రెండో వైపు...

That day the new officer is on duty - Sakshi

 ఈవారం కథ

అన్నీ కష్టాలూ అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టూ అతికష్టం మీద ఎక్కి పైకి వచ్చిన వాడు ఎదుటివాడి కష్టాన్ని ఎందుకలా పూచిక పుల్లలా తీసేస్తున్నట్లు?

ఆ రోజు కొత్త ఆఫీసరు డ్యూటీలో చేరుతున్నాడు. రెండు రోజుల క్రితం ఈ విషయం తెలిసినప్పట్నుంచీ, వచ్చే ఆయన ఎలా ఉంటాడన్న విషయం మీద ఆ కార్యాలయం సిబ్బందిలో ఎక్కడలేని ఉత్కంఠత. ముందు స్ట్రిక్ట్‌గా ఉండి తరువాత లాకులు లేపుతాడా? చివరదాకా ఒకలానే ఉంటాడా? నకిలీ మంచితనంతో ముందు మంచివాడనిపించుకుని తరువాత తనలోని అసలు శాడిజమ్‌ వేడి రుచి చూపుతాడా?పురుష వర్గం ఆలోచనలు ఇలా ఉంటే స్త్రీవర్గం ఆలోచనలు మరోలా ఉన్నాయి... పండుగలకీ పబ్బాలకీ సెలవలిస్తాడా? సాధారణ సెలవులు అయిపోతే ఫ్రెంచి లీవులు అనుమతిస్తాడా? ఇంటికి ఒక గంట ముందుగా వెళ్లటానికో ఆఫీసుకి ఒక అరగంట ఆలస్యంగా రావటానికో ఒప్పుకుంటాడా?అన్నీ ప్రశ్నలే–జవాబులు తెలియటానికి కొద్ది రోజులు పడుతుంది.∙∙ కొత్త ఆఫీసరు ఎలా ఉంటాడన్న విషయం మీద  అందరూ ఎంత మల్లగుల్లాలు పడుతున్నా రామం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు తన పని తను చేసుకుపోతున్నాడు. డిపార్టుమెంటులో ఆయనకి ముప్ఫయ్‌ ఐదు సంవత్సరాల సర్వీసు.

సీనియారిటీ మీద సెక్షన్‌ సూపర్‌ వైజర్‌  అయ్యాడు. వచ్చే సంవత్సరం రిటైరు కాబోతున్నాడు. తన సర్వీస్‌లో ఆయన చాలామంది ఆఫీసర్లదగ్గర పని చేశాడు. అనుభవం ఆయనకి నేర్పిన పాఠం ఒకటే. మన పని మనం సరిగా చేసుకుంటూ పోవటం ముఖ్యం.  దానివల్ల  ఆఫీసరుకు ప్రమోదం కలిగినా కలగకపోయినా ప్రమాదం మాత్రం ఉండదు. అలా కాక ఆయన వినోదం కోసం మనం పని చేస్తే  చివరకి విషాదం మిగలటం ఖాయం. ఇదే సూత్రం పునాదిగా ఆయన ఇన్నాళ్లూ ఏ రిమార్కూ లేకుండా, రాకుండా పని చేయగలిగాడు. ఇంకొక్క సంవత్సరం ఇదే పద్ధతిలో పనిచేయగలిగితే ప్రశాంతంగా పదవీవిరమణ చెయ్యొచ్చు. ఆయన కోరికా అదే. నమ్మకం అదే. ∙∙ ఆఫీసరుగారి  కారు వచ్చినట్టుంది. ఉన్నట్టుండి బయట అలజడి మొదలైంది. అందరితో పాటు రామం కూడా బయటికి వచ్చాడు. వచ్చిన ఆఫీసరుని చూసి నిర్ఘాంతపోయాడు. ఆయన ఎవరో కాదు... మెట్రిక్యులేషన్‌ వరకూ తన క్లాస్‌ మేట్‌ ఐన నాగేంద్ర.   కొత్తగా వస్తున్న ఆఫీసరు పేరు నాగేంద్ర అనగానే ఆ పేరుతో చాలా మంది ఉంటారు కనక వస్తున్నది తన క్లాస్‌మేట్‌ అన్న ఆలోచన రామానికి కలగలేదు. 

ఆఫీసరు గారు కారు దిగగానే అందరూ ముక్తకంఠంతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పారు. అకౌంటెంట్‌ అనసూయ గారు బొకే అందించారు. సెక్షన్‌ సూపర్‌ వైజర్‌ కనక  రామంగారితో ఆఫీసరుగారికి పూల దండ వేయించారు. పూలదండ వేస్తున్న రామం  ముఖంవంక ఆఫీసరు పరీక్షగా చూశాడు. అందరూ చప్పట్లు కొట్టి ఆఫీసరు గారు లోపలకి వెళ్లటానికి దారి ఇచ్చారు.మరొక రకంగా తెలిసిన వ్యక్తి ఆఫీసరుగా వస్తే ఆయన దగ్గర పని చేయటం సులభమా? తెలియని వ్యక్తి ఆఫీసరుగా వస్తే ఆయన గురించి తెలుసుకుని పని చేయటం సులభమా? కాక రెండూ కష్టమా? లేదా రెండూ సులభమా? ఏదో ఒకటే సులభమా? అలాగైతే ఏది సులభం? ఏది కష్టం?మనసులో జ్ఞాపకాల తేనెతుట్టె అప్రయత్నంగానే కదలగా లోపలికి వచ్చి తన కుర్చీలో కూలబడ్డ రామం ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి మళ్లాయి.   ∙∙ రామం తండ్రి ప్రాథమిక పాఠశాల టీచరు. తను పని చేసే వూళ్లో సెకండరీ స్కూలు లేదు. కుటుంబాన్ని ప్రక్క వూళ్లో పెట్టి తను పని చేసే వూరికి తిరిగేవాడు. వృత్తిలోనే కాదు ప్రవృత్తిలోనూ ఉత్తముడని ఆయనకి పేరు. 

రామానికి తండ్రి తెలివి తేటలే కాదు– ఆయన గుణగణాలు కూడా వారసత్వంగా వచ్చాయి. రామం క్లాస్‌ లోనే నాగేంద్ర అనే అబ్బాయి కూడా ఉండేవాడు. నాగేంద్ర చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. ఒక్కడే కొడుకు. ఇంకో వూరునుంచి రోజూ నడిచి స్కూల్‌కి వచ్చి వెళ్లేవాడు. తల్లిదండ్రులు అతి కష్టం మీద అతడిని స్కూల్‌కి పంపించగలిగేవాళ్లు. క్లాస్‌లో ప్రతి సబ్జెక్టులోనూ రామానికీ నాగేంద్రకీ మార్కులు తెచ్చుకోవటంలో పోటీ ఉండేది. రామం తండ్రికి కూడా ఇది తెలుసు. ఆ స్పర్థ మానసికస్పర్థకి దారి తీయకూడదని అపుడపుడు కొడుక్కి సలహా చెప్పేవాడు. నాగేంద్ర తనని పట్టించుకోకపోయినా ఎందుకో అతడంటే రామానికి అభిమానం. తనతో సమానంగా చదివేవాళ్లంటే సామాన్యంగా ఏ విద్యార్థికైనా కొంత అసూయో, ద్వేషమో  ఉంటుంది. కానీ నాగేంద్ర గురించి రామానికి అలాంటి ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. ఎవరి తెలివితేటలు వాళ్లవి అనుకొనేవాడు. కృషిని బట్టి ఫలితం అని నమ్మేవాడు. ఎందులోనైనా  రామానికి మార్కులెక్కువ వస్తే మాత్రం నాగేంద్ర గింజుకొనేవాడు.

 నాగేంద్ర స్కూల్‌కి  రాని రోజున, అతడు చదువుకోటానికి వీలుగా రామం తర్వాత రోజున తన నోట్స్‌ ఇచ్చేవాడు. ఒకటి రెండు సార్లు స్కూల్‌ ఫీజు కట్టటానికి నాగేంద్ర దగ్గర డబ్బులు లేక పోతే తన పాకెట్‌ మనీలో మిగుల్చుకున్న డబ్బుతో ఆ అవసరం కూడా తీర్చాడు. సంవత్సరం మొదట్లో తండ్రికి చెప్పి ఆయన స్టూడెంట్స్‌ దగ్గర ఉన్న తరగతి పుస్తకాలు పాతవి నాగేంద్రకి ఇప్పించేవాడు. ఇంకో నెలరోజుల్లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలు జరుగుతాయనగా నాగేంద్ర తండ్రి అనుకోకుండా మరణించాడు. ఆ తర్వాత ఒక రోజు సాయంత్రం రామం నాగేంద్రని తన ఇంటికి తీసుకొచ్చాడు. నాగేంద్ర ఇంట్లో పరిస్థితి అతని చదువుకి అనుకూలంగా లేదనీ, ఒక నెలరోజులూ మన ఇంట్లోనే ఉండి పరీక్షలైన తరువాత వెళ్లిపోతాడనీ తండ్రికి చెప్పి ఒప్పించాడు. ఆ నెల రోజులూ నాగేంద్ర అవసరాలన్నీ రామమే చూశాడు. నాగేంద్ర పరిస్థితి తెలిసిన తండ్రికూడా ఏమీ మాట్లాడలేదు. రామం తల్లి  కూడా ఆ నెలరోజులూ ఇద్దర్నీ సమానంగా చూసింది.పరీక్షలైపోయాక నాగేంద్ర తన ఇంటికి వెళ్లిపోయాడు.రిజల్ట్స్‌ వచ్చాయి. ఈసారి పోటీలో నాగేంద్రకే నాలుగు మార్కులు ఎక్కువ వచ్చాయి.

నాగేంద్ర అవసరానికి తను సాయపడటంలో కలిగిన సంతృప్తి ముందు ఆ తేడా రామానికి బాధ కలిగించలేదు. ఆ తర్వాత నాగేంద్ర రామానికి కనపడలేదు. ఆరా తీస్తే అతడిని తన మేనమామ తన ఇంటికి తీసుకు వెళ్లాడనీ తన దగ్గరే వుంచి చదివిస్తున్నాడనీ తెలిసింది. అదే విషయం తల్లిదండ్రులతో చెప్పాడు.   ఇన్నాళ్లూ గుర్తు రాని మేనల్లుడు ఇప్పుడెలా గుర్తు వచ్చాడని రామం తల్లి భర్తని అడిగింది. ఆయన నవ్వుతూ నాగేంద్ర మేనమామకి ఒక కూతురు ఉందనీ, మంచి మార్కులతో మెట్రిక్యులేషన్‌ పాస్‌ కావడంతో మేనల్లుడి మీద ఆయన చూపు పడిందనీ చెప్పాడు. ఆ తర్వాత నాగేంద్ర ప్రస్తావన ఇంట్లో ఎపుడూ రాలేదు. స్కూల్‌ నుంచి సైకిలు మీద ఇంటికి వస్తూ అనుకోకుండా రామం తండ్రి  యాక్సిడెంట్లో మరణించాడు. కుటుంబభారం మీద పడటంతో రామం పై చదువులు చదవకుండా డిగ్రీతోనే చదువు ఆపేశాడు.

తండ్రి డ్యూటీలో ఉండగా మరణించాడు కాబట్టి  ప్రభుత్వం రామానికి ఉద్యోగం ఇచ్చింది. టీచరు పోస్టులు ఖాళీ లేక వేరే డిపార్ట్‌ మెంట్‌లో రామం ఇప్పుడు చేస్తున్నదదే! కాలగర్భంలో ఎన్నో సంవత్సరాలు కలిసిపోయాయి. ఇపుడు మళ్లీ నాగేంద్ర కనపడటంతో ఎంతో ముందుకు వెళ్లిపోయిన రామం జీవనరథం ఒకసారి మళ్లీ స్మృతిపథంలోకి వెళ్లి వర్తమానంలోకి వచ్చింది. ∙∙ ఒక హోదా వచ్చిన తర్వాత,  హోదా రావటానికి ముందు ఉన్న పరిచయాలు తమ కొత్త హోదాని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తాయేమోనన్న అపోహలో కొంతమంది ఉంటారు. ఇది అన్నివేళలా అందరి విషయంలో నిజం కాదు. అలాంటి ప్రయత్నాలకి పాత పరిచయమే కాకుండా ఒక్కోసారి ప్రస్తుత పరిచయం కూడా కారణమవుతుంది. ఉపయోగించుకోవటం ఐనా ఉపయోగపడటం ఐనా ఎక్కువగా మనిషి తత్వం, వ్యక్తిత్వం బట్టి నిర్ధారితమవుతుంది... పరిచయాల  పాత్ర కొంతవరకే పరిమితం. కొత్త ఆఫీసరు చేరి వారం అవుతోంది. అప్పటికే ఆయన ప్రవర్తన మీద గుసగుసలు మొదలయ్యాయి. ఆయన దగ్గర ఒకటంటే తక్కువ

రెండంటే ఎక్కువ. భిన్నాలు అంగీకరించడు. వెళ్లిన ఏ ఫైలూ సక్రమంగా వెనక్కి రాదు. కూతుర్ని కాలేజీలో చేర్చి రావటానికి సెలవు పెడితే పెండింగ్‌ పని పూర్తి చేసి వెళ్లమనీ, భార్య వైద్య చికిత్స కోసం అడ్వాన్స్‌ కావాలని దరఖాస్తు పెడితే ఫైల్‌ తర్వాత పెట్టమనీ ఒకటి కాదు రెండు కాదు... అభ్యంతరాలమీద అభ్యంతరాలు.ఇలాగైతే మేం పని చెయ్యలేమని స్టాఫ్‌ వచ్చి రామం దగ్గర మొర పెట్టుకున్నారు.  కొన్నాళ్లు ఓపిక పట్టమనీ అప్పటికీ మార్పు రాకపోతే అందరం కలిసి వెళ్లి మాట్లాడదామనీ రామం స్టాఫ్‌ కి నచ్చ చెప్పాడు.∙∙ మరొక వారం గడిచింది. నెమ్మదిగా ఆఫీసులో యుద్ధవాతావరణం నెలకొంటోంది. ఒక రోజు...అకౌంటెంట్‌ పాస్‌ చేసిన బిల్లుల్ని చెక్‌ చేస్తున్న రామంగారి దగ్గరికి అటెండర్‌ వచ్చాడు. ఆఫీసరు గారు పిలుస్తున్నట్లు చెప్పాడు. చేస్తున్న పని ఆపి, రామం ఆఫీసరు గదిలోకి అడుగు పెట్టాడు. కొత్త ఆఫీసరు జాయినైన తర్వాత రామం ఆ గదిలోకి అడుగు పెట్టడం అదే మొదటిసారి. తాము పని చేస్తున్న ఆఫీసుహాలు వాతావరణంతో పోలిస్తే తను అడుగుపెట్టిన గది స్వర్గధామంలా ఉంది. కూర్చోమనకుండా ఆఫీసరు ముందు కుర్చీలో కూర్చోవటం రామానికి అలవాటు లేదు. అలాగని  ఇంతవరకూ ఏ ఆఫీసరూ రామాన్ని కూర్చోమనకుండా ఉన్నదీ లేదు. ఏదో ఫైల్‌ చూస్తున్న ఆఫీసరు రామం వంక చూడటానికి ప్రయత్నం చేయలేదు.

రెండు నిమిషాలు అలానే నిలబడ్డ రామం–‘‘సార్‌! రమ్మన్నారట,’’ అన్నాడు. తలెత్తిన ఆఫీసరు–‘‘ఒక్క నిమిషం వెయిట్‌ చేయలేరా?’’ అని పరుషంగా అని మళ్లీ తన పనిలో మునిగి పోయాడు. నిమిషం కాస్తా ఐదు నిమిషాలు అయింది. రామానికి తెలుసు ఆయన చూసే ఫైల్లో అంతసేపు చూడాల్సిందేమీ లేదని. మరి దేనికి ఆలస్యం?తనని ఉద్దేశ్యపూర్వకంగా నిలబెడుతున్నాడా అన్న అనుమానం వచ్చింది రామానికి. అతని మంచితనం అలా అయి ఉండదు అని మనసుని సముదాయించింది. అలానే నిలబడ్డాడు. కాసేపటికి తలెత్తిన ఆఫీసరు ‘‘రామం గారూ! అకౌంటెంట్‌ గారికి ఒక బిల్‌ ఇచ్చి పాస్‌ చేయమని చెప్పాను. ఇంతవరకూ అది నా బల్ల మీదకి రాలేదు. అకౌంటెంట్‌ గారిని పిలిచి అడిగాను.రూలు ప్రకారం అది పాస్‌ చేయకూడదని మీరు అన్నారట! నిజమేనా?’’ అని అడిగాడు.‘‘అవును సార్‌! ఆ బిల్‌ పాస్‌ చేయటానికి మన నిబంధనలు ఒప్పుకోవు. అదే విషయం చెప్పాను అకౌంటెంట్‌ గారితో,’’‘‘చేయమని నేను చెప్పిన దానికి కూడా నిబంధనలు అడ్డం వస్తాయా?’’‘‘పాస్‌ చేయకూడదనే కొత్త నిబంధన మీకు తెలియక అలా చెప్పి ఉంటారనీ, మీతో అదే విషయం చెప్పుదామనీ నా ఆలోచన.

ఈ లోపులోనే మీరు పిలిచారు,’’‘‘ఐతే పాస్‌ చేయనంటారు,’’‘‘అలా నేననలేదు,’’‘‘మరి మీరన్నదానికి అర్థం ఏమిటి?’’‘‘నిబంధన ఉదహరించి బిల్లు ఫైలు మీ ఉత్తర్వులకోసం సమర్పిస్తాను. పాస్‌ చేయమని ఫైల్లో మీ ఆజ్ఞ నమోదు చేయండి. వెంటనే పాస్‌ చేయిస్తాను,‘‘‘‘ఐతే నా నోటి మాటకి విలువ లేదన్నమాట,’’ ‘‘క్షమించండి! మీరలా అర్థం చేసుకొంటే నేను మాట్లాడటానికి ఏమీ ఉండదు,’’‘‘నాకు అర్థమైంది. నా మాటకు మీరు విలువ ఇవ్వదలుచుకోలేదని. యు కెన్‌ గో!’’‘‘థాంక్యూ సర్‌!’’రామం ఆఫీసరు గదిలోంచి ఎర్రబడ్డ ముఖంతో బయటికొచ్చాడు. ఆయన వాలకం చూసిన స్టాఫ్‌కి అర్థమైంది. లోపల ఏదో జరగకూడనిది జరిగిందని. రామం గారి దగ్గరికి వచ్చి కూపీ లాగబోయారు.జరిగింది చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డారు రామం గారు.ఇంతలో ఉన్నట్లుండి బయటికి వచ్చాడు ఆఫీసరు. 

‘‘ఏవిటిక్కడ గూడుపుఠాణీ?’’ అని గట్టిగా అరిచాడు. స్టాఫ్‌ నెమ్మదిగా ఎవరి సీట్లలోకి వాళ్లు సర్దుకున్నారు.   ఆ రోజు ఆఫీసులో ఎవరికీ పని చెయ్యబుద్ధి కాలేదు. గుడ్డిలో మెల్లలా ఆఫీసరు సరిగ్గా అయిదింటికి ఇంటికి వెళ్లిపోయాడు. హమ్మయ్య అనుకొని స్టాఫ్‌ కూడా ఆ రోజుకి పని ముగించారు.ఆ తర్వాత కాసేపు ఆఫీసులోనే ఉన్న రామం– ఆఫీసరు ప్రవర్తననీ, తన ప్రవర్తననీ ఆయన కోణంలోంచి అర్థం చేసుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆయన చికాకుకు కారణాలు వెతకటానికి నిజాయితీగా కృషి చేశాడు. కానీ– ఆయన కోపానికి అంగీకారయోగ్యమైన కారణం రామం మనసుకి ఒక్కటి కూడా తోచలేదు. ఎంత నిబద్ధతతో ఆలోచించినా తను చేసినది తప్పని కానీ, ఆఫీసరు చేసినది ఒప్పని కానీ అంగీకరించటానికి ఆయన మనసు సుతరామూ అంగీకరించటం లేదు. ఆఫీసరు కూడా జీవితంలో చిన్న చిన్న అవసరాలకి సైతం తడుముకున్నవాడే! జీవితంలో నిమ్నోన్నతాలు చూసినవాడే! అన్నీ కష్టాలూ అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టూ అతికష్టం మీద ఎక్కి పైకి వచ్చిన వాడు ఎదుటివాడి కష్టాన్ని ఎందుకలా పూచిక పుల్లలా తీసేస్తున్నట్లు?అవగాహనకందక వికలమనస్కుడై రామం కూడా ఇంటి ముఖం పట్టాడు.

 ఇంటి వెనక పూల మొక్కల మీద ఎగురుతూ వాలుతున్న సీతాకోకచిలుకని పట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు రామం మనవడు. ప్రక్కనే మునగచెట్టునిండా గొంగళి పురుగులు. ఉరుకులు పరుగుల్లో అటువైపు వెళ్లి  వాటిమీద పడి వొంటికి అతికించుకుంటాడేమోనని కోడలు భయం. అందుకే సున్నితంగా కొడుకుని వారిస్తోంది ఆమె.  కానీ తూనీగలా పరిగెడుతున్న కొడుకుని  ఆపటం ఆమె తరం కావటం లేదు. ఎంతసేపటికీ సీతాకోకచిలుక చేతికి చిక్కక పోవటంతో కాసేపటికి విసుగు వచ్చి ఇంట్లోకి వచ్చేశాడు రామం మనవడు. అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తాతయ్య దగ్గర చేరాడు. ‘‘తాతయ్యా! తాతయ్యా! సీతాకోకచిలుక అంత అందంగా ఎందుకుంటుంది?’’ అని అడిగాడు.‘‘దానికి అందమైన రెక్కలు ఉండటం వల్ల,’’ ‘‘అలాంటి రెక్కలు మొలిస్తే మనమూ అందంగా ఉంటామా?’’‘‘ఎందుకుండం?’’‘‘తాతయ్యా! సీతాకోకచిలుకకి పుట్టుకతోనే అందమైన రెక్కలు ఉంటాయా? తరువాత వస్తాయా?’’ ‘‘తర్వాతనే వస్తాయి’’‘‘తాతయ్యా! ఇది నిజమా?’’‘‘ఏంటమ్మా అది’’ అని మనవడ్ని భుజాలమీదకెత్తుకుని రామం అడిగాడు.

 ‘‘గొంగళి పురుగే కొద్దిరోజులకి రెక్కలు మొలిచి సీతాకోకచిలుక అవుతుందటగా?’’‘‘అవును! సైన్సు అదే చెపుతుంది’’‘‘కొద్ది రోజుల తర్వాత మళ్లీ రెక్కలు వూడిపోయి గొంగళి పురుగు అవుతుందా?’’‘‘కాదమ్మా! సీతాకోకచిలుకగానే ఉండిపోతుంది,’’‘‘ఇంకో చిన్న ప్రశ్న తాతయ్యా! సీతాకోకచిలుకకి తను ఒకప్పుడు గొంగళి పురుగుననే విషయం గుర్తుంటుందా?’’నిజం సీతాకోకచిలుకని గురించిన నిజం తనకి తెలీదు. మనుషుల్లో సీతాకోకచిలుకల గురించి తనకు తెలిసిన నిజం మనవడికి చెప్తే అర్థం చేసుకోగలిగిన వయసు కాదు. రామం మనవడి వంక అయోమయంగా చూశాడు.‘‘నేనే గెలిచా! అమ్మా! ఇన్నాళ్లకు తాతయ్య జవాబు చెప్పలేని ప్రశ్న నేనొకటి అడిగా!’’ అని అరుస్తూ సంతోషంతో రామం మనవడు తల్లి దగ్గరికి పరిగెత్తాడు.
టి. చంద్రశేఖర రెడ్డి
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top