నిర్ణయం

Funday new story of the week - Sakshi

ఈవారం కథ

‘‘నాన్నగారి అంత్యక్రియలు తమ్ముడిని నిర్వహించమంటాను. నాకు బి.పి. షుగర్‌ ... పన్నెండు రోజులు చన్నీటి స్నానం నాకు పడదు ... ఉదయం లేవగానే నీరసంగా ఉంటుంది. కాఫీ, టిఫిన్‌లు పడనిదే ఏపనీ చేయలేను.’’ చెప్పాడు శివశంకరం, గోపాలరావు పెద్దకొడుకు.‘‘తండ్రి అంత్యక్రియలు, తదనంతర కార్యక్రమాలు చేయడం పెద్దకొడుకు విధి, కర్తవ్యం ... అప్పుడే నాన్నగారి ఆత్మ  శాంతిస్తుంది. అన్నయ్య చేయవలసిన విధిని నన్ను నిర్వర్తించమనడం భావ్యంకాదు ...’’ కొంచెం కోపంగా అన్నాడు రెండో కొడుకు భానుమూర్తి.    బ్రతికి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కొడుకుల వాదోపవాదాలు విని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు గోపాలరావు. ప్రస్తుతం వారి వాదనలకు స్పందించలేని స్థితిలో ఉంది గోపాలరావు భౌతికకాయం.కొడుకుల నిర్వాకం తల్లి చెవిన వేసింది గోపాల్‌రావు కూతురు భ్రమరాంబ.తనయుల మనస్తత్వం తెలిసిన  తల్లి శాంతకుమారి మౌనంగా రోదించింది.పరిస్థితిని గమనిస్తున్న గోపాలరావు తమ్ముడు రాజేశ్వరరావు రంగంలోకి దిగాడు. అతనే అన్నయ్యకు సీరియస్‌ గా వుందనివినగానే పరుగు పరుగున వచ్చి పిల్లలకు ఫోను చేశాడు. అన్నయ్య చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించాక అంత్యక్రియలు నిర్వహించడానికి పంతులుగారిని పురమాయించాడు.‘‘నువ్వు అలా అనకూడదురా శివం. తండ్రికి అంత్యక్రియలు చేయడం పెద్దకొడుకుగా నీ విధి. కర్మ చేస్తున్న పన్నెండు రోజులు కర్త ఆరోగ్యం ఆ పరమేశ్వరుడే కాపాడతాడు. చనిపోయిన నీ తండ్రి ఆత్మ నీకు శక్తినిస్తుంది.వాదోపవాదాల కిది సమయంకాదు. మరేం ఆలోచించకండి. ఇద్దరూ వెళ్ళి స్నానం చేసిరండి ... క్విక్‌’’ అంటూ తన నిర్ణయం ప్రకటించాడు రాజేశ్వరరావు. బంధువులందరూ తనవైపే చూస్తూండటంతో తలవంచక తప్పలేదు శివశంకరానికి.గోపాలరావు అంత్యక్రియల కార్యక్రమం య«థావిధిగా సాగింది.

గోపాలరావు, శాంతకుమారి దంపతులకు ఇద్దరు మగపిల్లల తరువాత ఆడపిల్ల పుట్టింది.గోపాలరావు జిల్లా పరిషత్‌ స్కూల్‌ టీచరుగా చేసి రిటైరయ్యాడు. విజయవాడలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.పెద్దకొడుకు శివశంకరం ఎంటెక్‌ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులో వున్నాడు.  భార్య, ఇద్దరు పిల్లలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.రెండో కొడుకు భానుమూర్తి సి.ఎ. చేసి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా హైదరాబాద్‌ లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అతని భార్య కాలేజీ లెక్చరర్‌. వారికి ఓ అమ్మాయి. డబ్బుకు లోటులేని జీవితం.గోపాలరావు అల్లుడుప్రకాశరావు. రాజమండ్రి మునిసిపల్‌ ఆఫీసులో ఉద్యోగం. కూతురు భ్రమరాంబ స్కూల్‌ టీచర్‌గా చేస్తోంది. వారి సంతానం ఒక అబ్బాయి. గోపాలరావు హైబీపీతో బాధపడుతున్నాడు. ఆ రోజు రాత్రి హఠాత్తుగా విపరీతమైన గుండెనొప్పితో కూలబడ్డాడు గోపాలరావు. విజయవాడ లోనే వుంటున్న మరిదికి ఫోన్‌ చేసింది శాంతకుమారి. రాజేశ్వరరావు వెంటనే బయలుదేరి వచ్చి అన్నగారిని అంబులెన్స్‌లో కార్పొరేట్‌ హాస్పిటల్‌కు తరలించాడు. ఆసుపత్రికి చేరుకునే సరికే గోపాలరావు విగతజీవుడయ్యాడని నిర్ధారించారు డాక్టర్లు.గోపాలరావు కొడుకులకీ, అల్లుడికీ విషాదవార్త తెలియజేశాడు రాజేశ్వరరావు. తెల్లవారుజామునే ముగ్గురూ కుటుంబ సమేతంగా కార్లలో విజయవాడ వచ్చారు.  తండ్రి శవంపై పడి రోదించారు.

శివశంకరం ఆఫీసు పని తప్ప మరే పనిలోనూ కలుగజేసుకోడు. ఎన్ని గంటలైనా విసుగూ, విరామం లేక ఆఫీసు వ్యవహారాలు చక్కబెట్టే శివశంకరానికి ఇంటి పని అంటే పరమ చిరాకు. ఇంటి విషయాలన్నీ అతని భార్యే నిర్వర్తిస్తుంది. బాధ్యతారాహిత్యం అతని నరనరాల్లో జీర్ణించుకుంది. ఎప్పుడో నెలకోసారి తప్ప తల్లిదండ్రులతో మాట్లాడి ఎరుగడు. తన సంతానం విషయంలోనూ ఎప్పుడూ పట్టించుకోలేదు.తండ్రి పోయాడని బాబయ్య చెప్పింది వినగానే ఒక్కసారి గుండెల్లో కలుక్కుమంది శివశంకరానికి. తండ్రి శవాన్ని చూసి రోదించాడు. బాబయ్య ఓదార్చి ప్రక్కకు తీసుకెళ్ళి చేయవలసిన కార్యక్రమాలు వివరించాడు. పది రోజుల నిత్యవిధి తెలియజేశాడు. అన్నీ విన్న శివశంకరం నీరసించిపోయాడు. పన్నెండు రోజులు రోజూ ఉదయమే కృష్ణ ఒడ్డుకు వెళ్లి స్నానాలు చేస్తే ఆరోగ్యం పాడవుతుందని భావించాడు. ఆరోగ్యం పాడయితే ఆఫీసు పని దెబ్బతింటుంది ... అమ్మో ... గుండెపై చేత్తో రాసుకున్నాడు. తమ్ముడిచేత కార్యక్రమాలు చేయించి తను ప్రేక్షకపాత్ర వహిస్తే సరిపోతుందని తలచాడు. తండ్రికి అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలు చేయడం తనవల్ల కాదని భానుమూర్తి భావించాడు. పెద్దల జోక్యంతో తండ్రికి అంత్యక్రియలు, దశదిన కార్యక్రమాలు జరిపే భారం మీదవేసుకోక తప్పదని గ్రహించాడు శివశంకరం

దహన కార్యక్రమం పూర్తిచేసుకుని శ్మశానం నుండి తిరిగి వచ్చారు అన్నదమ్ములు. దీపానికి దండం పెట్టుకున్నారు. భోజనాల తరువాత అంత్యక్రియలకు హాజరైన బంధువులు నిష్క్రమించారు. సాయంత్రం దశదిన కార్యక్రమాలు, ఆ తరువాత రెండు రోజులు చేయవలసిన కార్యక్రమాలు తెలియజేసి మొత్తం కార్యక్రమానికి, దానాలకు లక్ష రూపాయలవుతుందన్నారు పంతులుగారు.‘‘అమ్మో ... అంత ఖర్చే ... దానాలు అంతంత ఇవ్వనవసరం లేదు. మొత్తం ఇరవై వేలలో కానిచ్చేయండి’’ అన్నాడు భానుమూర్తి. లెక్కలు వేయడంలో ఎక్స్‌పర్ట్‌ అతను. శివశంకరం ఇరవై వేలు మరీ తక్కువని ముప్పయి వేలలో పూర్తి చేయమన్నాడు. విషయం శాంతకుమారి చెవిన పడింది.‘‘మీ నాన్నగారి జీవితం ఏ లోటూ లేకుండా సాగింది. ఆయన చనిపోయాక చేయవలసిన కర్మలలో ఏలోటూ రాకూడదు. కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగాలి. దానాలు కూడా స్వీకరించినవారికి సంతృప్తికరంగా ఉండాలి. మీ నాన్నగారి పేర సేవింగ్స్‌ బ్యాంకులో నాలుగైదు లక్షల బ్యాలెన్స్‌ వుంది. ఆ డబ్బు తీయండి. మీ చేతినుండి ఏమీ ఇవ్వనవసరం లేదు.పంతులు గారు చెప్పినట్లు లక్ష రూపాయలు ఖర్చుపెడదాం’’ తనయులను ఆదేశించింది శాంతకుమారి.అన్నదమ్ములు మరి మాట్లాడలేదు.రెండవ రోజునుండి వర్క్‌ ఫ్రవ్‌ు హోవ్‌ు ప్రారంభించాడు శివశంకరం. క్లయింట్స్‌ ఇన్‌కవ్‌ుటాక్స్‌ ఫైల్స్‌ అర్జెంటుగా చూడాలంటూ మూడవ రోజు హైదరాబాద్‌ వెళ్లి తొమ్మిదవ రోజు తిరిగి వచ్చాడు భానుమూర్తి. పది రోజులు స్కూలు మానేయడంతో పిల్లల చదువులు పాడయిపోతాయని సణుక్కున్నారు కోడళ్లు. శాంతకుమారి దుఃఖం వర్ణనాతీతం. ఆ పది రోజులు ఇంట్లో అందరికీ భారంగా గడిచాయి.గోపాలరావు బంధుమిత్రులు పదో రోజు ధర్మోదకాల కార్యక్రమాలలో పాల్గొన్నారు.పన్నెండోరోజు సాయంత్రం శివశంకరం, భానుమూర్తి హైదరాబాద్‌ ప్రయాణమయ్యారు. తల్లికి తోడుగా భ్రమరాంబ మరో రెండు రోజులుండి రాజమండ్రి వెళ్లిపోయింది.

ఒంటరిగా మిగిలిన శాంతకుమారికి భవిష్యత్తు శూన్యమనిపించింది. మాటిమాటికీ భర్త గుర్తుకు వస్తున్నాడు. గదుల్లో తిరుగుతుంటే భర్త వెన్నంటి వున్నట్లు ఫీలవసాగింది. కుర్చీలో కూర్చుంటే ఎదురుగా భర్త ఉన్నట్లు, కబుర్లు చెపుతున్నట్లు  అనిపిస్తోంది. డైనింగ్‌ టేబుల్‌ పై కంచంలో అన్నం వడ్డించుకుంటే ... ఎదురుగా భర్త లేనిలోటు మనసును పిండింది. ముద్ద నోట్లోకి వెళ్ళక కంచం వదిలి లేచిపోయిందిశాంతకుమారి. మంచం మీద బోర్లా పడుకుని విలపిస్తుంటే తలగడ తడిసిపోయింది. సాయంత్రానికి నీరసం ఆవహించింది. ఫోను మ్రోగింది. బలవంతంగా రిసీవర్‌ ఎత్తి ‘‘హల్లో’’ అంటే ‘‘ఏం చేస్తున్నావమ్మా’’ అంటున్న కూతురు.ఏడుపు శబ్దం వినిపించి ఉలిక్కిపడింది భ్రమరాంబ.‘‘బాధపడకమ్మా... తేరుకోవాలి... పోయినవాళ్లతో మనం పోలేం కదా... గుండె చిక్కబట్టుకో... పిల్లల్ని, మనవల్ని గుర్తుతెచ్చుకో... నాతో రమ్మంటే రానన్నావు... నేనొచ్చి అక్కడ వుందామంటే నేను లేందే ఆయనకు, పిల్లలకు ఇక్కడ క్షణం గడవదు... అన్నం తిన్నావా...’’ ఆప్యాయంగా మాట్లాడింది కూతురు.‘‘ఊ’’ అని శాంతకుమారి ఎక్కువ మాట్లాడలేకపోయింది. ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసింది ...

మరో పది రోజుల తరువాత ఓ ఆదివారం భ్రమరాంబ భర్తతో కలిసి తల్లిని చూడడానికి వచ్చింది.చిక్కిశల్యమైన శాంతకుమారిని చూసి కంటతడి పెట్టింది. అత్తగారిని తమ ఇంటికి వచ్చేయమన్నాడు అల్లుడు.శాంతకుమారి ఆ ఇల్లు వదలిరాలేనంది. ‘‘నెమ్మదిగా కోలుకుంటున్నాను. ఆయన జ్ఞాపకాలు వెన్నంటుతున్నాయి. ఆయన స్మృతుల మధ్య బ్రతుకుతున్నాను. ఈ ఇంటికి తాళం వేయలేను.’’ అల్లుడి అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చింది అత్తగారు.ప్రకాశరావు భార్యతో ఏంచేయాలా అని ఆలోచించాడు. ఆరు గదుల ఇంట్లో అత్తగారు ఒక్కరే ఉండటం కష్టమే ననుకున్నాడు. ఎవరైనా తోడుంటే బాగుండుననియోచించాడు. త్రీ బెడ్‌ రూవ్‌ు, హాలు, కిచెన్‌ ఉన్న  ఇంటిని పరిశీలించాడు.‘‘దక్షిణం వైపు ఉన్న రెండు బెడ్‌రూమ్‌లని కలిపి చిన్న ఫ్యామిలీకి అద్దెకివ్వవచ్చు. పెరటివైపు గుమ్మం పెడితే సరిపోతుందని’’ అత్తగారిని ఒప్పించాడు.ఆరోజే మేస్త్రీని పిలిచి ఆ ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. తల్లికి ధైర్యం చెప్పి సోమవారం ఉదయం భ్రమరాంబ భర్తతో కలిసి రాజమండ్రి వెళ్ళిపోయింది.

వారం రోజుల్లో గుమ్మం పెట్టే కార్యక్రమం పూర్తయింది. బెడ్‌రూవ్‌ు కి, హాలుకి మధ్య ఉన్న తలుపు క్లోజ్‌ చేస్తే పెరటి వైపు రెండు గదుల పోర్షన్‌ సెపరేట్‌ అయింది.టు–లెట్‌ బోర్డు పెట్టిన మరునాడు ఒక జంట చూడటానికి వచ్చారు.వారిద్దరికీ నెల రోజుల క్రితమే వివాహం జరిగిందని చెప్పారు. అతని పేరు చంద్రకాంత్‌ ... భార్య మంజుల... చంద్రకాంత్‌ ఎవ్‌ుఎస్‌సీ చదివాడు. ప్రయివేటు స్కూల్లో టీచరుగా చేస్తున్నాడు.ఈ  వివరాలు చెప్పి ‘‘అద్దె ఎంత’’ అని అడిగారిద్దరూ.ఇద్దరి మాటతీరు శాంతకుమారిని ఆకట్టుకుంది. చంద్రకాంత్‌ పెద్దగా మాట్లాడకపోయినా మంజుల గలగలా మాట్లాడుతోంది.‘‘నేను ఇంటిపై సంపాదించాలని అద్దెకివ్వడం లేదు. నాకు కాస్త మాట సహాయం చేస్తారని అద్దె కిస్తున్నాను. మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి’’ చెప్పింది శాంతకుమారి. వారు చెప్పిన మొత్తానికి శాంతకుమారి అంగీకరించింది.రెండురోజుల్లో మంచిరోజు చూసుకుని ఆ పోర్షన్‌ లోకి ప్రవేశించారు చంద్రకాంత్‌ దంపతులు.‘‘ఏం చేస్తున్నారు అత్తయ్యగారూ’’ అంటూ భర్త స్కూలుకు వెళ్లగానే శాంతకుమారిని పలకరించింది మంజుల.శాంతకుమారి వెనకే ఇంట్లో తిరుగుతూ ఆమె కుటుంబ విషయాలు ఆరాతీసింది.చాలాకాలం నుండి పరిచయమున్న వ్యక్తిలా కలివిడిగా తిరుగుతున్న మంజులను చూసి అబ్బురపడిందిశాంతకుమారి. తన భర్త మంచితనం, ఉపకార స్వభావం, ఎవరికీ కలలోనైనా హాని తలపెట్టని తత్వం వివరించింది శాంతకుమారి.తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడనీ, తాను డిగ్రీ చదివానని, భర్త పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అని వివరించింది మంజుల.సాయంకాలం భర్త స్కూలునుండి వచ్చేవరకు శాంతకుమారితో కబుర్లు చెపుతూ గడిపింది మంజుల.

మరోవారం తరువాత ఆదివారం మధ్యాహ్నం భోజన సమయానికి అప్పడాలు వేయించి మంజులకు ఇచ్చింది శాంతకుమారి ‘‘ఇంగువ అప్పడాలు మావారికి చాలా ఇష్టం ... మీరూ రుచిచూడండి’’ అంటూ.ఆ మరునాడు ...‘‘మావారి జీతం మా కుటుంబ నిర్వహణకి అంతంతమాత్రంగా సరిపోతుంది. నేను ఖాళీగా కూర్చోకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలనుకుంటున్నాను. నా చదువుకి పెద్ద ఉద్యోగాలేం రావు. నిన్న మీరిచ్చిన అప్పడాల రుచి చూశాక నాకో ఐడియా వచ్చింది. అప్పడాలు చాలా రుచిగా వున్నాయి. మీరు సహాయం చేస్తే అప్పడాలు తయారుచేసి షాపులకు సరఫరా చేద్దామనుకుంటున్నాను. మీదగ్గర పిండి కలపడం నేర్చుకుంటాను. అలాగే వడియాలు పెట్టడం నేర్పండి ...’’  అడిగింది మంజుల మాటల సందర్భంలో.‘‘దానికేం భాగ్యం ... నా చేతిలో విద్య. నీతో నేనూ చేతులు కలుపుతా ... అప్పడాలు పిండి కలపడమే కాదు ... వత్తిపెడతాను కూడా ... నాకూ కాస్త కాలక్షేపమవుతుంది’’ అంగీకరించింది శాంతకుమారి.నాలుగు రోజుల తరువాత ...ఓ మంచిరోజున విఘ్నేశ్వరుని పూజించి, శాంతకుమారి కాళ్ళకు దండంపెట్టి, మొదటి అప్పడం వత్తింది మంజుల.తనూ అప్పడాల కర్ర తీసి పని ప్రారంభించింది శాంతకుమారి.వత్తిన అప్పడాలను ఎప్పటికప్పుడు డాబాపై ఎండబెట్టింది మంజుల.వారం రోజుల తరువాత అప్పడాల ప్యాకెట్లు తయారుచేసి ‘‘అమ్మకం అయ్యాకే డబ్బు ఇస్తామన్న’’ ఒప్పందంపై అప్పడాల ప్యాకెట్లు షాపుల్లో పంచింది మంజుల.తరువాత గుమ్మడికాయ వడియాలు తయారుచేసి షాపులకు పంచింది.కొన్నవాళ్లు మళ్లీ అవే అప్పడాలు కావాలని షాపుల్లో ఎంక్వయిరీలు చేస్తుండడంతో నెల రోజులలోనే మంజుల బ్రాండ్‌ అప్పడాలకు గిరాకీ పెరిగింది. షాపు ఓనర్లే ఫోను చేసి మరికొన్ని ప్యాకెట్లు పంపమని ఆర్డర్లు పంపసాగారు. మంజుల, శాంతకుమారిలకు తీరిక లేకుండాపోయింది. ఆలోచించే తీరిక లేని శాంతకుమారి మానసిక వేదన క్రమంగా ఆవిరవసాగింది.చంద్రకాంత్, మంజులలు ఇంట్లో వ్యక్తుల్లా కలిసిపోవడంతో శాంతకుమారికి మానసిక ధైర్యం లభించింది.

ఆరు నెలలు గడిచాయి. ఏభైవేల రూపాయలు తెచ్చి శాంతకుమారి చేతిలో పెట్టింది మంజుల, ‘‘అత్తయ్యగారూ ... మీ రుణం తీర్చలేనిది’’ అంటూ.‘‘నా మానసిక వేదనకి ఉపశమనం కలిగించావు. నువ్వు చేసిన ఉపకారం నిర్వచించలేనిది’’ అని మంజుల ను ఆశీర్వదించి డబ్బు తిరిగి యిచ్చింది శాంతకుమారి.మంజుల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుండడంతో శాంతకుమారి మంజులను అభినందించింది.శాంతకుమారిని చదవమంటూ భారత, భాగవత, రామాయణ గ్రంథాలు తెచ్చియిచ్చాడు చంద్రకాంత్‌. శాంతకుమారికి గ్రంథపఠనంతో కాలం  పరుగెడుతున్నట్లే తెలియడంలేదు. గ్రంథపఠనం ఆమెకు వింత అనుభూతినిచ్చింది. మానసిక ప్రశాంతత కూర్చిందిగోపాలరావు మరణించి సంవత్సరం గిర్రున తిరిగింది.సంవత్సరీకాలకు శివశంకరం, భానుమూర్తి, భ్రమరాంబ కుటుంబ సమేతంగా వచ్చారు.బంధువులందరూ వచ్చి వెళ్లారు.శాంతకుమారి ఆదేశంతో గోపాలరావు సంవత్సరీకాల కార్యక్రమం శాస్తోక్త్రంగా జరిపించబడింది.శాంతకుమారి అన్ని విషయాలలో మంజుల సహాయం తీసుకోవడం శివశంకరం భార్య వినీతకు నచ్చలేదు.‘‘ఆ మంజుల మీ అమ్మగారిని బాగా బుట్టలో వేసుకొంది.  మీ అమ్మగారు కూడా ఆ మంజులనే ప్రతి విషయంలోనూ సంప్రదిస్తున్నారు. అత్తయ్యగారు అత్తయ్యగారు అంటూ మంజులరాసుకు పూసుకు తిరుగుతోంది. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్లిపోయాక పెద్దావిడతో మరింత సఖ్యత పెంచుకుని అత్తయ్యగారి దగ్గరున్న డబ్బూ, నగలూ ఆమె హస్తగతం చేసుకున్నా అడిగే దిక్కుండదు. మీ అమ్మగారిని ఆస్తి పంపకం చేయమని మన వాటా మనం పట్టుకుపోవడం శ్రేయస్కరం’’ చెప్పింది వినీత.భార్య మాటలను సీరియస్‌ గా తీసుకున్నాడు శివశంకరం. తమ్ముడితో సంప్రదించాడు. అన్నయ్య చెప్పిన విషయం వినగానే తమ్ముడి మనసులో మంజులపై  అనుమాన బీజం మొలకెత్తింది.అన్నదమ్ములిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

కొడుకులిద్దరూ ఆస్తి పంచమనగానే శాంతకుమారి ఆశ్చర్యపోయింది. ‘‘ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది’’ అడిగింది నీరసంగా.‘‘ఈ ఇల్లు అమ్మేసి చెరిసగం తీసుకుని హైదరాబాదులో మరింత విలువైన ఆస్తిని కొనుక్కుంటాం. నాన్నగారి పేర ఉన్న డిపాజిట్లు, నీ దగ్గరున్న బంగారం కేష్‌ చేసుకుని షేర్లలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే మరిని లాభాలొస్తాయి. అయినా ఆర్థిక విషయాలు నీకంత అర్థంకావు. తమ్ముడు సీఏ కదా, వాడికి పెట్టుబడుల విషయం బాగా తెలుసు ... ఇక నీ విషయం ...  నువ్వు మాతో హైదరాబాదు వచ్చేద్దువు గాని ... సంవత్సరంలో ఆరు నెలలు మా యింట్లో, మరో ఆరునెలలు తమ్ముడి ఇంట్లో ఉండవచ్చు ... మాతో వుంటే నీకు ఖర్చు ఏమీ ఉండదు కనుక నీ పెన్షన్‌ బ్యాంకులో దాచుకోవచ్చు. ఆస్తి పంచకపోతే ఇవన్నీ కుదరవు ... ఇప్పుడు వెంటనే మాతో వచ్చేయి. ఇల్లు అమ్మకం పెడదాం. రేపే బ్యాంకులోడబ్బు డ్రా చేసేద్దాం ...’’ విపులంగా వివరించాడు శివశంకరం.తనయుల మనసులో భావాన్ని తల్లి గ్రహించగలిగింది.ఇల్లు అమ్మి ఆస్తి పంచేసి కొడుకుల పంచన చేరితే తన విలువ దిగజారుతుందని ఆమెకు తెలుసు.కాస్సేపు ఆలోచించింది శాంతకుమారి. భర్తను మనసులో తలచుకుంది.బ్రతికుండగా భర్త ఇచ్చిన విలువైన సలహాలు గుర్తుచేసుకుంది. ‘‘ధనమూలమిదం జగత్‌’’ అన్న విషయం శాంతకుమారికి తెలుసు.తనిప్పుడు కొడుకుల అభ్యర్థనకు తలొగ్గితే భావిజీవితం బాధాకరంగా ఉండక తప్పదని భావించింది.మనసు ధృఢపరచుకుంది.తాము ఏంచెప్పినా కాదనలేని బలహీనురాలు తమ తల్లి అని భావిస్తున్న కొడుకులవైపు సాలోచనగా చూసి సులోచనాలు సవరించుకుంది. తల పైకెత్తింది. ఆమె గొంతు గంభీరంగా మారింది.‘‘మీ మాట కాదంటున్నందుకు అన్యధా భావించకండి. బ్యాంకు డిపాజిట్లను పుణ్యకార్యాలకు, దానధర్మాలకు వినియోగిద్దామనుకుంటున్నాను. నేను బ్రతికున్నంతకాలం ఈ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలపరచుకున్న ఈ గూడుని వదలి నేనుండలేను. నేను బ్రతికుండగా ఈ యిల్లు అమ్మే ప్రసక్తి లేదు. నా తదనంతరం ఈ యిల్లు, మిగిలిన బ్యాంకు బ్యాలన్స్‌ మీ ఇద్దరే కాదు భ్రమరాంబతో కలిపి ముగ్గురూ పంచుకోండి. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు హైదరాబాదు వచ్చి మీ ఇళ్లలో ఉండగలిగినన్ని రోజులుంటాను. మీకు సెలవులు కుదిరినప్పుడు మనవళ్లతో వచ్చి నన్ను సంతోషపెట్టండి. ఇదే నా తుది నిర్ణయం ...’’ ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది శాంతకుమారి.
- ఇంద్రగంటి నరసింహమూర్తి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top