డాక్టర్‌ని సంప్రదించి, అవే ఎపిలెప్సీ మందులను వాడాలా లేక మార్చివాడాలా. మోతాదు మార్చాలా అనే అంశాలను గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలాగే మీరు ఫోలిక్‌యాసిడ్‌ మందులను ముందు నుంచే వాడటం కూడా మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎపిలెప్సీ మందులను క్రమం తప్పకుండా డాక్టర్‌ పర్యవేక్షణలో సరైన మోతాదులో తీసుకోవాలి.

 కెఫిన్‌ రోజుకు 200ఎమ్‌జీ కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణులలో అబార్షన్లు, శిశువు బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top