నోటేశ్వరుడు

YSR Fan Collected YSR Important Date Notes - Sakshi

వైఎస్‌ఆర్‌ అభిమాని

ఒక సామాన్యుడు వార్తల్లోకి వచ్చేదెప్పుడు? అసామాన్యమైన పని చేసినప్పుడు. వినూత్నంగా ఏదైనా చేసిప్పుడు. వైవిధ్యంగా ఆలోచించినప్పుడు. ఆలోచనను ఆచరణలో చూపించినప్పుడు.  చెన్నారెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఇలాంటి అసామాన్య సామాన్యుడే. చిలకలూరి పేట ఆయనది. వైఎస్‌ఆర్‌ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. అందుకే చేతల్లో చూపించారు! ఆయన ఏం చెప్తున్నారో వింటే.. ఆయన ఏం చేశారో, ఏం చేస్తున్నారో తెలుస్తుంది.


వైఎస్‌ఆర్‌ పుట్టినరోజు  (8–7–1949) 

‘‘నేను చదువుకున్నది తొమ్మిదో తరగతి. చిలకలూరి పేటలో చిన్న హోటల్‌ నడిపాను. పిల్లలు పెద్దయ్యారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘ఇన్నాళ్లు కష్టపడినది చాలు ఇక ఆ పని మానుకో’ అని పిల్లలు ఒత్తిడి చేయడంతో హోటల్‌ వ్యాపారం నుంచి బయటకొచ్చాను. నాలుగు ప్రదేశాలు చూసే అవకాశం అప్పుడు వచ్చింది నాకు. మూడేళ్ల కిందట స్నేహితుడితో బెంగుళూరు వెళ్లాను. అక్కడ ఒక ఎగ్జిబిషన్‌లో మన మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఒక స్టాల్‌ ఉంది. అందులో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయి. ఆ తేదీల అంకెలతో కూడిన కరెన్సీ నోట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. అక్కడ మనం కోరిన పది రూపాయల నోటు కావాలంటే మూడు వందలివ్వాలన్నమాట. అలాంటిది చూడడం అదే మొదటి సారి. నాకిష్టమైన వైఎస్‌ఆర్‌ జీవితంలో ఘట్టాల తేదీల కరెన్సీ నోట్లను సేకరించాలనిపించింది.

కానీ ఆ తేదీలేవి నాకు కచ్చితంగా గుర్తు లేవు. అందుకుని మా పెళ్లి రోజు తేదీ, మనుమరాళ్ల పుట్టిన రోజుల తేదీలు వచ్చే కరెన్సీ నోట్లు కొనుక్కుని, ఎగ్జిబిషన నిర్వహకుల ఫోన్‌ నంబరు తీసుకుని మా ఊరికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్యమైన తేదీలను సేకరించ మొదలుపెట్టాను. వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజు, పెళ్లి రోజు, తండ్రయినరోజు (జగన్‌ గారి పుట్టిన రోజు) తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు, పాదయాత్ర తేదీలు, రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేదీలు, షష్టిపూర్తి తేదీ, చివరిగా ఆయన మనల్ని వదిలిపోయిన రోజును కూడా లిస్ట్‌ రాసుకుని ఆ నోట్లను తెప్పించుకున్నాను. పనిలో పనిగా ఆ మహానుబావుణ్ని నేను కలిసిన తేదీ కరెన్సీ నోటు కూడా. నర్సరావు పేటలో 2005, జూన్‌ 25వ తేదీన ఆయన్ని చూడగలిగాను. ప్రతి తేదీకి ఒక్కరూపాయి, ఐదు, పది, ఇరవై రూపాయల నోట్లను సేకరించాను.

వై.ఎస్‌.జగన్‌ పుట్టినరోజు (21–12–1972)

వైఎస్‌ఆర్‌ ఓ అధ్యయనం
రాజశేఖరరెడ్డి గారి గురించి వివరాల కోసం ఒక అధ్యయనమే చేశాను. ఎన్ని వివరాలు సేకరించానో, వాటన్నింటినీ తేదీల ఆధారంగా పుస్తకంలో రాసుకున్నాను. వాళ్ల సొంతూరు బలపనూరుకెళ్లి వారి మూడు ఇళ్లనూ చూశాను. సమాధుల దగ్గరకెళ్లి వైఎస్‌ఆర్‌ తాతగారు వెంకట రెడ్డి, తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ పుట్టిన తేదీలు, పోయిన తేదీలు, ఇతర బంధువులు చిన కొండారెడ్డి, పురుషోత్తమ రెడ్డి, రత్నమ్మల వివరాలు కూడా సేకరించాను. అన్ని తేదీలను సేకరించడం ఒకెత్తయితే వైఎస్‌ఆర్‌ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కోసం పడిన ప్రయాస చిన్నది కాదు. నా దగ్గర ఆయన గురించిన పదకొండు పుస్తకాలున్నాయి. అవన్నీ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన తర్వాతి ఘట్టాలకు అక్షర రూపాలే.

ఆయన తొలినాళ్ల గురించి తెలిసిన వాళ్లు పెద్దగా లేరు. తెలిసిన వాళ్లు కూడా విషయాలను చెప్పగలుగుతున్నారే తప్ప తేదీలను చెప్పలేకపోతున్నారు. దాంతో రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు ఏయే సంవత్సరాల్లో జరిగాయో తెలుసుకుని, ఆయన ఏ ఏడాది గెలిచిందీ తెలుసుకున్న తర్వాత లైబ్రరీలకెళ్లి పాత పేపర్లు వెతికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తేదీని (1978, మార్చి 15వ తేదీ) పట్టుకున్నాను. ఇంటర్‌నెట్‌లో ఏడాది ఉంది కానీ తేదీ లేదు. ఒకసారి దారి పట్టుకున్న తర్వాత ఇక నేను ఎక్కడా ఆగిపోలేదు. వైఎస్‌ తన గురువు వెంకటప్పయ్య పేరుతో స్కూలు కట్టిన తేదీ, ప్రపంచ వ్యవసాయ సదస్సులో ప్రసంగించిన తేదీ, ఆయన ముఖ్యమంత్రిగా ప్రారంభించిన స్కీముల తేదీలతో సహా ప్రతి ఘట్టాన్ని ఫైల్‌ చేశాను. నా దగ్గరున్న కరెన్సీ నోట్ల ఆల్బమ్‌ తిరగేస్తే... ఆ మహానుభావుడి జీవితం మొత్తం కళ్లకు కడుతుంది.


వైఎస్‌ఆర్‌ పెళ్లిరోజు (9–2–1972) 

ముగ్గురు నడిచిన నేల
నాకు వైఎస్‌ఆర్‌ పాదముద్రలే కాదు, తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన పిల్లలన్నా అంతే అభిమానం. రాజమండ్రి రోడ్డు కమ్‌ రైలు వంతెన మీద వైఎస్‌ఆర్‌ నడిచిన తేదీ, షర్మిలమ్మ నడిచిన తేదీ, జగన్‌మోహన్‌ రెడ్డి నడిచిన తేదీల కరెన్సీ నోట్లున్నాయి నా దగ్గర. అలాగే షర్మిలమ్మ పాదయాత్ర ప్రారంభ తేదీ, ముగింపు తేదీల కరెన్సీ నోట్లున్నాయి. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రనయితే మరీ విపులంగా ఫైల్‌ చేశాను. యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి వంద కిలోమీటర్ల మైలు రాయిని చేరిన తేదీలతోపాటు, ప్రతి పాతిక, యాభై... ఇలా ప్రతి రోజునూ రికార్డు చేశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నేళ్లలో ఆయన చేసిన ఓదార్పు యాత్ర, లక్ష్య దీక్ష, జల దీక్ష, జన దీక్ష, హరితయాత్ర, ఫీజు పోరు, రైతు దీక్ష, సాగు పోరు, మహా ధర్నా, కరెంటు పోరు, చేనేత దీక్ష, విద్యుత్‌ ధర్నా, విభజన వ్యతిరేక దీక్ష, బాబు వైఫల్యాల ధర్నా, సమైక్యాంధ్ర దీక్ష, సిఆర్‌డిఎ ధర్నా, పొగాకు రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్ష, కరువు ధర్నా... ఇలా ప్రతి ఘట్టాన్ని నోట్‌ చేశాను. ఆ తేదీలు వచ్చేటట్లు కరెన్సీ నోట్లు సేకరించాను. నాకు ఓపిక ఉన్నంత కాలం ఇలా సేకరిస్తూనే ఉంటాను. వీటన్నింటితో వైఎస్‌ఆర్‌ వర్ధంతి రోజున ప్రదర్శన పెట్టాలనేది నా కోరిక’’ అంటారు భాస్కర్‌ రెడ్డి.


వై.ఎస్‌.విజయమ్మ పుట్టినరోజు (19–4–1956)

ఒక్క పది రూపాయల నోటుకు మూడు వందలు చొప్పున ఇన్నేసి నోట్లను సేకరించడానికి భాస్కర్‌ రెడ్డి ఖర్చు చేసిన మొత్తం మూడు లక్షల వరకు ఉంటుంది. ఆయన మాత్రం ‘‘మహానుభావుడి మీద నాకున్న అభిమానానికి వెల కట్టలేను. ఆ ప్రేమ అమూల్యం’’ అంటారు.
- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top