ఇంటిపై ఈడెన్‌

Sujani Reddy is Growing a Variety Of Greens At The Eden Garden in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ వంటి మహానగరాలలో ఇంటి చుట్టూ తోట ఉన్న ఇల్లు అద్దెకు దొరకడం అసాధ్యమే. మరి మొక్కలను పెంచుకోవాలనే కోరిక ఎలా నెరవేరుతుంది? బాల్కనీలో కుండీలు, టెర్రస్‌ మీద కుండీలతో తృప్తి పడొచ్చు. అంతేకాదు, ఇంటివారు అనుమతిస్తే వంటకు కావలసిన కూరగాయలు కూడా పండించుకోవచ్చు.అందుకు టెర్రస్‌ గార్డెనింగ్‌ ఒక మంచి మార్గంఅని చెబుతున్నారు సుజనీరెడ్డి.

‘‘తోటలో పని చేస్తూంటే మనసుకు ప్రశాంతంగా అనిపించి, భూమి మీద స్వర్గసౌఖ్యాలు అనుభవించినట్లు అనిపిస్తుంది’’ అంటారు సుజనీరెడ్డి. హైదరాబాద్‌లోని వెంగళ్‌రావు నగర్‌లో ఉంటున్న ఈ మైక్రోబయాలజిస్టు, ఎప్పుడో ఏవో జరుగుతాయి అని కూర్చోవడం కంటే, ఏదో ఒక పని చేస్తూ ఉండటానికి ఇష్టపడతారు. తన అద్దె ఇంటి కప్పు మీదే ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ‘ఈడెన్‌ గార్డెన్‌’ లో కేవలం అందమైన మొక్కలు పెంచడం మాత్రమే కాదు, నిత్యం వండుకోవడానికి వీలుగా కూరగాయలు పండిస్తున్నారు. పళ్లు, రంగురంగుల కూరగాయలు, అనేక రకాల  ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం 300 చదరపు అడుగుల ప్రదేశంలోనే!

రైతుల సలహా తీసుకున్నారు
‘‘చిన్నప్పుడే మా బాల్కనీలో చిన్న చిన్న మొక్కలు పెంచేదాన్ని. బయట గార్డెన్లు చూడటానికి వెళ్లేదాన్ని. ప్రకృతికి దగ్గరగా ఉంటుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అభిరుచుల కారణంగానే చదువులో కూడా నా దృష్టి సైన్స్‌ మీదకు మళ్లింది’’ అంటారు సుజనీరెడ్డి. నాలుగు సంవత్సరాల క్రితం కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సుజనీ ఆ ఇంటి టెర్రస్‌ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. తాజాగా పండిన కూరగాయలతో మాత్రమే వంట చేయాలని సంకల్పించి విషతుల్యం కాని ఆహారం పండించడానికి కావలసిన సమాచార సేకరణ కోసం ఎందరో రైతులను కలిశారు. వారి సలహాలు తీసుకున్నారు.

రెండొందల రకాల మొక్కలు!
సుజనీ‘టెర్రస్‌ గార్డెనింగ్‌’కి సంబంధించిన వర్క్‌షాపులకు కూడా హాజరయ్యారు. వాటికి సంబంధించిన అనేక పుస్తకాలను చదివారు. ఆ అనుభవంతో టెర్రస్‌ గార్డెన్‌ ప్రారంభించారు. ఈ గార్డెన్‌ కోసం ఆమె తన ఇంట్లోని పాత పాత్రలను కుండీలుగా మార్చారు. ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ వంటి పాదులు పెంచారు. మట్టి బాగా గట్టిగా ఉండి, వేళ్లు బాగా లోపలకు చొచ్చుకుని పోలేక, మొక్కలు బాగా ఎదగలేకపోయాయి. కాని ఆమె తన ప్రయత్నం విరమించుకోలేదు. సేంద్రియ విధానంలో మొక్కలు పెంచుతున్న స్నేహితులతో మాట్లాడి, వారి నుంచి సమాచారం సేకరించారు. తెలగపిండి, వేప పిండి వంటివి వేయడం వల్ల మట్టి బాగా గుల్లగా అయ్యి, మొక్కలు పెరుగుతాయని తెలుసుకున్నారు. 40 శాతం మట్టి, 40 శాతం వెర్మి కంపోస్టు, 10 శాతం కొబ్బరి పీచు, 10 శాతం వేప పిండి వంటివి ఉపయోగించి మొక్కలు పెంచడం ప్రారంభించారు. రెండో సంవత్సరానికల్లా దిగుబడి అధికమైంది.ఇప్పుడు అదే మూడొందల చదరపు అడుగుల స్థలంలో సుజనీ 200 రకాలకు పైగా మొక్కలు పెంచుతున్నారు.

వంటకు సరిపడేలా కూరలు చక్కగా పండుతున్నాయి. రకరకాల టొమాటోలు, పచ్చి మిర్చితో పాటు, చైనీస్‌ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, ముల్లంగి, వెల్లుల్లి, ఉల్లి, బీన్స్, గ్రీన్‌ క్యాప్సికమ్‌... ఎన్నో కూరలు పండించుకుంటున్నారు. ఇంకా సొర, పొట్ల, బీర, కాకర, బూడిద గుమ్మడి, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటివి కూడా పండిస్తున్నారు. జామ, దానిమ్మ, పుచ్చకాయలు కూడా పండిస్తున్నారు. సహజ ఎరువులతో పాటు, సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నారు. వేసవికాలంలో ఎండ బారిన పడకుండా, వలను ఉపయోగిస్తున్నారు. మొక్కలకు చీడ పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాగా చీడ పడితే, వేప నూనెను పదిరోజులకొకసారి స్ప్రే చేస్తున్నారు. పులిసిన మజ్జిగలో నీళ్లు బాగా కలిపి, ఆ మజ్జిగను స్ప్రే చేయడం ద్వారా మొక్కలకు ఫంగల్‌ వ్యాధులు రాకుండా నివారిస్తున్నారు.
 
సొంతంగా ఎరువుల తయారీ

సుజనీ బి.ఎస్‌.సి. మైక్రోబయాలజీ చదివారు. ఎం.ఎస్‌.సి కెమిస్ట్రీలో చేరారు. కానీ కొనసాగించలేకపోయారు. పెళ్లి, పిల్లలతో మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. ‘‘మా పూర్వీకులందరూ వ్యవసాయం చేశారు. బహుశా వారి నుంచే మొక్కల మీద మమకారం వచ్చి ఉంటుంది. పెళ్లయినప్పటి నుంచి ఆర్గానిక్‌ వస్తువులే వాడటం మొదలుపెట్టాను. రసాయనాలు ఉపయోగించిన ఆహారానికి వీలైనంతవరకు దూరంగా ఉండాలన్నదే నా ధ్యేయం. నాలుగేళ్లుగా ఒక్కొక్క మొక్క పెంచుకుంటూ పెద్ద గార్డెన్‌ తయారు చేశాను. కూరగాయలు పెంచడం ప్రారంభించాను. మొక్కలకు వేయడానికి అనువుగా తెలగపిండి, కొబ్బరి పిండి, చెరకు పిప్పి వంటి వాటితో ఎరువులు చేస్తున్నాను. అన్నిరకాల ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నాను. ఉల్లిపాయలు, బంగాళ దుంపలు వంటివి మాత్రమే పండించట్లేదు. నీటి ఎద్దడి ఉన్నా కూడా ఎంతో జాగ్రత్తగా మొక్కలకు నీళ్లు పోస్తున్నాను’’ అని చెప్పారు సుజనీ. అందుకే ఈ గృహిణిని ఆదర్శ రైతు అని కూడా అనాలి.
– వైజయంతి పురాణపండ
ఫొటోలు : నోముల రాజేశ్‌రెడ్డి

ఎండ.. మట్టి.. నీళ్లు
చిన్న చిన్న బాల్కనీలు ఉంటే అక్కడ కనీసం నాలుగు కుండీలు పెట్టి, నాలుగు రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఆకులను తుంపుకుంటే, మళ్లీ చిగుళ్లు వస్తాయి. ఏదైనా మనం ప్రారంభించాలనుకుంటే, ఉత్సాహం అదే వస్తుంది. ఎండ మట్టి నీళ్లు మూడు ప్రధానం. ఇవి సరిగా చూసుకుంటే చాలు. విదేశాలలో ఇళ్లలోనే మొక్కలు పెంచుకుంటున్నారు. మనకు కావలసినంత ఎండ అందుబాటులో ఉన్నప్పుడు ఆ ఎండను వాడుకుని ఇంటి బయట మొక్కలు పెంచుకోవచ్చు కదా. కంటికి ఆనందం, ఒంటికి ఆరోగ్యం, ఇంటికి అలంకారంగా ఉంటాయి మొక్కలు.

మొక్కలూ నా పిల్లలే
ఇంట్లో పాత చెక్క పెట్టెలు, గ్రో బ్యాగ్స్, వాటర్‌ క్యాన్లలో పండిస్తున్నాను. పులిసిన పెరుగును మిక్సీ పట్టి, 1:10 నిష్పత్తిలో నీళ్లు కలిపి మొక్కల మీద వచ్చిన ఫంగస్, తెగుళ్ల మీద పిచికారీ చేస్తే, తెగుళ్లన్నీ పోతాయి. ఇది అందరూ అనుసరిస్తున్న పద్ధతే. మార్కెట్‌లో దొరికే వేపపిండిని కూడా కీటకనాశినిగా వాడుతున్నాను. ప్రతిరోజూ ఒక గంట సేపు మొక్కలతో గడుపుతాను. నేనే స్వయంగా మొక్కలకు నీళ్లు పోస్తాను. ఆ సమయంలోనే మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు ఎక్కడ కనపడినా వెంటనే వాటిని చంపేసి, మొక్కలను రక్షించుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప (13), ఒక బాబు (10). వీరితో పాటు మొక్కలన్నీ నా సంతానమే. ఈ ఏడాది సొరకాయలు పెద్ద సైజులో విస్తృతంగా పండాయి. నా ఆనందం ఇంతా అంతా అని చెప్పలేను.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top